Mon Dec 23 2024 10:11:56 GMT+0000 (Coordinated Universal Time)
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
తాజాగా మరో యువకుడు ఆన్లైన్ లోన్ యాప్ ల వేధింపులకు బలయ్యాడు. లోన్ యాప్ వేధింపులు భరించలేక.. హైదరాబాద్ శివార్లలో..
ఇటీవల కాలంలో ఆన్ లైన్లో ఎలాంటి డాక్యుమెంట్స్, ప్రూఫ్ లు లేకుండా.. కేవలం ఆధార్, పాన్ కార్డులతో లోన్లు ఇస్తామంటూ మెసేజ్ లు పెట్టి.. ఆ తర్వాత తీసుకున్న లోన్ కట్టాలని..లేకపోతే మీ ఫొటోలు, వీడియోలను మీ స్నేహితులకు, బంధువులకు పంపిస్తామంటూ వేధిస్తున్నారు. తీసుకున్న లోన్ మొత్తాన్ని చెల్లించినా.. ఇంకా కట్టాల్సింది ఉందంటూ బెదిరిస్తున్నారు. అలాంటి బెదిరింపులు భరించలేక చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతూ.. తమ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.
తాజాగా మరో యువకుడు ఆన్లైన్ లోన్ యాప్ ల వేధింపులకు బలయ్యాడు. లోన్ యాప్ వేధింపులు భరించలేక.. హైదరాబాద్ శివార్లలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. షాద్ నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు సాయిచరణ్ (24). సాయి చరణ్ తన అవసరాల నిమిత్తం లోన్ యాప్ లో రూ.20 వేలు తీసుకున్నాడు. తీసుకున్న మొత్తానికి దాదాపు మూడు రెట్లు అధికంగా చెల్లించాడు. అయినా.. ఇంకా డబ్బు కట్టాలంటూ నిర్వాహకులు వేధిస్తుండటంతో తట్టుకోలేక.. రైలు కిందపడి బలన్మరణానికి పాల్పడ్డాడు.
బలవన్మరణానికి కొద్దిరోజుల ముందే సాయిచరణ్ ఇంటి నుండి వెళ్లిపోతున్నట్లు తన స్నేహితులకు చెప్పాడు. అలా వెళ్లిపోయిన సాయి చివరికి సొంత గ్రామంలో రైలు పట్టాల దగ్గర శవమై తేలడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లిపోతున్నారు. కాగా.. 10వ తరగతి పూర్తి చేసిన సాయిచరణ్.. స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులకు అతడే ఆధారమని కుటుంబసభ్యులు తెలిపారు. రూ. 20 వేల లోన్ కి రూ.60 వేలు చెల్లించాడని, తన బైక్ ని కూడా అమ్మేశాడని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story