Sat Dec 21 2024 08:22:30 GMT+0000 (Coordinated Universal Time)
2023 HOROSCOPE : నేటి పంచాగం.. 2023లో 12 రాశులవారి ఫలితాలు, పరిహారాలు, అదృష్టసంఖ్య
2023 ఆంగ్ల సంవత్సరాది రాశిఫలాలు
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, శనివారం
తిథి : శు.దశమి రా.7.11 వరకు
నక్షత్రం : అశ్వని మ.12.48 వరకు
వర్జ్యం : ఉ.8.33 నుండి 10.18 వరకు, రా.11.03 నుండి 12.45 వరకు
దుర్ముహూర్తం : సా.4.14 నుండి 4.58 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.15 నుండి 12.10 వరకు
2023 ఆంగ్ల సంవత్సరాది రాశిఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. లాభనష్టాలు సరిసమానంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, బాధ్యతలు పెరుగుతాయి. శుభకార్యాలకు ఈ ఏడాది చాలా అనువైనదిగా ఉండబోతోంది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. పక్కవారి మాటల్ని వినకుండా.. మీ ఆలోచనలతో ముందుకు వెళ్లినంతవరకూ ఇబ్బందులు ఉండవు. వ్యవసాయరంగాల్లో వారికి, వృత్తి, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలుంటాయి. విద్యార్థినీవిద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మెరుగుదల కనిపిస్తుంది.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 9. దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ సంవత్సరంలో.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆస్తుల విలువలు పెరుగుతాయి. సంవత్సరం చివరిలో కోర్టు కేసుల్లో విజయాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులు, కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థినీ విద్యార్థులు కూడా శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 6. ఆంజనేయస్వామి, దత్తాత్రేయ స్వామివారిని ప్రతిరోజూ పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ సంవత్సరం.. అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. గతేడాది కంటే ఆర్థికంగా యోగదాయకమైన ఫలితాలుంటాయి. కష్టాల కడలి నుండి బయటపడుతున్నామన్న భరోసా ఉంటుంది. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సినీ, కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, బ్యాంకింగ్ - ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి 2023లో మంచి ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 5. ప్రతిరోజూ ఆంజనేయస్వామిని పూజించడంతో.. ఉత్తమమైన ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ సంవత్సరం.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతేడాది కంటే.. ఈ ఏడాది ప్రతి విషయంలో నైపుణ్యాన్ని కనబరుస్తూ, నిదానమే ప్రధానంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కానీ.. విదేశాలకు వెళ్లడం వల్ల పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బంధువర్గంతో తగాదాలు లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యార్థినీ విద్యార్థులు అధికంగా శ్రమించాలి. నూతన వ్యాపారాలకు అనుకూలమైన కాలం కాదు.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 2. ప్రతిరోజూ దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ సంవత్సరం అప్పులు తీరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి విషయంలో.. గతేడాదికంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలుంటాయి. ఉన్నత విద్యాభ్యాసానికి ఆటంకాలు తొలుగుతాయి. ప్రమోషన్స్ లభిస్తాయి. రాజకీయ, కాంట్రాక్ట్ రంగాలవారికి అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు కార్యరూపం దాలుస్తాయి. బాధ్యతలను పూర్తిచేశామన్న సంతృప్తి ఉంటుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. పొరపొచ్చాలు తొలగిపోతాయి. ఏడాది చివరిలో.. అంటే నవంబర్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 1. ప్రతిరోజూ దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందుతారు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ సంవత్సరంలో.. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైస్ మిల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి, ఉద్యోగస్తులకు కొంతవరకూ మేలు జరుగుతుంది. శత్రుబలం తగ్గుతుంది. మధ్యవర్తిత్వం, షూరిటీ సంతకాలు, అప్పులివ్వడం, అప్పులు తీసుకోవడం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే.. అంత మంచిది. వైద్య సంప్రదింపులు తప్పకపోవచ్చు. నవంబర్ నెల నుండి అనుకూలమైన మార్పులు ఉంటాయి. అప్పటివరకూ అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. క్రయవిక్రయాల్లో తొందరపాటు తగదు. