Sun Nov 17 2024 21:57:55 GMT+0000 (Coordinated Universal Time)
మతాంతర వివాహం.. భర్త మిస్సింగ్, అత్తింటి ఎదుట భార్య ఆందోళన !
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ సనా అనే యువతికి 2019లో ఈసెట్ కు శిక్షణ తీసుకుంటున్న సమయంలో రమేష్ కుమార్..
నల్గొండ చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. ఇంట్లో పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని, అత్తింట్లో కోటి ఆశలతో అడుగు పెట్టింది ఆ యువతి. మర్నాటి నుంచే వేధింపులు మొదలయ్యాయి. జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన భర్త ఆమెను వదిలి పరారయ్యాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువతి అత్తింటి ఎదుట.. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ సనా అనే యువతికి 2019లో ఈసెట్ కు శిక్షణ తీసుకుంటున్న సమయంలో రమేష్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 4వ తేదీన మదనపల్లె మండలంలోని ఓ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని, వరుడి ఇంటికి వెళ్లారు. తొలిరోజు కోడలిని బాగానే చూసుకున్న అత్తింటివారు.. మర్నాటి నుంచి ఇబ్బందులకు గురిచేయడం మొదలుపెట్టారని సనా వాపోతోంది. ఆహారం పెట్టకుండా.. చాలా వేధించారని, వారి వేధింపులు భరించలేక నూతన దంపతులిద్దరూ మదనపల్లె ఎస్టేట్ లో ఓ ఇంట్లోకి అద్దెకు వెళ్లారు. ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు.
కానీ.. మూడ్రోజుల క్రితం ఇంటి నుంచి ఏదో పనినిమిత్తం బయటికి వెళ్లిన రమేష్ కుమార్ తిరిగి రాకపోవడతో సనా ఆందోళన చెందింది. అత్తింటి వారిని అడిగితే తమకు తెలియదని చెప్పారు. ఏం చేయాలో తెలియక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మతాంత వివాహం కావడంతో అత్తింటి వారు తనను గృహహింస పెట్టారని తెలిపింది. రమేష్ కుమార్ను వదిలేయాలని అతని కుటుంబ సభ్యులు, కొందరు వైకాపా నాయకులు తనను బెదిరించడంతో పాటు కొట్టారని, తాను వెళ్లనని పట్టుబట్టడంతో ఇలా చేశారని అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఇదిలా ఉండగా.. సనా కుటుంబ సభ్యులే రమేష్ ను ఏదో చేసి ఉంటారని రమేష్ కుమార్ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story