‘వైరు’ లాగితే .. ‘షా‘ కు కొట్టింది
వదిలించుకోగలిగితే మరక మంచిదే. బట్ట నాణ్యత, పారదర్శకత బయటపడుతుంది. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ జోడు గుర్రాలుగా దూసుకుపోతూ రాజకీయంగా దేశాన్ని దున్నేస్తున్న మోడీ, అమిత్ షా ద్వయానికి సన్ స్ట్రోక్ తగిలింది. గోద్రా అనంతర ఘర్షణలు, గుజరాత్ ఎన్ కౌంటర్ల కు సంబంధించి వీరిరువురిపై విమర్శలు అనేకం ఉండవచ్చు. మతపరమైన సమీకరణలపై వివాదాలూ ఉండవచ్చు. అవినీతి ఆరోపణలు మాత్రం పెద్దగా లేవు. అధికారంలో భాగస్వాములుగా, తిరుగులేని నేతలుగా ఎంతటి హవా చెలాయించినా నిజాయితీగానే ఉన్నారని ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. గుజరాత్ లో మోడీ, అమిత్ షా లు చెప్పిందే వేదంగా దశాబ్దం పైగా అధికార యంత్రాంగం నడిచింది. గడచిన మూడేళ్లుగా కేంద్రప్రభుత్వంలో కూడా వీరిరువురూ వ్యక్తిగత స్వార్థానికి అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఉదంతాలు కనిపించవు. ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి ఆరోపణలూ వినిపించవు. కన్నతల్లిని మినహాయిస్తే బంధుమిత్రులకూ మోడీ దూరంగానే ఉంటారు. సోదరులు చిన్నాచితక పనులతో జీవితం గడుపుతుంటారు. భార్యను ఏనాడో త్యజించారు. ఒకరకంగా చెప్పుకోవాలంటే రాజ యోగి గా మోడీని చూడాల్సి ఉంటుంది. కుటుంబం, బంధుమిత్రులు, స్నేహితులు వంటి భవబంధాలన్నీ పాటిస్తున్నా అమిత్ షా కూడా అధికార వినియోగంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటి ద్వయానికి తాజాగా అమిత్ షా కొడుకు జే షా ఉదంతం చెమటలు పట్టిస్తోంది. జే షా కంపెనీపై ఆశ్రిత పెట్టుబడి(క్రోనీ క్యాపిటలిజం) ఆరోపణలు వెల్లువెత్తడం, దానిని విపక్షాలు సమర్థంగా వినియోగించుకోవడంతో మోడీ, అమిత్ షా లకు ఊపిరి సలపడం లేదు. మంత్రులు, అధికార బీజేపీ నాయకులు చేస్తున్న ప్రతి విమర్శలు పేలవంగా తేలిపోతున్నాయి.
16 వేలరెట్ల టర్నోవర్.....
జే షా నడిపే టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మోడీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత 16 వేల రెట్ల టర్నోవర్ సాధించిందనేది ప్రధాన అభియోగం. ఇందుకు సంబంధించి ద వైర్ వెబ్ సైట్ అధికారికంగా సేకరించిన సమాచారాన్ని వెల్లడిస్తూ తనదైన వ్యాఖ్యానంతో కథనాన్ని విశ్లేషించింది. 2013 లో నష్టాలను చవిచూసిన టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ , 2014-15ల్లో కేవలం 50 వేల టర్నోవర్ తో సరిపెట్టుకుంటే 2015-16 సంవత్సరానికి వచ్చేసరికి 80 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందనేది గణాంకాల సహా వైర్ వెల్లడించిన కథనం. పూచీకత్తు లేకుండా లభించిన రుణాలు, నిబంధనలు ఉల్లంఘించి మంజూరు చేసిన అప్పులు వంటివన్నీ సామాన్యులకైతే సాధ్యమేనా? అన్నది ‘వైర్‘ ప్రశ్న. అమిత్ షా కుమారుడు కావడం వల్ల మాత్రమే జే షా తన కంపెనీ టర్నోవర్ ను ఒక్క ఏడాది కాలంలోనే ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగాడన్న అనుమానాలను ఈ కథనం రేకెత్తించింది. ఇంతవరకూ ఆశ్రితపక్షపాతాలకు, బంధుప్రీతికి దూరంగా ఉంటూ పారదర్శకమైన నాయకులుగా పేరుతెచ్చుకున్న మోడీ, అమిత్ షా లకు ఇది పెద్ద సంకటంగానే చెప్పుకోవాలి. వైర్ కథనానికి ఆధారమైన వివరాలు కంపెనీస్ రిజిస్ట్రార్ నుంచి సాధికారికంగా సేకరించారు. అందువల్ల వీటిని తోసిపుచ్చలేం. ఈ గణాంకాలనే కథనానికి ప్రాతిపదికగా పేర్కొనడంతో సంచలనాత్మకమైన నిజాలుగానే ప్రతిపక్షాలు, ప్రసార,ప్రచురణమాధ్యమాలు భావిస్తున్నాయి. అందువల్లనే అధికార పక్షం ఖండనలతోపాటు వైర్ కథనాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన మీడియా కూడా ప్రచురించాల్సి వచ్చింది.
