ఐక్యతే శరణ్యం… అది తప్ప మరో మార్గమేదీ?
భారత దేశం వంటి లౌకిక దేశంలో భిన్నసంస్కృతులు, జాతులు, భాషల ప్రజలు కలిసి జీవించడం ఒక అనివార్యత. భిన్నరాజకీయాలు, సిద్దాంతాలతో కాట్లాడుకున్నప్పటికీ సందర్భం వచ్చినప్పుడు తామంతా ఒకటే [more]
భారత దేశం వంటి లౌకిక దేశంలో భిన్నసంస్కృతులు, జాతులు, భాషల ప్రజలు కలిసి జీవించడం ఒక అనివార్యత. భిన్నరాజకీయాలు, సిద్దాంతాలతో కాట్లాడుకున్నప్పటికీ సందర్భం వచ్చినప్పుడు తామంతా ఒకటే [more]
భారత దేశం వంటి లౌకిక దేశంలో భిన్నసంస్కృతులు, జాతులు, భాషల ప్రజలు కలిసి జీవించడం ఒక అనివార్యత. భిన్నరాజకీయాలు, సిద్దాంతాలతో కాట్లాడుకున్నప్పటికీ సందర్భం వచ్చినప్పుడు తామంతా ఒకటే అని చాటుకోవడమూ తప్పనిసరి. విదేశీ దాడులు, యుద్ధాలు , ప్రకృతి విపత్తులు ఇటువంటి ఆవశ్యకతను కల్పిస్తుంటాయి. ప్రస్తుతం దేశంలో కరోనా సమరం సాగుతోంది. దేశంలోని ప్రతి పౌరుడూ సైనికుడే. తమ ఇళ్లల్లో తాముండటమే ఇప్పుడు దేశభక్తిని చాటుకునే అరుదైన అవకాశం. సంఘశక్తిని, సమైక్యతను చాటిచెప్పడానికి సైతం ఈ తరానికి ఒక అపురూపమైన సందర్భం వచ్చింది. దానిని కులాలు, మతాలు , ప్రాంతాలకు అతీతంగా వినియోగించుకోవాలి. కానీ తాజాగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు దుష్ప్రభావానికి దారి తీస్తాయేమోననే సందేహాలు పెరుగుతున్నాయి. కొందరు చాందసవాదుల పోకడలు సామాజిక సంఘర్షణకు బాటలు వేస్తాయేమోననే భయాలు కలుగుతున్నాయి.
తబ్లిగి తకలీఫ్…
కరోనా భయం 130 కోట్లమందిని ఇళ్లల్లో బందీలను చేసేసింది. 21 రోజుల లాక్ డౌన్ తర్వాత వెంటనే తమ జీవితాలు సాఫీగా సాగిపోతాయనే భరోసా ఇంతవరకూ ఏర్పడలేదు. గడువును పెంచుతారో, దశలవారీగా సడలిస్తారో, పూర్తిగా ఎత్తివేస్తారో స్పష్టత లేదు. దీంతో పౌరులు అసహనానికి గురవుతున్నారు. తాజాగా తబ్లిగీ జమాత్ సమావేశాల్లో పాల్గొన్నవారు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరగడానికి కారణమని అధికారవర్గాలు నిర్ధారిస్తున్నాయి. అందులోనూ కొంతమంది చిరునామాలు ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది మెజార్టీ ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. లాక్ డౌన్ కష్టాల వల్ల ఏర్పడిన అసహనం వారిపైకి మళ్లే ప్రమాదం ఉంది. అందుకే సంబంధిత మతపెద్దలంతా జాగ్రత్త పడాలి. తమ వారికి ఎక్కడికక్కడ ప్రత్యేక వినతులు, అభ్యర్థనలు చేయాల్సి ఉంది. ఆచూకీ తెలియని వారు సమాచారమిచ్చేలా చూడాలి. వారిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ విషయాన్ని సమాజంలోని అన్నివర్గాలకు తెలియచేయాలి. లేకపోతే రెండు వర్గాల మధ్య ఏర్పడే అంతరం శాశ్వతంగా నష్టం చేకూరుస్తుంది. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తుంది. కొందరు వ్యక్తుల పెడ పోకడలు ఒక సామాజిక వర్గం మొత్తానికి ఆపాదించడం చేటు తెస్తుంది. అయితే ఆ కొందర్ని నియంత్రించాల్సిన బాధ్యత మాత్రం పెద్దలపైన ఉంటుంది. సామదానభేద దండోపాయాలను ప్రయోగించైనా సరే వారిని దారికి తెచ్చి భారతీయతను కాపాడుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వమన్న ఇండియన్ బ్రాండ్ ను పరిరక్షించుకోవాలి.
