Fri Nov 22 2024 15:15:14 GMT+0000 (Coordinated Universal Time)
ఈ తొమ్మిది రోజుల్లో దుర్గమ్మను దర్శించుకుంటే ఇక మీకు?
. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ తల్లిని దసరా నవరాత్రుల్లో దర్శించుకోవడం పుణ్యంగా భావిస్తారు
దసరా అంటే ముందుగా గుర్తుకొచ్చేది విజయవాడ ఇంద్రకీలాద్రి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ తల్లిని దసరా నవరాత్రుల్లో దర్శించుకోవడం పుణ్యంగా భావిస్తారు. మరో నాలుగు రోజుల్లో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దీంతో ఇంద్రకీలాద్రికి వస్తున్న భక్తుల సౌకర్యం కోసం పాలకమండలితో పాటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది.
పది హేను నుంచి...
ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై జరగనున్నాయి. రోజుకో అలంకారంతో దుర్గమాత భక్తులకు దర్శనమివ్వనున్నారు. చూసే వారికి కన్నుల పండువగా కనిపించే ఈ అలంకారాలతో దుర్గమ్మ మరింత ధగ ధగ మెరుస్తూ దర్శనమిస్తుంది. తొలి రోజు బాలా త్రిపుర సుందరిగానూ, రెండో రోజు గాయత్రీ దేవి రూపంలోనూ, మూడో రోజు మహాలక్ష్మి అలంకారంలోనూ, నాలుగో రోజు అన్నపూర్ణ దేవిగానూ, ఐదో రోజు శ్రీలలిత త్రిపుర సుందరీ దేవిగా, ఆరో రోజు సరస్వతీ దేవిగా, ఏడో రోజు దుర్గాదేవి గానూ, ఎనిమిదో రోజున మహిసాసుర మర్దని రూపంలోనూ తొమ్మిదో రోజు రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు.
లక్షల సంఖ్యలో...
దీంతో ఇంద్రకీలాది లో జరిగే శరన్నవరాత్రులకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారికి నవరాత్రుల సమయంలో తమ మొక్కులు చెల్లించుకుంటారు. లక్షలాది మంది భక్తులు కొండపైకి వస్తుండటంతో క్యూ లైన్లతో పాటు తీర్థ ప్రసాదాలను కూడా ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. . ప్రత్యేకంగా అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే ప్రాధమిక చికిత్స జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను కూడా దుర్గగుడిపై ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా మూలా నక్షత్రం రోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి భారీ బందోబస్తుతో పాటు ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నారు.
సమన్వయంతో...
వీవీఐపీ వాహనాలను తప్పించి ఇంద్రకీలాద్రిపైకి ఈ నవరాత్రుల్లోనూ ఏ వాహనాన్ని అనుమతించరు. భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో రావాలి. లేకుంటే కాలినడకన చేరుకోవాలి. అంతే తప్ప సొంత వాహనాలను అనుమతించరు. ఇందుకోసం పోలీసు శాఖ ప్రత్యేక పాస్లు జారీ చేసింది. వీఐపీలు దర్శించుకున్న సమయంలో భక్తులకు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు కొనసాగేలా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. చివరి రోజు తెప్పోత్సవంతో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. దుర్గగుడి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రోజుకు 1.70 లక్షల మంది...
శరన్నవరాత్రులు జరిగే ప్రతి రోజూ రోజుక లక్షా 70 వేల మంది దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సెకనుకు ఇద్దరు ముగ్గురు భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజూ నాలుగు గంటలు పూజలు, నివేదనలు ఉంటాయని దేవస్థానం కమిటీ తెలిపింది. అలాగే 24 గంటలూ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ప్రొటోకాల్ ఉణ్న వారు, ప్రజా ప్రతినిధులు వారు స్వయంగా వస్తేనే అనుమతిస్తారు. ఎటువంటి సిఫార్సు లేఖలు చెల్లవని పాలకమండలి స్పష్టం చేసింది.
Next Story