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 5. ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ సంవత్సరంలో.. అనుకూల ఫలితాలుంటాయి. గతేడాది కంటే ఈ ఏడాది మంచి ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుదల పెరుగుతుంది. కోపం పెరుగుతుంది. బంధువులతో విరోధాలు, అభిప్రాయ బేధాలు పెరుగుతాయి. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘ గౌరవం పెరుగుతుంది. స్వయం ఉపాధి, రాజకీయ నాయకులకు, సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు కూడా అనుకూలతలు పెరుగుతాయి. శ్రద్ధ పెరుగుతుంది. ఆగిపోయిన పనుల్లో వేగం, చురుకుదనం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. పొదుపుపై దృష్టిసారిస్తారు.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 6. ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ సంవత్సరంలో.. వీలైనంత వరకూ నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకుని ముందుకు సాగాలి. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. కోర్టు కేసుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల పరంగా కీలకమైన నిర్ణయాలకు ఏమాత్రం అనుకూలం కాదు. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆస్తుల అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ రంగాల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ప్రతి పనిలో నష్టాలను అంచనా వేసి ముందుకెళ్లడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 9. ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసి, శునకానికి ఆహారం పెడుతూ ఉంటే.. మంచి ఫలితాలు ఉంటాయి.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ సంవత్సరంలో.. అన్నివిధాలా కలిసివస్తుంది. గత ఏడాదికంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యాలు నిశ్చయమవుతాయి. సంతానం కలుగుతుంది. పదవులు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్యను పూర్తి చేస్తారు. డాక్టరేట్ పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటుంది. నవంబర్ నెల నుండి జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 3. ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించి, దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మరిన్ని మెరుగైన ఫలితాలు పొందుతారు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ సంవత్సరంలో.. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమకు తగిన ఫలితాలు ఆశించిన మేర ఉండవు. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలమైన కాలం కాదు. దృష్టి దోషం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నవంబర్ నెల తర్వాతి నుండి కోర్టుకేసుల్లో అనుకూలమైన మార్పులు జరిగి.. సానుకూలమైన ఫలితాలు రావొచ్చు. విద్యార్థులు అధికంగా శ్రమించాలి.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 8. ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రం, శివ కవచ స్తోత్రాలను పారాయణ చేయాలి. ప్రతిరోజూ శివుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ సంవత్సరంలో.. ఆర్థికపరంగా సాధారణంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆఖరి నిమిషంలో విజయం పొందుతారు. అప్పటివరకూ టెన్షన్ పడుతూ ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో సవాళ్లు ఎదురవుతాయి. వ్యవసాయ దారులకు, కార్మికులకు, ఉద్యోగస్తులకు సాంకేతిక రంగాల్లో ఉండేవారికి, రాజకీయ, న్యాయవాద రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు తరచుగా అనారోగ్య సమస్యలు రావడంతో ఆందోళన చెందుతారు. సమస్యల నుండి బయటపడతారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 8. ప్రతిరోజూ శివుడిని దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ సంవత్సరంలో.. ఆర్థికంగా మెరుగైన ఫలితాలుంటాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విదేశాల పట్ల మక్కువ పెరుగుతుంది. శుభకార్యాలు నెరవేరుతాయి. సంతానం కలుగుతుంది. దీర్ఘకాలంగా శుభకార్యం కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక తీరుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టర్లు, డీలర్లకు సానుకూలంగా ఉంటుంది. నవంబర్ తర్వాత అన్నివిధాలా జాగ్రత్త వహించాలి.
ఈ ఏడాది మీకు కలసివచ్చే అదృష్ట సంఖ్య 3. ప్రతిరోజూ ఆంజనేయస్వామి వారిని పూజించడం వల్ల మంచి ఫలితాలుటాయి.
Next Story