Fri Nov 22 2024 08:37:00 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : యాభై ఏళ్ల నాటి దీపావళి.. నాటి సంగతులు గుర్తుకొస్తున్నాయి
దీపావళి అంటే అందరికీ ఒక హుషారిచ్చే పండగ. అందుకే దీపావళి వచ్చిందంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ సంబరంగా జరుపుకుంటారు
దీపావళి అంటేనే అందరికీ ఒక హుషారిచ్చే పండగ. అందుకే దీపావళి వచ్చిందంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ సంబరంగా జరుపుకుంటారు. బాణాసంచాలు, మిఠాయిలు ఈ పండగ ప్రత్యేకం. అందుకే అందరికీ ఇష్టమైన పండగ దీపావళి అని చెప్పాలి. చిన్న నాటి నుంచి దీపావళి ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురు చూసే వారు అందరూ. బాల్యంలో అయితే దీపావళి పండగకు బాణాసంచాను మనమే తయారు చేసుకునేవాళ్లం. గ్రామాల నుంచి పట్టణాల వరకూ నాడు దీపావళి మందుగుండు సామగ్రిని సొంతంగా తయారు చేసుకునేవారు. అందుకోసం వాటిలో వినియోగించే మందును, కాగితం తో చేసిన మతాబులను, బయట కమ్మరిలు తయారు చేసిన చిచ్చుబుడ్లను కొనుగోలు చేసేవారం.
పదిహేను రోజుల నుంచే...
దీపావళికి పదిహేను రోజుల ముందు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తయారు చేసిన మతాలబులు, చిచ్చుబుడ్లు వంటివి ఎండల్లో ఎండపెట్టి వాటిని రోజూ సాయంత్రం అయ్యేసరికి తిరిగి ఇంట్లోకి చేర్చే వాళ్లు. వీటి తయారీలో పెద్దవాళ్లు కూడా సహకరించే వారు. ప్రతి ఇంట్లో ఎవరికి వారే తయారు చేసుకునే మతాబులు, చిచ్చుబుడ్లు నాడు ఒక వెలుగు వెలిగేవి. ఆ వెలుగు జిలుగుల్లో తాము తయారు చేసిన చిచ్చుబుడ్లు కాలుతుంటే ఆ ఆనందమే వేరు. అలాంటి అనుభవాలు ఐదు పదుల వయసు దాటిన వారికి మాత్రమే నాటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చే ఉంటాయి. అందరికీ ఇలాంటి అనుభవం ఉండేది.
బయట మార్కెట్ లో...
కానీ ఇప్పుడు పెరిగిన ఆధునిక సమాజంలో అంతా బయట మార్కెట్ లో కొనుగోలు చేయడమే. వేలు పోసి కొనుగోలు చేసిన మతాబులు కూడా పేలకుండా తుస్సుమంటున్నాయి. మతాబుల ధరలు నింగినంటాయి. ఒక్కటేమిటి? చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, మతాబులు మాత్రమే కాదు.. మరెన్నో వెరైటీలు నేటితరం పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. ధర ఎంతైనా చిన్నారుల మొహంలో ఆనందం చూడటానికి కైనా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి పెద్దలది. అంత డబ్బు పోసి తగలబెట్టడం ఎందుకని కొందరు నస పెడుతున్నప్పటికీ కుటుంబంలో ఆనందంగా ఉండటానికి, చిన్నారులు ఆనందంగా పండగ జరపుకోవడానికి కొనుగోలు చేయక తప్పని పరిస్థిితి.
కాలుష్యం అయినా...
ఊరంతా పండగ చేసుకుంటూ.. మతాబులు కాల్చుకుంటుంటే మనం ఒక్కరే ఇంట్లో కూర్చోలేం కదా? అందుకే దీపావళికి మతాబుల మార్కెట్ కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. ఒక్కొక్క దుకాణంలో అనేక రాయితీలు ఇవ్వడం ఇటీవల కాలంలో ఎక్కువయిపోయింది. ఎక్కువ శాతం డిస్కౌంట్ ఇచ్చిన దుకాణంలో మతాబులు కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇక బాంబులు, టపాసులు, సీమ టపాకాయలు, వంకాయ బాంబులుతో దీపావళి ముందు రోజు రాత్రి నుంచి మోత మోగిపోతుంది. శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నా దేశమంతా ఈ పండగను సంబరంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది.
Next Story