Sat Nov 23 2024 02:15:54 GMT+0000 (Coordinated Universal Time)
Navaratri Special : దసరా విశిష్టత.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?
దసరా అనగానే చాలామందికి పెద్ద సంబరం. మరి దసరా ఎందుకు జరుపుకుంటారు ? ఏ సందర్భంగా ఈ పండుగ వచ్చింది ? దాని విశిష్టత ఏంటి..
దసరా.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిదిరోజుల పాటు దుర్గాదేవిని రోజుకొక అలంకారంలో పూజిస్తూ జరుపుకునే పండుగ. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో దసరా ఒకటి. తొమ్మిదిరోజులు జరుపుకునే పండుగ.. అందులోనూ అమ్మవారిని పూజిస్తూ చేసే పండుగ కావడంతో.. శరన్నవరాత్రులు, దేవీనవరాత్రులు అని పిలుస్తారు. పదవ రోజు విజయదశమి. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. దసరా లోనూ బొమ్మలకొలువులు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. మైసూరు, కలకత్తా, ఒడిశాలలో దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని అమ్మవార్ల ఆలయాల్లో రోజుకొక అలంకారంలో పూజలు నిర్వహిస్తారు. విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లి'కి పూజలు చేస్తారు'. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడు సార్లు ఊరేగిస్తారు. అక్కడ గజపతుల వారసులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరపడం ఆచారం. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్ఠలను ఆచరిస్తాడు. మొదటి రోజునుండి నూరు సంవత్సరాల క్రితం వెదురు కర్రలు గడ్డి కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును నూతనంగా అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితంపూలు, తగరంతో అలంకరణలు చేసి అంబారీ చేస్తారు.
తెలంగాణ విషయానికొస్తే.. వినాయక చవితికి విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించినట్లు దసరాకి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తారు. పండుగ అనంతరం వాటిని నిమజ్జనం చేస్తారు. ఇక్కడ మరో విశేషం.. దసరా తో పాటు బతుకమ్మను జరుపుకుంటారు. అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. ఆఖరి రోజున బతుకమ్మలను చెరువులు, నదులలో నిమజ్జనం చేస్తారు.
దసరా ఎందుకు జరుపుకుంటారు ?
దసరా అనగానే చాలామందికి పెద్ద సంబరం. మరి దసరా ఎందుకు జరుపుకుంటారు ? ఏ సందర్భంగా ఈ పండుగ వచ్చింది ? దాని విశిష్టత ఏంటి ? ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం దసరా పండుగకు మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి రాముడు రావణుడిపై గెలవడమైతే.. రెండవది పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అందుకే దసరా రోజున రావణ కాష్ట నిర్వహణ, జమ్మిచెట్టుకు పూజ చేయడం, రాక్షస వధ వంటి నాటకాలు వేయడం అనాదిగా వస్తున్న ఆచారాలుగా ఉన్నాయి. విజయదశమి రోజున వాహన, ఆయుధ పూజ నిర్వహిస్తారు. అదేరోజున అమ్మవారి వద్ద జమ్మి పూజ చేస్తారు.
Next Story