Sat Dec 21 2024 15:12:17 GMT+0000 (Coordinated Universal Time)
అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకూ ద్వాదశ రాశుల రాశిఫలాలు
ఈవారం (అక్టోబర్ 2 నుంచి 8 వరకు) ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ?ఏ సమయం మంచిది ? ఏ సమయంలో చేయకూడదు ?
వ్యాపారం, ఇంటి పనులు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు.. ఇలా కొత్తగా ఏ పని చేయాలన్నా.. ముందు మంచి, చెడులను చూస్తారు. మంచి పని చేయడానికి ఏ సమయం మంచిది ? ఏ సమయంలో చేయకూడదు ? అలాగే ఈవారం (అక్టోబర్ 2 నుంచి 8 వరకు) ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ? అన్న విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : శు.సప్తమి సా.6.47 వరకు
నక్షత్రం : మూల తె.1.53 వరకు
వర్జ్యం : ఉ.10.45 నుండి 12.16 వరకు
రా.12.22 నుండి 1.53 వరకు
దుర్ముహూర్తం : సా.4.17 నుండి 5.05 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.15 నుండి 9.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం తగు జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయంలో జాగ్రత్త పాటించాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఈ వారం మంగళ, బుధ, శుక్ర, శనివారాలు కలసివస్తాయి. అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం సాధారణ ఫలితాలుంటాయి. వారం ఆరంభంలో, చివరిలో ఇబ్బందికర విషయాలు జరుగుతాయి. ఎవర్నీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడతాయి. అప్పులు చేస్తారు. స్థల క్రయ, విక్రయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. తప్పనిసరిగా చేయాల్సిన పనులు మినహా.. మిగతా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ఆది, సోమవారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మంచి ఫలితాలుంటాయి.
కర్కాటకం
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూలమైన ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ, విక్రయాలకు సంబంధించిన అంశాల్లో స్పష్టత వస్తుంది. చేపట్టిన పని పూర్తవుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగవచ్చు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. శివ కవచ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. అపోహలు తొలగిపోతాయి. ఆర్థిక పరమైన విషయాలు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో చికాకులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం మంచిది.
కన్యారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం సానుకూల ఫలితాలుంటాయి. కోర్టు కేసులు ముందుకు వెళ్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలుంటాయి. ఒకటికి రెండు సార్లు పనులు చేయాల్సి ఉంటుంది. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం పారాయణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పనులు వాయిదా పడుతుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో టెన్షన్లు పెరగవచ్చు. కాళ్లనొప్పులు, నడుమునొప్పి బాధిస్తాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అప్పులు ఇవ్వడం, చేయడానికి దూరంగా ఉండాలి. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలిస్తాయి. శివ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. తగాదాలు, విబేధాలు సమసిపోతాయి. బ్యాంకు రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. దీర్ఘకాలంలో వేధిస్తోన్న అనారోగ్యం నుంచి బయటపడతారు. పాత, కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. ఈ వారం మంగళ, బుధవారాలు కలసివస్తాయి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కోర్టుకేసులు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రహస్య విషయాలను ఇతరులతో చర్చించడం మంచిది కాదు. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు కలసివస్తాయి. శివ కవచ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులపై దృష్టి సారిస్తారు. శతృబలం పెరుగుతుంది. దృష్టిదోషం అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వాహన కొనుగోళ్లు సానుకూలంగా ఉంటాయి. భార్య-భర్తల మధ్య విబేధాలు సహజం. మానసికంగా ఒత్తిడి తప్పదు. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అన్ని విషయాల్లో జాగ్రత్త పాటించాలి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం. మంచికి పోతే చెడు ఎదురైన చందంగా సంఘటనలు ఉంటాయి. శుభకార్యాల విషయంలో ఆచి తూచి అడుగులు వేయడం మంచిది. ఈ వారం ఆది, సోమవారాలు కలసివస్తాయి. ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయడం మంచిది.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. బ్యాంక్ రుణాలు కలసివస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి అధికమవుతుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
Next Story