ఆషామాషీ గా తీసేయలేం...
సెలబ్రిటీల సొల్లు కబుర్లు, గాసిప్స్ తో కాలక్షేపం చేస్తూ పాఠకుల బలహీనత మీద బ్రతికే వెబ్ సైట్ కాదు వైర్. అందువల్లనే ఈ కధనానికి అంతటి విలువ దక్కింది. పూర్తిస్థాయి నైపుణ్యం కలిగిన జర్నలిస్టులు, విశ్వసనీయత కలిగిన సంపాదక బృదం దీనిని పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారవర్గాలు, రాజకీయ వర్గాలు , ఆర్థిక అవసరాలు మీడియాను పూర్తిగా అదుపాజ్ణల్లో పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సొంత గొంతుక వినిపించాలనే ఉద్దేశంతో ద వైర్ ఏర్పాటైంది. ప్రజాస్వామ్య మనుగడకు, ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని నియంత్రించడానికి , అక్రమాలను బహిర్గత పరచడానికి స్వతంత్ర మీడియా ఉండాలనే ఉద్దేశంతో కొందరు సీనియర్ జర్నలిస్టులు కలిసి రూపకల్పన చేసిందే ఈ సంస్థ. జర్నలిజం ప్రమాణాలకు పేరుగాంచిన ద హిందూ ఆంగ్ల పత్రికకు కు సంపాదకునిగా వ్యవహరించిన సిద్ధార్థ వరద రాజన్, డీఎన్ఏ వ్యవస్థాపక సంపాదకుల్లో ఒకరైన సిద్ధార్థభాటియా, ఎకనమిక్ టైమ్స్,ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్, ద హిందూ వంటి పత్రికల్లో ప్రఖ్యాత కాలమిస్టుగా పేరున్న ఎం.కె. వేణు వంటి వారు ద వైర్ సంపాదక బాధ్యతలు చూస్తున్నారు. వీరంతా పూర్తి స్థాయిలో జర్నలిజం పై అవగాహన కలిగినవారే. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో చదువుకుని దశాబ్దాలపాటు ప్రధాన మీడియాలో పనిచేసినవారే. అందువల్ల పరువునష్టం, న్యాయపరమైన అంశాలపై అవగాహన లేకుండా ఈకథనాన్ని ప్రచురించారని చెప్పలేం.
రోహిణి పరిశోధనాత్మక జర్నలిస్ట్....
