Mon Dec 23 2024 12:58:26 GMT+0000 (Coordinated Universal Time)
యజమాని ఆత్మహత్య.. కిందికి దింపేందుకు పెంపుడు శునకం ప్రయత్నం.. ఆ తర్వాత ?
యువకుడి ఆత్మహత్య గురించి తెలిసి ఇంటికి వచ్చిన పోలీసులను గదిలోకి కూడా రానివ్వలేదు. దాంతో ఆ కుక్కకు మత్తుమందు ఇచ్చి..
ఒక్కరోజు అన్నం పెట్టినా.. జీవితాంతం గుర్తుంచుకుంటాయి శునకాలు. ఆ విశ్వాసాన్ని జీవితాంతం చూపిస్తాయి. ఇక ఇళ్లలో పెంచుకునే శునకాలైతే.. యజమాని ఒక్కరోజు కనిపించకపోతే చాలు.. బెంగపెట్టేసుకుంటాయి. లేదా యజమాని కోసం వెతుక్కుంటూ వెళ్తాయి. ఓ యువకుడు తన పెంపుడు శునకం కళ్లముందే ఆత్మహత్య చేసుకున్నాడు. తన యజమాని ఏదో ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన ఆ శునకం అతడిని కిందికి దింపేందుకు ఏకంగా నాలుగు గంటలపాటు ప్రయత్నించింది.
యువకుడి ఆత్మహత్య గురించి తెలిసి ఇంటికి వచ్చిన పోలీసులను గదిలోకి కూడా రానివ్వలేదు. దాంతో ఆ కుక్కకు మత్తుమందు ఇచ్చి.. ఒక బోనులో పెట్టారు. పాపం.. యజమాని ఇక లేడన్న బాధో లేక మత్తుమందు మోతాదు ఎక్కువైందో గానీ.. ఆ శునకం కూడా మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో వెలుగుచూసింది. సంభవ్ అగ్నిహోత్రి అనే యువకుడు పంచవటి కాలనీలో తన తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. తండ్రి ఆనంద్ అగ్నిహోత్రి రైల్వే శాఖ ఉద్యోగి. తల్లి అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఆనంద్ అగ్నిహోత్రి తన భార్యను చికిత్స కోసం భోపాల్‌కు తీసుకెళ్లారు.
శనివారం (మే 6) ఆనంద్ కొడుక్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు. దాంతో ఎదురింటి వారికి, పక్కింటివారికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఓసారి ఇంటికెళ్లి చూడమని కోరగా.. సంభవ్ ను చూసేందుకు ఇంటికెళ్లినవారిపై పెంపుడు కుక్క అలెక్స్ దాడి చేసింది. అప్పటికే సంభవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అతని తండ్రికి, పోలీసులకు వారు సమాచారమిచ్చారు. కానీ అలెక్స్ పోలీసులను కూడా ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడంతో దానికి మత్తుమందిచ్చి, బంధించి సంభవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బోనులో బంధించిన అలెక్స్ కొద్దిసేపటికి మరణించింది. దాంతో స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలెక్స్ కు అధిక మోతాదులో మత్తుమందివ్వడం వల్లే మరణించిందని స్థానికులు ఆరోపించారు.
Next Story