అచ్చెన్నకు తిరుపతిలోనే తేడా కొట్టిందా?
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించారు. అయితే ఆయనకు పెద్దగా పని కల్పించడం లేదు. అంతా చంద్రబాబు, లోకేష్ లు నిర్ణయం తీసుకోవడం, జిల్లా పర్యటనలకు [more]
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించారు. అయితే ఆయనకు పెద్దగా పని కల్పించడం లేదు. అంతా చంద్రబాబు, లోకేష్ లు నిర్ణయం తీసుకోవడం, జిల్లా పర్యటనలకు [more]
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించారు. అయితే ఆయనకు పెద్దగా పని కల్పించడం లేదు. అంతా చంద్రబాబు, లోకేష్ లు నిర్ణయం తీసుకోవడం, జిల్లా పర్యటనలకు కూడా అనుమతించకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అచ్చెన్నాయుడు ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నామమాత్రంగానే ఉంచారన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి.
సరైన నిర్ణయమే అయినా..?
చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసి సరైన నిర్ణయమే తీసుకున్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన తర్వాత ఆయనపై సానుభూతి పెరిగింది. పైగా బీసీ వర్గానికి చెందిన నేత. తనకు, పార్టీకి నమ్మకమైన కుటుంబంగా పేరుంది. నోరున్న నేత కావడంతో జగన్ పై విమర్శలు చేసేందుకు అచ్చెన్నాయుడును ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావించారు.
నిధుల పంపిణీకి దూరంగా….
అందుకే తిరుపతి ఉప ఎన్నికలో అచ్చెన్నాయుడికి కీలక బాధ్యతలను అప్పగించారు. అచ్చెన్నాయుడు కూడా నెలరోజుల పాటు తిరుపతిలోనే ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా నేతలందరిని సమన్వయం చేయగలిగారు. కానీ తిరుపతిలోనే తేడా కొట్టింది. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఎన్నికల నిధుల ఖర్చు విషయంలో పక్కన పెట్టడాన్ని అచ్చెన్నాయుడు తప్పుపట్టారంటున్నారు. చంద్రబాబు, లోకేష్ లు తమకు నమ్మకమైన నేతలకే నిధుల ఖర్చు బాధ్యతలను అప్పగించారు.
దీనికి తోడు….
ఆ కోపంతోనే అచ్చెన్నాయుడు నారా లోకేష్ పై వ్యాఖ్యలు చేశారంటున్నారు. ఇక లోకేష్ పై వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు అచ్చెన్నాయుడును పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు సీనియర్ నేతలతో మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడుతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జిల్లాల పర్యటనలు తనకు తెలియకుండా ఎవరు చేయవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఆదేశం అచ్చెన్నాయుడిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిందేనన్న కామెంట్స్ పసుపు పార్టీలో వినిపిస్తున్నాయి.