అంతేకాదు. ఈ కథనానికి సమాచార సేకరణ చేసిన రోహిణి సింగ్ పరిశోధనాత్మక జర్నలిస్టు. గతంలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు డీఎల్ఎఫ్ తో అతని సంబంధాలు , అతను ఎదిగిన తీరును సాక్ష్యాధారాలతో బయటపెట్టింది కూడా రోహిణి సింగే. అందులోనూ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆమె ఆ కథనాన్ని రాసింది. జర్నలిస్టుగా ఆమెకు దురుద్దేశాలు ఆపాదించడం కష్టం. నిజానికి వ్యక్తిగతంగా జే షా పరువుకు నష్టం వాటిల్లితే అతను సొంతంగా చూసుకోవాల్సిన వ్యవహారం. అయినప్పటికీ ప్రభుత్వం లోని పెద్దలంతా ఇది సర్కారీ వ్యవహారమన్నట్లుగా స్పందిస్తూ క్లీన్ చిట్ లు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్రప్రభుత్వ న్యాయాధికారి అయిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ కు జే షా తరఫున ప్రయివేటుగా వాదించడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వడం కూడా ఆక్షేపణలకు తావిస్తోంది. ఏదో వెబ్ సైట్ లో వచ్చిందిలే అని జే షా పై ఆరోపణలను తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా సంచలనాలు సృష్టిస్తున్న వికీ లీక్స్, పనామా పేపర్సు వంటివన్నీ డిజిటల్ ప్లాట్ పామ్ సమాచార సాధనాలే. ప్రధాన స్రవంతి మీడియాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న వేదిక ఇది. అందువల్ల భవిష్యత్తులో పరిశోధనాత్మక కథనాలు, సంచలనాలు ఈ వేదికలపైనే వెల్లడయ్యే అవకాశం ఉంది. అందువల్ల రాజకీయ పార్టీలు, నేతలు కూడా మెయిన్ మీడియా కథనం తరహాలోనే దీనిని పరిగణనలోకి తీసుకొంటున్నాయి. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామనడమే ఇందుకు నిదర్శనగా చెప్పుకోవాలి.
నిజాల నిగ్గు తేలాల్సిందే...
ఇప్పుడున్న రోజుల్లో 80 కోట్ల రూపాయలంటే పెద్ద మొత్తమేమీ కాదు. ఒక లోక్ సభ నియోజకవర్గ ఎన్నికలో అభ్యర్థులు ఖర్చుపెట్టే మొత్తానికి కూడా సరిపోదు. అయినప్పటికీ ఆరోపణల సూచీ అగ్రనాయకత్వం వైపు దృష్టి పెట్టిన నేపథ్యంలో వాస్తవం ఏమిటన్నది బయటికి రావడం దేశానికి, ఆ నాయకులకు కూడా శ్రేయస్కరం. కేంద్రప్రభుత్వం లో అధికారం తలకిందులు కావడానికి కారణమైన బోఫోర్సు కుంభకోణంలో చేతులు మారింది స్వల్పమొత్తమే. బోఫోర్సు ముడుపులు 64 కోట్ల రూపాయలు మాత్రమే. తెహల్కా చేసిన ఆపరేషన్ వెస్టు ఎండ్ లో బంగారు లక్ష్మణ్ చేతికి ఇచ్చింది కూడా లక్షరూపాయలే. అందువల్లనే వ్యాపార లావాదేవీల మొత్తం ఎంత పరిమాణంలో సాగిందన్న అంశాన్ని పక్కనపెట్టి అసలు అక్రమాలు చోటు చేసుకున్నాయా? లేదా ? అన్న నిజం నిగ్గు తేలాలి. జే షా ఎప్పుడూ అధికార పక్షానికి చేరువగా లేడనే వాదనను కూడా కొందరు బీజేపీ నాయకులు లేవనెత్తుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ సచివాలయం గడప తొక్కలేదు.అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. అయినా ఆయన సంస్థల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. క్విడ్ ప్రో కో పేరిట ఇప్పుడు జగన్ కేసులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల జే షా కూడా న్యాయపరీక్షను ఎదుర్కోవాల్సిందే. పరువు నష్టం దావా పై న్యాయస్థానం ఏం చెబుతోందన్న అంశమే ఈకేసు భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మోడీ, అమిత్ షా ల నినాదం బేటీ బచావో కాదు బేటా(కొడుకు) బచావో అన్నట్లుగా ఉందంటూ రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. తప్పుడు ఆరోపణలైతే నిజాయితీగా కొడుకును రక్షించుకొంటే తప్పులేదు. ఈ కేసులో ఝూటా బచావో అన్నట్లుగా కేంద్రం, బీజేపీ నాయకులు అబద్ధాలకు అండగా నిలవకుండా ఉంటే అంతే చాలంటున్నాయి విపక్షాలు.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- అమిత్ షా