Sun Nov 17 2024 05:49:40 GMT+0000 (Coordinated Universal Time)
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువకుడి చివరి లేఖ
ఆత్మహత్యకు ముందు.. చివరిగా అతను రాసిన లేఖను సోషల్ మీడియాలో పెట్టగా.. అది కాస్తా వైరల్ అయింది.
బాపట్ల : ప్రేమ..ఈ రెండు అక్షరాలకు రెండు జీవితాలను ఏకం చేసే శక్తి ఉంది. అలాగే ప్రాణాలను హరించేంత బాధను కూడా ఇస్తుంది. ఈ ఆధునిక యుగంలో ప్రేమ పేరుతో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ప్రేమించానంటూ ప్రేయసిపై అత్యాచారానికి పాల్పడటం, లేదా తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించడం.. వీలైతే చంపేయడం.. ఇవే జరుగుతున్నాయి. కానీ.. ఓ యువకుడు తన ప్రేమను యువతి ఒప్పకోలేదన్న మనస్తాపంతో చివరిగా ఒక లేఖ రాసి.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈవూరు మండలం బోడిశంభువానిపాలెం సమీపంలో రోడ్డు పక్కనున్న చింతచెట్టుకు మాచర్ల గోపిరాజు అనే వ్యక్తి మే 21వ తేదీన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు.. చివరిగా అతను రాసిన లేఖను సోషల్ మీడియాలో పెట్టగా.. అది కాస్తా వైరల్ అయింది. ఓ అమ్మాయి.. నిన్ను మరిచిపోవాలంటే నేను చచ్చిపోవాలని చెప్తూ.. అతను రాసిన లేఖ అందరి హృదయాలను కలచి వేసింది.ఆ లేఖలో ముందుగా తన మృతదేహాన్ని అన్నయ్యకు అప్పజెప్పాలంటూ.. ఫోన్ నంబర్ రాశాడు. ఆ తర్వాత తన ప్రేయసి గురించి కవిత్వం రాశాడు.
"ఏ అమ్మాయి.. నువ్వే గెలిచావు.. నేనే ఓడిపోయా.. నేను తప్పూ చేయలేదు.. నేను ఎప్పుడూ ఓడిపోలా. ఇప్పుడే ఓడిపోయా. ఈ జన్మకు నువ్వే నా భార్యవని ఊహించుకున్నా కానీ.. నాకు ఆ అదృష్టం లేదు, నేను నిన్ను మరిచిపోలేకపోతున్నా. నిన్ను మరిచిపోవాలంటే ముందు నేను చచ్చిపోవాలి. ఐ మిస్ యూ. లైఫ్ లో ఎప్పుడూ కనిపించను. నా చావుకు నేనే కారణం" అని లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖను చదివిన వారంతా.. అమ్మాయి ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రొంపిచర్ల మండలం విప్పర్లకు చెందిన గోపిరాజు వినుకొండలో పనులు చేస్తుండేవాడు. అక్కడున్న స్నేహితులకు సొంతూరికి వెళ్తున్నట్లు చెప్పి.. వినుకొండ దాటగానే రోడ్డు పక్కనున్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Next Story