Mon Dec 23 2024 03:10:08 GMT+0000 (Coordinated Universal Time)
దీపావళిని ఎందుకు జరుపుకుంటాం ? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ?
నరకచతుర్దశి ఆచరణ వెనుక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైనది. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా ఉన్న కాపరూప రాజ్యాన్ని
దీపావళి.. అనగానే అందరికీ తెలిసింది లక్ష్మీదేవి పూజ, దీపాలు, టపాసులు. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే పండుగలలో ఇది కూడా ఒకటి. కుల, మత, జాతి, వర్గ విబేధాలు లేకుండా జరుపుకునేదే దీప పండుగ. ప్రతీఏటా ఆశ్వీయుజ బహుళ అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటాం. దానికి ముందు రోజును.. అనగా ఆశ్వీయుజ బహుళ చతుర్దశిని నరకచతుర్దశిగా చెబుతారు.
నరకచతుర్దశి
నరకచతుర్దశి ఆచరణ వెనుక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైనది. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా ఉన్న కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ద్వాపర యుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అసుర లక్షణాలతో పెరిగిన నరకుడు ఘోర తపస్సు చేసి అనేక రకాల వరాలు పొందాడు. వాటిలో ఒకటి తన అంతం. ఏ తల్లీ తన కొడుకుని వధించాలని అనుకోదని భావించిన నరకుడు.. తన తల్లి చేతిలో తప్ప తనకు మరణం సంభవించకూడదని వరం పొందుతాడు.
నరకాసురుడి ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అయ్యాయి. వరగర్వంతో విర్రవీగుతూ అతను చేసిన దుష్టపనులు దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ చేతుల్లో నరకుడు మరణిస్తాడు. కొడుకు చనిపోయినా.. అతని పేరు కలకాలం చరిత్రలో మిగిలిపోవాలని సత్యభామ ప్రార్థించగా.. ఆరోజును నరకచతుర్దశిగా జరుపుకుంటారని వరమిస్తాడు శ్రీకృష్ణుడు.
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమేణా అదే దీపావళిగా పిలువబడుతోంది.
Next Story