తగ్గేదేలే అంటున్న అచ్చెన్న
అదేంటో ఎన్నికలకు ఇంకా సగం పైగా సమయం ఉన్నా కూడా సర్వేల మీద సర్వేలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో నూటికి నూరు శాతం తమ్ముళ్ళు గట్టిగానే [more]
అదేంటో ఎన్నికలకు ఇంకా సగం పైగా సమయం ఉన్నా కూడా సర్వేల మీద సర్వేలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో నూటికి నూరు శాతం తమ్ముళ్ళు గట్టిగానే [more]
అదేంటో ఎన్నికలకు ఇంకా సగం పైగా సమయం ఉన్నా కూడా సర్వేల మీద సర్వేలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో నూటికి నూరు శాతం తమ్ముళ్ళు గట్టిగానే శ్రమిస్తున్నారు. ఒక్కోసారి వారు జ్యోతీష్యుల అవతారం కూడా ఎత్తుతున్నారు. మొత్తానికి వారి మాటల్లో సారం ఏంటి అంటే టీడీపీ గెలిచేస్తోంది. అలా ఇలా కాదు ఏకంగా ఏపీలో అన్ని సీట్లను ఊడ్చేసి మరీ సైకిల్ బెల్ మోత మోగించేస్తుందని. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు జగన్ కి కొన్ని సీట్లు అయినా మిగిల్చాయి. కానీ ఘనత వహించిన అచ్చెన్నాయుడు సర్వే మాత్రం టోటల్ సీట్లు టీడీపీవే అంటోంది.
నంబర్ అదుర్స్ …
అచ్చెన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఏకంగా 155 సీట్లు వస్తాయని జోషైన జోస్యాన్ని బహు లెస్సగా పలికారు. మరి ఆ మిగిలిన ఇరవై సీట్లు ఎవరికి వస్తాయో చెప్పలేదు కానీ జగన్ పార్టీ కంటే నాలుగాకులు ఎక్కువ టీడీపీ చదివింది అని చెప్పడానికి కాబోలు వైసీపీ 151 నంబర్ ని అమాంతం 155కి పెంచేసి టీడీపీ ఖాతాలో వేశారు. మరి ఈ నంబర్ వెనక లాజిక్కూ మ్యాజిక్కూ ఏమైనా ఉన్నాయా అంటే అవన్నీ అసలు అడగకూడదు, అచ్చెన్నాయుడు చెప్పారు అంటే జరిగితీరాలంతే అంటున్నారు ఆయన పార్టీ తమ్ముళ్ళు.
ఎంతసేపూ ఆ గోలేనా….?
ప్రజా సమస్యలు చూడండి సామీ అంటూ జనాలు 23 సీట్లు టీడీపీ చేతిలో పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం మాకొద్దీ హోదా అంటోంది. జగన్ సీఎం కుర్చీ ఎక్కినది లగాయితూ వచ్చే ఎన్నికల్లో మేమే వస్తామంటూ పాట పాడడమే పనిగా అయిపోయింది. ఇంతకాలం అలా చెప్పి తమ్ముళ్లకు ధైర్యం నూరిపోస్తున్న టీడీపీ ఇపుడు ఒక్కసారిగా గేరు మార్చింది. సర్వేలు అంటోంది. తమకు అందుతున్న సమాచారం అంటోంది. ఇంకా ఏవేవో చెబుతోంది. ఇలా టీడీపీ గెలిచేసినట్లే అన్న ఇంప్రెషన్ అయితే తేవాలని తెగ తాపత్రయపడుతోంది. ఇక అచ్చెన్నాయుడు అక్కడితో ఆగడంలేదు. మేము అధికారంలోకి వస్తే కధ వేరేగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. అపుడు ఒక్కరు కూడా మిమ్మల్ని పలకరించే దిక్కు ఉండదని కూడా అధికార పార్టీ నేతలకు వార్నింగులే ఇస్తున్నారు.
ఏం చేశారని…?
రెండున్నరేళ్ళు అంటే చాలా పెద్ద సమయమే. కానీ ఈ కీలకమైన సమయంలో ఒక ప్రతిపక్షంగా టీడీపీ ఏం చేసింది అంటే జవాబు ఉందా. ఎంతసేపూ కోర్టు కేసులు పిల్స్ వేయడాలూ తప్ప మరేమీ టీడీపీ చేయలేదన్న మాట ఉంది. కానీ తాము తప్ప జనాలకు వేరే దిక్కు లేదన్న ధీమావే ఇపుడు టీడీపీ నేతల చేత ఈ సర్వే పలుకులు పలికిస్తోంది అనే అంటున్నారు. జగన్ ఫెయిల్ అయ్యాడు అని వారికి వారే చెప్పేసుకుంటూ ఇక వచ్చేది తామే అని భుజాలు తట్టేసుకుంటున్నారు. మరి విపక్షంలో ఉండగానే మూడు చెరువుల నీళ్ళు టీడీపీ పెద్దలకు తాగించిన జగన్ ఇపుడు అధికారంలో ఉన్నారు. సహజంగానే పవర్ లో ఉన్న వారు సూపర్ పవర్స్ అని చెబుతారు. మరి అదే కనుక చూసుకుంటే జగన్ అంత తేలిగ్గా 155 సీట్లు టీడీపీకి ఇచ్చేసి చేతులు కట్టుకుంటాడా. ఏది ఏమైనా మాటలు కోటలు దాటుతున్నాయి. తమ్ముళ్ళు మాత్రం గడప దాటడం లేదు అన్నది నిజం. అచ్చెన్నాయుడు 155 అంటే రేపు మరో తమ్ముడు ఆ నంబర్ ని ఎక్కడకి తీసుకుపోతాడో చూడడమే ఇపుడు తెలుగు తమ్ముళ్ళ వంతు మరి.