Mon Dec 23 2024 02:28:39 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, జనవరి 22 నుండి 28 వరకు వారఫలాలు
ఇంట్లో పనివారు, మీ కింద పనిచేసే ఉద్యోగుల సహాయ సహకారాలు కొరవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, ఆదివారం
తిథి : శు.పాడ్యమి రా.10.27 వరకు
నక్షత్రం : శ్రవణం తె.3.21 వరకు
వర్జ్యం : ఉ.9.53 నుండి 11.22 వరకు
దుర్ముహూర్తం : సా.4.25 నుండి 5.10 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.00 నుండి 8.50 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
తుల - కేతువు
ధనస్సు - బుధుడు
మకరం - రవి
మకరం, కుంభం - శుక్రుడు
కుంభం - శని
మీనం -గురువు
చంద్రగ్రహ సంచారం
మకరం, కుంభం, మీనం, మేషం
జనవరి 22 నుండి 28 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలో చురుకుగా వ్యవహరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూల పడతాయి. అన్ని వృత్తులు, అన్ని వయసుల వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ యధాశక్తిగా దుర్గాదేవి అమ్మవారిని పూజించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు నిరుత్సాహ పరుస్తాయి. ప్రతి ఖర్చుకీ.. డబ్బును వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పు ఎవరిదైనా నింద మీపై పడటంతో.. మనసుకి కష్టం కలుగుతుంది. ఇంట్లో పనివారు, మీ కింద పనిచేసే ఉద్యోగుల సహాయ సహకారాలు కొరవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకే సమయంలో అనేక పనులతో సతమతమవుతారు. విదేశీయానానికి అనుకూలమైన సమయం కాదు. సంతానంతో తగాదాలు ఏర్పడుతాయి. విద్యార్థినీ విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. ఈ వారం మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవ, మర్యాదలు తగ్గుతాయి. ఎదుటివారితో అపార్థాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి సంబంధిత క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరేమన్నా.. మౌనం పాటించడం మంచిది. స్నేహితులకు సహాయం చేసి నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని, నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. కష్ట, నష్టాలుండవు. అలాగే అద్భుతమైన ఫలితాలు కూడా ఉండవు. ఉద్యోగులకు నూతన అవకాశాలు కలసివస్తాయి. ఉద్యోగమార్పుకు తెలియని భయం వెంటాడుతుంది. ఆరోగ్యం నలత చెందవచ్చు. వివాహాది శుభకార్యాలు సానుకూలంగా సాగుతున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. గతం పదే పదే గుర్తొస్తుంది. మానసిక చింత పెరుగుతుంది. ఈ వారం ఆది, శనివారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా.. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్తారు. ఆర్థిక స్థితిగతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో చేసిన అప్పులు తీరకపోగా.. కొత్త రుణాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటి నుండే అమ్మాలనుకుంటున్న ఆస్తుల విలువ తగ్గుతుంది. ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా ఇబ్బందిగా ఉంటుంది. బంగారం వంటి వ్యాపారాలు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. మీ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. శుభకార్యాలు కూడా ముందుకి సాగుతాయి. కోర్టు కేసులు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనసుకి నచ్చిన ప్రదేశాన్ని సందర్శిస్తారు. విహార, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్ర వారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జున కృత దుర్గాస్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూలమైన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. పాత అభిరుచుల్ని కొనసాగిస్తారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఇంట్లో తరచుగా గొడవలతో విసుగు చెందుతారు. దంపతుల మధ్య తగాదాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడూ ఏదోక ఆలోచనలో ఉంటారు. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ యధాశక్తిగా శివారాధన చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఊహించినంత త్వరగా ఫలితాలు రావు. ఆస్తుల అమ్మకాలు లేదా కొనుగోళ్లు ముందుకు సాగవు. మీ బాధ్యతల్ని నెరవేర్చుకుంటారు. ఉన్నత విద్యను అభ్యసించేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. ఈ వారం ఆది, శనివారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఏలినాటి శని లేకపోయినా.. ఆశించిన ఫలితాలు పొందలేరు. ఏం మాట్లాడినా అపార్థాలు ఎదురవుతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. తగాదా పడితే తప్ప పనులు కాని పరిస్థితులు ఏర్పడుతాయి. కుటుంబం గురించి శ్రద్ధ తీసుకుంటారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు, బహుమతుల కొనుగోళ్ల వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం మంగళ,బుధ వారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. సహకరించే గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉంది. ధన, కుటుంబ, వాక్ స్థానాల్లో శని ప్రభావం ఉండటంతో ఎదుటివారు మంచికి చెప్పినా అపార్థం చేసుకుంటారు. భార్య, భర్తల మధ్య అన్యోన్యత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విడాకుల నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ మార్పులకు అనుకూలం కాదు. వ్యాపారస్తులకు నామమాత్రపు ప్రయోజనాలే ఉంటాయి. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. గతంలో ఆగిన పనుల్లో కదలికలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. బంధువర్గానికి దూరంగా, స్నేహవర్గానికి దగ్గరగా ఉంటారు. మధ్యవర్తిత్వంతో సమస్యలు పరిష్కారమవుతాయి. దూరప్రాంత ప్రయాణాలు సొంతవాహనాల్లో చేయకపోవడం మంచిది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ వారం మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని యధాశక్తిగా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలను నేర్పుగా సర్దుబాటు చేసుకుంటారు. ఎదుటివారికి చేతనైన సహాయ, సహకారాలను అందిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులకు అనుకూల సమయం కాదు. అధికారుల అండదండలుంటాయి. రాజకీయరంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. వేళకు నిద్రాహారాలు కొరవడతాయి. విశ్రాంతి తీసుకునే తీరిక ఉండదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు మినహా అన్ని రోజులూ అనుకూలమైన ఫలితాలుంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story