ఫలించని ఫేస్బుక్ ప్రేమ.. విషాదం
యువతీ యువకులు ఆకర్షణకు లోనవడం.. వారి మధ్య పరిచయాలు ప్రేమకు దారితీయడం ఈ రోజుల్లో వెరీకామన్. కానీ.. ఆమె నో చెప్పిందనో.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోలదనో కొందరు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నరు. అంతులేని ఆవేశంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ ఉజ్వల భవిష్యత్తులు అర్థాంతరంగా ముగించేస్తున్నారు. అలాంటి ఓ యువకుడి విషాదగాథ వెలుగుచూసింది. ఫేస్బుక్ ప్రేమ విఫలమైందనే బాధతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు మహేష్(21)కి ఫేస్బుక్లో ఓ యువతి పరిచయమైంది. యువతిని గాఢంగా ప్రేమించిన మహేష్ ఆమె కాదనడంతో తట్టుకోలేకపోయాడు. తన ప్రేమ విఫలం కావడంతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి పొలంలో పడిపోయాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.