Mon Dec 23 2024 06:19:53 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు ఇలా.. ఇవే
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న ధ్వజారోహణంతో ప్రారంభమయిన బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకూ జరగనున్నాయి
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న ధ్వజారోహణంతో ప్రారంభమయిన బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన వెంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు లయప్పస్వామి వివిధ వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్యదర్శనంతో భక్తులకు కనువింద చేస్తారు.ఉదయం వాహనసేవ 8గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ సాయంత్రం 6.30 నుండి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది.
మాడ వీధులన్నీ...
ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీలలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు. నిన్న స్వామి వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు.
వాహన సేవలు ఇలా...
అక్టోబరు ఐదో తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. రాతరి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి మలయప్పస్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు.
ఆరోతేదీ వాహన సేవ :
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం మలయప్పస్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. రాత్రి ఏడు గంటలకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
ఏడో తేదీ వాహనసేవ :
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు.
ఎనిమిదో తేదీ వాహనసేవ
ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. ఈరోజు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.
తొమ్మిదో రోజు వాహనసేవ :
ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. సాయంత్రం నాలుగు గంటలకు అంటే ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది.
పదో తేదీన వాహనసేవ :
ఏడో రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి. ఏడో రోజు రాత్రి శ్రీచంద్రప్రభ వాహనంపై విహరిస్తారు.
11వ తేదీన వాహనసేవ :
ఉదయం ఏడు గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు రథాన్ని లాగుతారు రాత్రి ఏడు గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి మలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు.
12వ తేదీన చక్రస్నానం :
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Next Story