Thu Oct 31 2024 07:18:35 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : దీపావళికి ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇక అంతే?
ఈరోజు ఆనందకరమైన దీపావళి పండగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదం బారిన పడతారు
ఈరోజు ఆనందకరమైన దీపావళి పండగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదం బారిన పడతారు. దీపావళి పండగ నాడు చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఎంతో హుషారుగా కనిపిస్తారు. కొత్త బట్టలు ధరించి దీపావళి పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం నుంచి టాపాసులు పేల్చి చిన్నారుల మొహంలో ఆనందం చూస్తూ తల్లి దండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఖుషీ అవుతారు. అయితే దీపావళి సందర్భంగా ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఇబ్బందులు తలెత్తుతాయి. అదే సమయంలో ప్రమాదం బారిన పడే అవకాశాలున్నాయి. అందుకే పిల్లలను అంటిపెట్టుకునే పెద్దలు కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
కళ్లను భద్రంగా ఉంచుకోవాలి...
దీనికి వైద్యులు ప్రధానంగా చెబుతున్నది కళ్లను భద్రంగా ఉంచుకోవాలని, దీపావళి టపాసులను కాల్చే సమయంలో కళ్లజోడు విధిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది చిన్నారులు కంటి ఇబ్బందులతో బాధపడుతూ దీపావళి రోజును ఆసుపత్రికి వస్తుండటం పరిపాటిగా మారింది. చిచ్చు బుడ్లు, విష్ణు చక్రాలు, భూ చక్రాలు, కాకరపువ్వొత్తులు వంటివి కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు అవసరం. కళ్లజోడు ధరించడమే కాదు.. ఒంటిపై లూజుగా దుస్తులను ధరించాలని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న నిప్పు రవ్వ పడినా చిన్నారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
టపాసులు కాల్చే సమయంలో...
టపాసులు కాల్చే సమయంలో షూ ధరించడం మేలు అన్నది వైద్య నిపుణుల సూచన. ప్రతి ఏటా సరోజినిదేవి కంటి ఆసుపత్రికి పదుల సంఖ్యలో చిన్నారులు, పెద్దలు చికిత్స కోసం దీపావళి పండగరోజు నాడే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరంతా అజాగ్రత్తతోనే తాము ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గాయపడిన కంటిని వెంటనే నలపకూడదు. చల్లని నీటితో శుభ్రపర్చి వెంటనే నేత్రవైద్యుడిని సంప్రదించాలి. కంటి వద్ద సబ్బు లాంటి పదార్థాలు వాడకూడదు. గాయపడిన కంటిన మూసే ఉంచాలి. మంచి మతాబులనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేకుంటే మనం జాగ్రత్తగా ఉన్నా అవి పేలిపోయే అవకాశముందని కొందరు చెబుతున్నారు. స్టాండర్డ్ కంపెనీలకు చెందిన దీపావళి టపాసులను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆనందాల దీపావళి పండగను అజాగ్రత్తతో వ్యవహరించి పండగ రోజున విషాదాన్ని కొని తెచ్చుకోవద్దన్నది నిపుణుల సూచన
Next Story