Fri Nov 22 2024 20:58:08 GMT+0000 (Coordinated Universal Time)
UGADI HOROSCOPE : ఉగాది రాశిఫలాలు.. తులారాశి నుంచి మీన రాశి వరకూ ఆదాయ- వ్యయాలు, ఫలితాలు
ఉద్యోగ, వ్యాపార, వృత్తి పరంగా ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారస్తులు కూడా అనుభవం..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బుధవారం
తిథి : శు.పాడ్యమి రా.8.20 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర మ.3.32 వరకు
వర్జ్యం : రా.2.50 నుండి 4.21 వరకు
దుర్ముహూర్తం : మ.11.50 నుండి 12.38 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.30 నుంచి 10.20 వరకు
తులా రాశి
ఆదాయం -14
వ్యయం-11
రాజ్యపూజ్యం -7
అవమానం-3
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో.. సంపూర్ణంగా అర్థాష్టమ శనిదోషం తొలగిపోయి.. గురుబలం ఏర్పడుతుంది. సంవత్సరం ద్వితీయార్థంలో రాహుబలం వస్తుంది. ఈ ఏడాది తులారాశివారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు ఉద్యోగ ఉన్నతి పొందుతారు. వృత్తిలో ఎదుగుదల సాధించే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. గడిచిన కాలంకంటే ఈ ఏడాది మెరుగ్గా ఉంటుంది.
ఆర్థికంగా ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. సొంతింటి కల నెరవేరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో స్థిరపడే అవకాశాలను అందిపుచ్చుకుంటారు.కోర్టు కేసుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. గౌరవ, మర్యాదలకు ప్రాముఖ్యతనిస్తారు. ప్రతి పనినీ దగ్గరుండి పూర్తిచేసుకుంటారు. బంధువులతో విరోధం ఏర్పడవచ్చు. నేను, నా కుటుంబం బాగుంటే చాలన్న గిరిలోనే ఉంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్లాన్ ప్రకారం పూర్తిచేస్తారు. రకరకాల ప్రయత్నాలు చేసి.. కొంతవరకూ ప్రయోజనాన్ని పొందుతారు. ముక్కుసూటితనంతో ఇబ్బంది పాలవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దరికి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టరు.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఏదైనా సమస్య వచ్చి.. అది తీరట్లేదు అనుకుంటే.. తిరుమల వేంకటేశ్వరస్వామికి మనసులో నమస్కారం చేసుకుని, సమస్య తీరాక స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకోవాలి.
వృశ్చిక రాశి
ఆదాయం -5
వ్యయం-5
రాజ్యపూజ్యం -4
అవమానం-5
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో.. అర్థాష్టమ శని ప్రారంభమవడం, గురు బలం తగ్గడం, సంవత్సర ద్వితీయార్థంలో రాహుబలం తగ్గుతుండటంతో ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి పరంగా ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారస్తులు కూడా అనుభవం లేనివాటిలోకి పోకపోవడం మంచిది. ఆర్థిక విషయంలో.. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వివాహ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయాల్సి ఉంటుంది. వివాహాలు, శుభకార్యాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. చాలాకాలంగా విడాకుల కోసం ప్రయత్నించేవారికి విడాకులు మంజూరవుతాయి. సంతానంలేని వారికి సంతానం కలుగుతుంది. ఆశించిన స్థాయిలో మార్కులు రావడానికి విద్యార్థులు శ్రమించాలి.
ఆరోగ్యం పరంగా.. అజీర్తి, అసిడిటీ, మోకాళ్లనొప్పులు బాధిస్తాయి. నిద్ర నుంచి రావలసిన ఎనర్జీని పొందలేరు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ ఏడాదంతా వెలుగు, నీడల దోబూచులాటగా ఉంటుంది. వాగ్వాదాలు, వినోదాలు, మానసిక అప్రశాంతతో పాటు.. పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ప్రతి శనివారం శని దేవుడికి తైలాభిషేకం చేయించుకోవాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా.. శనీశ్వరునికి నమస్కారం చేసుకుని, ఆ సమస్య తీరాక మందపల్లిలో శనిదేవునికి తైలాభిషేకం చేయించుకోవాలి.
ధనస్సు రాశి
ఆదాయం -8
వ్యయం-11
రాజ్యపూజ్యం -6
అవమానం-3
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో.. ఏలినాటి శని సంపూర్ణంగా తొలగిపోయి.. గురుబలం పెరుగుతుంది. సంవత్సర ద్వితీయార్థంలో అర్థాష్టమ రాహుదోషం ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. కెరియర్ ను సీరియస్ గా తీసుకుంటారు. గడిచిన సంవత్సరంలోని శ్రమ, అనుభవం అక్కరకు వస్తుంది. రాజకీయనేతలకు ప్రథమార్థంలో మంచి ఫలితాలుంటాయి. ఆర్థికంగా ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.
