Mon Nov 25 2024 09:13:39 GMT+0000 (Coordinated Universal Time)
పోలి పాడ్యమి విశిష్టత.. పోలి స్వర్గం వెనకున్న పురాణ కథ ఇదే..
పెరటులోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి.. దానితో ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం..
పోలి పాడ్యమి.. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసం శివుడిని పూజిస్తే.. మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. పోలి పాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి.. నీటి కొలనులు, చెరువులు, నదుల్లో పసుపు కుంకుమలతో వదులుతారు. ఇలా ఎందుకు చేస్తారు ? దాని వల్ల కలిగే ఫలితాలేంటో తెలుసుకుందాం.
కార్తీక మాసం పూర్తికాగానే గుర్తొచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఆవిడ ఎవరు ? ఎందుకు పూజిస్తారు ? అంటే ఆసక్తికరమైన కథలు చెప్తుంటారు. ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు, కోడళ్లు ఉండేవారు. అందరిలోకెల్లా చిన్నాకోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా, వ్రతాలన్నా ఆసక్తి. కానీ.. ఆమె చూస్తే అత్తగారికి కంటగింపుగా ఉండేది. పూజలు చేయడంలో తనను మించి భక్తురాలు లేరని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది.
కార్తీక మాసంలో చిన్నకోడలు మినహా.. మిగతా కోడళ్లను కూడా తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి.. దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది. తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్నకోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామానులన్నింటినీ వెంట తీసుకెళ్లేది అత్తగారు. కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.
పెరటులోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి.. దానితో ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది. కార్తీక మాసమంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఆఖరిరోజైన అమావాస్య రానే వచ్చింది. ఆరోజు నదీస్నానం చేసి.. దీపారాధన చేసేందుకు బయల్దేరింది అత్తగారు. వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పజెప్పి.. దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులన్నీ ముగించుకుని దీపాన్ని వెలిగించింది.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు. ఊరిజనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు.. పోలి కాలు పట్టుకుని కిందికి లాగుతుంది. మిగతా నలుగురు కోడళ్లు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు. ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టేస్తారు. పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి..పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకీ స్వర్గ ప్రాప్తి కలగాలని కోరుకుంటారు. ఇదీ పోలిపాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ.
Next Story