Mon Dec 23 2024 10:54:01 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేయసి మరొకరిని పెళ్లాడటంతో.. యువకుడి బలవన్మరణం
కన్నతల్లిదండ్రుల గురించి క్షణమైన ఆలోచించకుండా.. ఆమె లేని జీవితం వద్దనుకున్నాడు. సోమవారం (మార్చి13) రాత్రి..
ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. నువ్వు లేక పోతే నేనుండలేను అని చెప్పుకున్న కబుర్లెన్నో. కలకాలం కలిసుండాలని కలలు కన్నారు. జీవితాంతం తోడుంటానని మాట కూడా ఇచ్చింది. కానీ.. ఏమైందో ఏమో గానీ.. ఉన్నట్టుండి మరో వ్యక్తితో ఏడడుగులూ నడిచింది. ఆ విషయం తెలిసి ప్రియుడి గుండె ముక్కలైంది. అంతలోనే ఆమె పెళ్లి ఫొటోలు కంటపడటంతో ఇక బతకలేననుకున్నాడు. ప్రేయసి మెడలో కట్టాలనుకున్న తాళిని జేబులో ఉంచుకుని ఇంటికి సమీపంలోని చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామం వినాయకనగర్ కాలనీలో పందిగొట్ల లక్ష్మయ్య, అనంతమ్మ దంపతులు ముగ్గురు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి రెండో కొడుకైన గణేష్ (23) లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్కడికి సమీపంలోని యువతిని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతి కూడా గణేష్ ను ప్రేమిస్తోంది. ఆమెనే సర్వస్వం అనుకున్నాడు. పెళ్లిచేసుకుని కలిసుండాలని ఆశపడ్డాడు.
కానీ ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు ఇటీవలే మరో యువకుడితో వివాహం జరిపించారు. ఆమె పక్కన నిలబడాల్సిన తన స్థానంలో మరో యువకుడిని చూసి తల్లడిల్లిపోయాడు. కన్నతల్లిదండ్రుల గురించి క్షణమైన ఆలోచించకుండా.. ఆమె లేని జీవితం వద్దనుకున్నాడు. సోమవారం (మార్చి13) రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయానికి మునగనూరు శివారులో ఓ చెట్టుకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని జేబులో తాళిబొట్టు లభ్యమైంది. గణేష్ బలవన్మరణంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story