Mon Dec 23 2024 08:05:20 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala Brahmotsavam : బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం..వాహన సేవలు, విశిష్టతలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి'..
తిరువీధులు గోవిందనామస్మరణతో మారుమోగుతున్న వేళ.. అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందు చేస్తున్న వేళ, దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్న వేళ.. భూలోకమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్న వేళ.. జరిగే బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే. ప్రతిసేవా వైభవోపేతమే.
బ్రహ్మదేవుడే భక్తుడిగా మారి శ్రీనివాసుడికి మొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. సృష్టికారకుడైన బ్రహ్మ ఈ ఉత్సవాలను ప్రారంభించిన కారణంగా వీటిని బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. మరో కథనం ప్రకారం.. నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'. వీటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలని కూడా అంటారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా తరలివస్తారు. వాహనాలపై ఊరేగుతున్న స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునుగుతారు.
కరోనా పుణ్యమా అని.. రెండేళ్లపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండా జరిగాయి. ఈ ఏడాది కరోనా తీవ్రత తగ్గడంతో బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈనెల 27వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. రోజుకొక వాహనంపై స్వామివారు తిరుమాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వైఖాసన ఆగమనంలోని క్రతువులలో అంకురార్పణం చాలా కీలకమైనది. ఏదైనా ఉత్సవాన్ని ప్రారంభించే ముందు అది పూర్తిగా విజయవంతం కావాలని కోరుకుంటూ, స్వామి వారిని ఆరాధించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిశ్వక్ సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ మట్టిలో నవధాన్యాలను నాటుతారు. అందుకే ఇది అంకురార్పణం అయ్యింది.
సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది టీటీడీ. సెప్టెంబర్ 26వ తేదీన అంకురార్పణ, 27వ తేదీ సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6:15 గంటల మధ్యలో మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది.
సెప్టెంబర్ 26 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సెప్టెంబర్ 27 ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవ
సెప్టెంబర్ 28 చిన్న శేష వాహనం, స్నపన తిరుమంజనం, హంస వాహన సేవ
సెప్టెంబర్ 29 సింహ వాహన సేవ, ముత్యపు పందిరి వాహన సేవ
సెప్టెంబర్ 30 కల్పవృక్ష వాహన సేవ, సర్వ భూపాల వాహన సేవ
అక్టోబర్ 01 మోహిని అవతారంలో స్వామి వారి దర్శనం, గరుడ వాహన సేవ
అక్టోబర్ 02 హనుమంత వాహన సేవ, గజ వాహన సేవ
అక్టోబర్ 03 సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ
అక్టోబర్ 04 రథోత్సవం, అశ్వ వాహన సేవ
అక్టోబర్ 05 చక్రస్నానం, ధ్వజావరోహణం
ఇక్కడ ఒక్కో వాహనానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.
శేషవాహనం : ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపజేస్తారు. స్వామి శేషతల్పశాయి. ఆయన కొలువున్న కొండ- శేషాద్రి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు.
సింహవాహనం : మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. ఆరోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు.
కల్పవృక్ష వాహనం : నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణ, ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారం. ఆరోజు సాయంత్రం, సర్వభూపాల వాహనంమీద స్వామివారి వూరేగింపు, భక్తులకు కనులవిందుగా సాగుతుంది.
మోహినీ అవతారం : బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార ఊరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. ఈ హారాన్నీ, చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ (గోదాదేవి) నుంచి తెచ్చినట్లుగా చెప్తారు.
గరుడ వాహనం : స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. 5వరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధ్రువబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. అలాగే ఈరోజునే, శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలను స్వామివారు స్వీకరిస్తారు. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు.
ఆరోజు ఉదయం, హనుమద్వాహనసేవ జరుగుతుంది. హనుమంతుడు, శ్రీరాముని నమ్మినబంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ, ఆ బంటుకు మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది. తాను సైతం ఆ మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియజేసే ఘట్టమిది.
గజవాహనం : ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడూ సిద్ధమేననీ అలనాడు 'సిరికింజెప్పక, శంఖుచక్ర యుగమున్ చేదోయి సంధింపక' వచ్చినా, నేడు భక్తజనుల మొరల్ని వినేందుకు సర్వాలంకారభూషితుడనై వస్తున్నాననీ విశదపరిచే ఘట్టం- గజవాహనసేవ.
సూర్యప్రభ వాహనం : ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనంమీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం.
రథోత్సవం : ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. సైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.
చక్రస్నానం : బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.
ధ్వజావరోహణ : చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం (దించడం) చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క.
Next Story