చీటీలు కట్టడం, గోల్డ్ స్కీమ్ లు తీసుకోవడం వంటివాటిపై మొగ్గు చూపుతారు. ఎంతసంపాదించినా రూపాయి నిలబడకపోవడం సవాలుగా మారుతుంది. వివాహానికి, సంతానానికి అనుకూలంగా ఉంటుంది. విడాకులు తీసుకోవాలా ? వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నవారికి ఒక స్పష్టత ఏర్పడుతుంది. శ్వాసపరమైన అనారోగ్య సమస్యలతో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాల్లో వ్యతిరేక ఫలితాలున్నందున జాప్యం అవసరం. విదేశాల్లోకంటే స్వదేశంలో ఉండటమే మంచిది. విపరీతమైన ఆలోచనలు, తగాదాలు, సమస్యలతో చికాకులు పెరుగుతాయి. గతేడాదికంటే మాత్రం కాస్త మెరుగ్గా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు పారాయణ చేయాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి మనసులో మొక్కుకుని, ఇబ్బంది తీరాక ఆ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి.
మకర రాశి
ఆదాయం -11
వ్యయం-5
రాజ్యపూజ్యం -2
అవమానం-6
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో.. ఏలిననాటి శని కొనసాగుతోంది. అర్థాష్టమ గురుడి ప్రభావం ప్రారంభమవుతుంది. అర్థాష్టమ రాహుదోషం నవంబర్ నుంచి తొలగుతుంది. ఈ ఏడాది కాస్త ఒడిదుడుకులుగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్నే కొనసాగించడం మంచిది. నూతన వ్యాపారాలకు, వ్యాపార విస్తరణకు అనువైన కాలం కాదు. నా అనుకున్నవారే మోసం చేస్తున్నారన్న ఆలోచనలు బలపడతాయి. మీరు ఏది మాట్లాడినా నానార్థాలు తీసేవారి సంఖ్య పెరుగుతుంది. ఎంతోకష్టం మీద వివాహాది శుభకార్యాలు సానుకూలమవ్వవు.
ఏ పని చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. తొలి ఆరునెలలు వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్, ఆస్తమా, స్పాండిలైటిస్, అరుగుదల లోపాలు, థైరాయిడ్, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటివి పదే పదే వైద్యుడిని సంప్రదించేలా ఇబ్బంది పెడతాయి. విదేశీ, కోర్టు వ్యవహరాల్లో సతమతమవుతారు. అన్నివిషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ప్రతిరోజూ ఘోర కష్టోద్ధరణ స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు పారాయణ చేయాలి. గానుగాపూర్ దత్తాత్రేయుని సన్నిధిలో అన్నదానం చేస్తే.. కష్టాలు తీరే అవకాశం ఉంది.
కుంభ రాశి
ఆదాయం -11
వ్యయం-5
రాజ్యపూజ్యం -5
అవమానం-6
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో.. ఏలిననాటి శని కొనసాగుతోంది. తృతీయంలో గురు సంచారం ఉంది. రాహుబలం తగ్గుతుండటంతో మిశ్రమ ఫలితాలుండొచ్చు. చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ దారులకు మొదటి పంట లాభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం. పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. స్వదేశీ, విదేశీ విద్యల్లో రాణిస్తారు.
ఒత్తిడి పెరుగుతుంది. శ్రమ, అలసట పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడొచ్చు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావాలన్న ఆలోచనల్లో కాస్త గందరగోళం ఉంటుంది. కోర్టుకేసులు కూడా సానుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ 3 సార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయాలి. అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం, ఆంజనేయస్వామికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవాలి. ఎలాంటి ఇబ్బందులెదురైనా వేంకటేశ్వరస్వామివారికి మొక్కుకుని, ఆ ఇబ్బంది తొలగిపోయాక స్వామివారిని దర్శించుకోవాలి.
మీన రాశి
ఆదాయం -8
వ్యయం-11
రాజ్యపూజ్యం -1
అవమానం-2
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో.. ఏలిననాటి శని ప్రారంభం, జన్మంలోకి రాహువు ప్రవేశం జరుగుతున్నాయి. గురుబలం ఉండటంతో.. మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగ మార్పులకు ప్రాముఖ్యతనిస్తారు. ఎదుగుదలకు, సేఫ్టీకి ప్రాముఖ్యతనివ్వాలి. వ్యాపారాల్లో లాభ, నష్టాలు సమానంగా ఉంటాయి. వ్యవసాయదారులకు మొదటిపంట లాభిస్తుంది. ఆర్థికంగా చూస్తే.. అవసరానికి డబ్బు అందుతుంది. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి.
సంతానం విషయాలు సానుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ ఏడాది ఎదుటివారిని అనుమానంతో చూడటం పెరుగుతుంది. విపరీతమైన శ్రమ ఉంటుంది. ఆర్థిక ఒత్తిడులు పెరుగుతాయి. ప్రతి విషయాన్ని గమనిస్తూ.. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయాలి. అలాగే ప్రతి మంగళవారం పగలంతా పాలు, పండ్లు తీసుకుంటూ.. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయాలి. ప్రతి గురువారం స్వచ్ఛమైన ఆవుపాలు లేదా పసుు నీటితో పరమేశ్వరుడిని అభిషేకించాలి. ఎలాంటి కష్టమొచ్చినా అహోబిల నారసింహస్వామికి మొక్కుకుని, ఆ కష్టం తీరాక స్వామివారిని దర్శించుకుని పూజించి మొక్కు తీర్చుకోవాలి.
Next Story