Mon Dec 23 2024 16:04:15 GMT+0000 (Coordinated Universal Time)
Navaratri Special : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు.. అమ్మవారి అలంకరణలు, ఏర్పాట్ల వివరాలు
ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు..
దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా నవరాత్రి వేడుకలకు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో దసరా శరన్నవరాత్రులకు విజయవాడ పెట్టింది పేరు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దుర్గమ్మను రోజుకొక అవతారంలో అలంకరిస్తారు ఆలయ పూజారులు.
సాధారణ రోజుల్లోకన్నా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నాలుగింతలు అధికంగానే ఉంటుంది. దసరా ఉత్సవాల్లోనే భవానీ మాలల విరమణలు కూడా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలివస్తారు. ముందుగా పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. తలనీలాల మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం దర్శనానికి కొండపైకి పయనమవుతారు భక్తులు.
ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీ మాలల విరమణ, భక్తుల రద్దీ దృష్ట్యా కొండ కింది నుంచి పై వరకూ క్యూలైన్లలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అందుబాటులో మంచినీటి సదుపాయాలను అందిస్తున్నారు ఆలయ ధర్మకర్తలు. ఈ నెల 26వ తేదీ నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.
తొలిరోజు అనగా.. 26.09.2022 రోజున దుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. 27.09.2022న బాలాత్రిపుర సుందరి దేవిగా, 28.09.2022న గాయత్రిదేవిగా, 29.09.2022న అన్నపూర్ణ దేవిగా, 30.09.2022న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 01.10.2022న శ్రీ మహాలక్ష్మిగా, 02.10.2022న సరస్వతీ దేవిగా, 03.10.2022న దుర్గాదేవిగా, 04.10.2022న మహిషాసుర మర్థినిగా, 05.10.2022న విజయదశమినాడు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
26వ తేదీన స్నాపనం అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శనం ఉంటుంది. మూలానక్షత్రం రోజున ఉదయం 2 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. అక్టోబర్ 5, విజయదశమి నాడు అమ్మవారి వద్ద శమీపూజ నిర్వహించి.. కృష్ణానదిలో ఉత్సవ విగ్రహాలతో తెప్పోత్సవం నిర్వహిస్తారు. కన్నుల పండుగగా సాగే ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తారు.
Next Story