మోదీ సారూ.. రికార్డులు కాదు… రివార్డులు ముఖ్యం…?
నరేంద్ర మోడీకి రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. విదేశీపర్యటనలు, అత్యంత కీలకమైన చట్టాల ఆమోదం, దీర్ఘకాలం పెండింగులో ఉన్న అంశాలను కొలిక్కి తేవడం వంటి విషయాల్లో కేంద్ర [more]
నరేంద్ర మోడీకి రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. విదేశీపర్యటనలు, అత్యంత కీలకమైన చట్టాల ఆమోదం, దీర్ఘకాలం పెండింగులో ఉన్న అంశాలను కొలిక్కి తేవడం వంటి విషయాల్లో కేంద్ర [more]
నరేంద్ర మోడీకి రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. విదేశీపర్యటనలు, అత్యంత కీలకమైన చట్టాల ఆమోదం, దీర్ఘకాలం పెండింగులో ఉన్న అంశాలను కొలిక్కి తేవడం వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వంముందడుగు వేసింది. కొన్నింటిలో చేదు అనుభవాలనూ చవి చూసింది. ఏదేమైనా మంచికి, చెడుకు ప్రధానిగా బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు మంచి పేరు వస్తే అధినేతగా ఆ ఖ్యాతి మోడీకి సైతం దక్కుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. తాజా రికార్డు మాత్రం పూర్తిగా మోడీకి సంబంధించింది. స్వాతంత్ర్యానంతరం భారత దేశానికి సుదీర్ఘకాలం పనిచేసిన పీఎంగా నాలుగో స్థానంలో నిలిచారు. నిన్నామొన్నటివరకూ ఈ స్థానంలో ఉన్న తమ పార్టీకే చెందిన అటల్ బిహారీ వాజపేయి 2268 రోజుల పదవీ కాలం రికార్డును మోడీ అధిగమించారు.
కాలం..కార్యం…
ఎంతకాలం పనిచేశారనే దానికంటే ఎంత ప్రభావ వంతంగా దేశాన్ని తీర్చిదిద్దారనేది ముఖ్యం. తక్కువ కాలంలోనే కొందరు తమదైన ముద్ర వేస్తుంటారు. అటువంటి వారిలో లాల్ బహదూర్ శాస్త్రిని చెప్పుకోవాలి. 1964-66 మధ్య దేశానికి దిశానిర్దేశం చేసిన శాస్త్రి అత్యంత క్లిష్ట సమయంలో బాధ్యతలు నిర్వర్తించారు. దాయాది పాకిస్తాన్ తో పోరు, దేశానికి ఆహార పదార్థాల సమస్య , చైనాతోనూ కష్టాల కొలిమి. ఇలా ఇంటా, బయటా వెతలు వెన్నాడుతున్నా దేశాన్ని ఐక్యతాభావంతో ముందుకు నడిపి సమస్యలను దూది పింజల్లా భావింపచేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ‘జై జవాన్ ..జై కిసాన్’ అంటూ నేటికీ ప్రతిధ్వనించే నినాదం ఆయన పరిపాలన కాలం. ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూ దేశానికి బాసటగా నిలవాలనే భావన రేకెత్తించడంలో తనదైన ముద్ర వేయగలిగారు శాస్త్రి. తర్వాత అంతటి సంయమన శీలి గా మనం అటల్ బిహారీ వాజపేయినే చెప్పుకోవాలి. సైద్దాంతిక అంశాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ సంకీర్ణ శకంలో సంపూర్ణపరిపాలన కాలం విధులు నిర్వర్తించడం ఆయనకే చెల్లింది.