దీపంపై యాగీ…
దీపాలు వెలిగించండంటూ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా సానుకూలత లభించింది. ఇది ఒక ప్రతీకాత్మకమైన చర్యనే. అయితే దేశం సంఘీభావాన్ని తెలుపుకునే సందర్భం. ప్రజల్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంది. మంచి జరుగుతుందనే ప్రధాని పిలుపునిచ్చారని ప్రజల్లో ఎక్కువమంది భావించారు. దానివల్ల పెద్దగా నష్టం లేదు. కానీ కొన్ని పార్టీలు రాజకీయ కోణంలో చూడటం వల్ల బీజేపీకే అడ్వాంటేజ్ గా మారింది. ప్రజానీకం మొత్తానికి ఉపకరించే చర్యలపై విపక్షాలు సూచనలు, సలహాలు ఇవ్వాలి. మిగిలిన అంశాలపై ఫోకస్ ను తగ్గించాలి. ప్రజావిశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. స్ఫూర్తిని నింపే కార్యక్రమాలతోపాటు కచ్చితంగా పేదలను ఆదుకునే కార్యాచరణ అవసరం. ఇంతవరకూ కేంద్రం ప్రకటించిన రెండు పథకాలు అరకొర సాయానికి మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన లక్షా76వేల కోట్లరూపాయల ప్యాకేజీ పేదలకు, అట్టడుగు వర్గాలకు ఉద్దేశించినది. అది కూడా తిండికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఆయా వర్గాల ప్రజల సాధారణ జీవనానికి తోడ్పాటునందించేంతటి సాయం కాదు. మరి ఈ నేపథ్యంలోనే మరో పెద్ద ప్యాకేజీ కేంద్రం నుంచి ప్రజలు ఆశిస్తున్నారు. దీని కోసం రాజకీయ పార్టీలు గట్టిగా కృషి చేయాలి.
మారటోరియం మాయ…
క్రెడిట్ కార్డుల బకాయిలు సహా ఇల్లు, కారు, వ్యాపార , వ్యక్తిగత రుణాల నెలసరి వాయిదాలపై మూడు నెలల మారటోరియం అనగానే అంతా సంతోషించారు. అందులోని మతలబు అర్థమయ్యే సరికి తెల్లబోయారు. మూడు నెలల పాటు వాయిదాలు చెల్లించకుండా మినహాయింపునిస్తారు. అదే సమయంలో ఈ కాలానికి సైతం అసలుకు వడ్డీ కలిపి చివరలో వడ్డింపు చేస్తారు. ఫలితంగా మూడు నెలల కోసం సంబరపడ్డ వారు చివరిలో గడువునకు అదనంగా ఏడెనిమిది నెలలు చెల్లించాల్సి వస్తుంది. ఇంతటి పితలాటకం దాగి ఉంది. వాయిదా కాలంలో వడ్డీ లేకుండా మినహాయిస్తే మాత్రమే మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం. నెలసరి వాయిదాల పద్దులో ఎక్కువమంది ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, చిన్నతరహా వ్యాపారులే ఉంటుంటారు. వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. నిజంగా ప్రభుత్వం వారికి ప్రయోజనం కలిగించాలనుకుంటే కచ్చితంగా వాయిదాలపై వడ్డీని తీసేయాలి. అందుకు అవసరమైన నిధులను బ్యాంకులకు కేంద్రమే చెల్లించాలి. కానీ అటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ప్రజలను మభ్యపెట్టే మారటోరియం వల్ల కలిసొచ్చేదేమీ లేదు. బ్యాంకుల దయాదాక్షిణ్యాలు, రాష్ట్రప్రభుత్వాల మధ్యవర్తిత్వాలకు తావు లేకుండా నేరుగా ప్రయోజనం కల్పించే విధంగా కొత్త ఆర్థిక ప్యాకేజీని రూపకల్పన చేయడం అవసరం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని చోట్ల కేంద్ర,రాష్ట్ర అధికారపక్షాల నేతలు తమ ప్రభుత్వాలే డబ్బులిస్తున్నాయంటూ ప్రజలముందే కాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఇచ్చే సొమ్ము ఏదైనా ప్రజలదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధినేతల జేబులోది కాదన్న సంగతిని పార్టీ శ్రేణులు గుర్తించడం మంచిది.
-ఎడిటోరియల్ డెస్క్