బ్రాండ్ అంబాసిడర్లు…
ప్రజాస్వామ్య భారతదేశం పేరు చెప్పగానే అయిదారుగురు అగ్రనేతలు కళ్ల ముందు కదలాడతారు. తొలి ప్రధాని నెహ్రూ నవభారత నిర్మాతగా మనకు తెలుసు. శాంతిదూతగా ప్రపంచానికి పరిచయం. పంచశీల ప్రతిపాదకునిగా, అలీనవిధానం అవలంబించిన దార్శనికునిగా ఆయన వరల్డ్ లీడర్ గా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్ లో సామ్యవాద అభివృద్ధి శకానికి పునాదులు వేశారు. 16 సంవత్సరాల సుదీర్ఘకాలం భారత్ ను పాలించారు. ఆ తర్వాత రికార్డు 15 ఏళ్ల పాటు పాలించిన ఇందిరదే. నెహ్రూతో పోలిస్తే ఇందిర పరిపాలన చాలా భిన్నంగా కనిపిస్తుంది. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల అమలు వంటి సంస్కరణలు కనిపిస్తాయి. అదే సమయంలో గరీబీ హటావో అంటూ పేదలను అక్కున చేర్చుకున్నారు . నేడు అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ శకానికి నాంది పలికింది ఇందిరాగాంధీయే అని చెప్పాలి. అయితే ఇంతటి విచ్చలవిడితనం లేదు. పదేళ్లు పరిపాలించిన మన్మోహన్ సింగ్ తల్లిచాటు బిడ్డలా మిగిలిపోయారు. కానీ నిలువెత్తు నిజాయతీకి ప్రతిరూపం. దేశ ఆర్థిక ప్రగతికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతాపార్టీ సైద్ధాంతిక మూలాల నుంచి వచ్చిన వ్యక్తి . పూర్తికాలం కొనసాగిన కాంగ్రెసేతర తొలి ప్రధాని. సంకీర్ణాలను సమర్థంగా నిర్వహించవచ్చని నిరూపించారాయన. ఆధునిక శకంలో భారత వికాసానికి సువర్ణబాటలు పరిచిన ప్రధానిగా వాజపేయి గుర్తుండిపోతారు. ఈ సందర్భంలో తప్పకుండా ప్రస్తావించుకోవాల్సిన మరో వ్యక్తి పీవీ నరసింహారావు. పీవీ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో సంస్కరణల సారథిగా ఆయనను ప్రస్తుతించుకోవడం భారతీయుల విహిత కర్తవ్యం.
ముందున్న కాలం…
నెహ్రూ, ఇందిర, మన్మోహన్ ల తర్వాత మోడీ ఇప్పుడు సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా ముందు వరసకు వచ్చేశారు. మొదటి ముగ్గురూ కాంగ్రెసు పాలకులే. ఇప్పుడు నాలుగైదు స్థానాలు బీజేపీకి చెందుతున్నాయి. స్వాతంత్ర్యానంతరం ప్రతిపక్షానికి లభించిన అద్భుతమైన అవకాశం ఇది. వృద్ధ నేతలు, వారసత్వం, అవినీతి మూడు వైపులా కుంగదీస్తున్న కాంగ్రెస్ ముందడుగు వేయలేని పరిస్థితిలో బీజేపీకి అవకాశం వచ్చింది. పెద్దగా వ్యతిరేకత లేకుండానే తమ పార్టీ మూల సిద్ధాంతాలైన ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి సాకారం చేయగలిగింది. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంతమేరకు మార్పు తేగలిగిందనే ప్రశ్న తలెత్తుతుంది. కచ్చితంగా ఆశించిన స్థాయిలో ప్రజల జీవితం బాగు పడటం లేదని నిపుణులు, రాజకీయ వేత్తలు అంగీకరిస్తారు. అయినప్పటికీ ఈనాటికీ మోడీకి, బీజేపీకి ప్రజల్లో మద్దతు లభిస్తుందంటే కారణం భారతీయ భావోద్వేగం. సెంటిమెంటు. అదే బీజేపీ ప్రభుత్వాలకు ఊపిరి పోస్తోంది. మరోవైపు పెద్ద ఉత్పాతాలేమీ సర్కారుకు ఇంతవరకూ ఎదురుకాలేదు. 1991లో దేశం దివాళా నేపథ్యంలో అత్యంత సంక్లిష్ట సమయంలో పీవీ నరసింహారావు దేశాన్ని గట్టెక్కించారు. 2008లో ప్రపంచమంతా ఆర్థికమాంద్యంలో చిక్కుకున్న పరిస్థితుల్లో దేశంపై ఆ ప్రభావం పెద్దగా కనిపించకుండా ఆర్ధిక మాయాజాలం చేయగలిగారు మన్మోహన్. ఇప్పుడు కరోనా కారణంగా అటువంటి స్థితే దేశంలో నెలకొంది. అంతకంటే కష్ట సమయం. ఇది నిజంగా మోడీకి పరీక్షా కాలం. ఎంత సమర్థంగా దీని నుంచి దేశాన్ని బయటపడేయగలరనే అంశం పైనే మోడీ పనితీరును భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయి. కాల ప్రమాణం ప్రకారం లభించే రికార్డు కంటే కార్యాచరణ తో వచ్చే రివార్డే ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతుంది.
-ఎడిటోరియల్ డెస్క్