నమ్మకమైనోడు కాదు.. సరైనోడు అసలే కాదు
కడుపులో కత్తెర…నోట్లో చక్కెర, నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తూ….వంటి పాత తెలుగు సామెతలు చైనాకు చక్కగా వర్తిస్తాయి. అంతర్జాతీయ వేదికలపై అదేపనిగా శాంతి వచనాలు వల్లించడం, ధర్మోపన్యాసాలు [more]
కడుపులో కత్తెర…నోట్లో చక్కెర, నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తూ….వంటి పాత తెలుగు సామెతలు చైనాకు చక్కగా వర్తిస్తాయి. అంతర్జాతీయ వేదికలపై అదేపనిగా శాంతి వచనాలు వల్లించడం, ధర్మోపన్యాసాలు [more]
కడుపులో కత్తెర…నోట్లో చక్కెర, నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తూ….వంటి పాత తెలుగు సామెతలు చైనాకు చక్కగా వర్తిస్తాయి. అంతర్జాతీయ వేదికలపై అదేపనిగా శాంతి వచనాలు వల్లించడం, ధర్మోపన్యాసాలు చేయడం, తియ్యటి పలకరింపులు, ఆత్మీయ కరచాలనాలు, కౌగలింపులు వంటి మర్యాదలకు తక్కువేమీ లేదు. నాటకీయతను కనబరచడంలో బీజింగ్ ను మించిన వారు ఎవరూ లేరు. ఇదంతా నాణనికి ఒక వైపు మాత్రమే. తెరవెనుక అది చేసే కుట్రలకు, కుయుక్తులకు ప్రత్యర్థి నోట మాట రాదు.
1962లోనూ అంతే…
1962లో కూడా నీతివాక్యాలు వల్లిస్తూ, భారత్ ను నమ్మిస్తూ ఆకస్మికంగా యుద్ధానికి దిగి భారత్ ను చైనా నిట్టనిలువునా ముంచిన సంగతి తెలిసిందే. అప్పుడు పంచశీల ఒప్పందం పేరుతో మోసగించింది. ఇప్పుడు కూడా అలాంటి ఒప్పందం పేరుతోనే ముందుకువస్తోంది. దౌత్య ప్రపంచంలో ఇలాంటి ఒప్పందాలు అనివార్యం అయినప్పటికీ ఒకపక్క దానికి కట్టుబడుతూనే, మరోపక్క శత్రువు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తాజాగా రష్యా మధ్యవర్తిత్వంలో కుదిరిన శాంతి ఒప్పందం నేపథ్యంలో ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళితే చైనా నిలువెత్తు నమ్మకద్రోహం వెల్లడవుతుంది.
వామపక్ష భావాలున్న…..
స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో పొరుగున ఉన్న పెద్దదేశం, వామపక్ష వాద భావజాలం గల చైనా పట్ల సానుకూలంగా ఉండాలని నాటి ప్రధాని పండిత నెహ్రూ తలపోశారు. ఎక్కడో దూరాన ఉన్న మరో వామపక్ష దేశం సోవియట్ యూనియన్ (నేటి రష్యా)తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే చైనాతోనూ అదే తీరులో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడో సుదూరాన ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ గల అమెరికా కన్నా ఈ రెండు పెద్ద దేశాలతో సత్సంబంధాలు నెరపడం మేలన్నది నెహ్రూ ఉద్దేశం. అదీగాక దాయాది దేశమైన పాకిస్థాన్ పట్ల అప్పట్లో అమెరికా సానుకూలంగా ఉండేది. దీంతో చైనాతో స్నేహం అనివార్యమని నెహ్రూ భావించారు.
పంచశీల ఒప్పందం ఉన్నా….
ఈ నేపథ్యంలో 1954 ఏప్రిల్ 29న ఉభయ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దాని పేరే ‘పంచశీల ఒప్పందం. నాటి చైనా రాజధాని పెకింగ్ (ప్రస్తుత బీజింగ్) ఇందుకు వేదికైంది. భారత విదేశాంగ కార్యదర్శి ఎన్.రాఘవన్, చైనా ఉప విదేశాంగ మంత్రి చాంగ్ హాన్ పు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాల ప్రధానులు నెహ్రూ, చౌ ఎన్ లై సమక్షంలో ఈ చారిత్రక ఒప్పందం రూపుదిద్దుకుంది. దీంతో ఉభయ దేశాల మధ్య చిరకాలం శాంతి నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమైంది. అంతర్జాతీయ సమాజం కూడా ఈ ఒప్పందాన్నిస్వాగతించింది. ఇరుదేశాలల సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవడం, శాంతిని పాటించడం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడం, శాంతియుత సమజీవనం, పరస్పర సమానత్వం పాటించడం ఒప్పందంలోని ప్రధానాంశాలు.
నాడు అలాగా….
ఒప్పందం కుదిరిన తరవత భారత్ లో పర్యటించిన నాటి చైనా ప్రధాని చౌ ఎన్ లై ఒక అడుగు ముందుకేసి హిందీ-చినీ భాయి భాయి అంటూ నినదించారు. ప్రజలు ఈ నినాదాన్ని పాటించాలని కోరారు. 1962 లో ఆకస్మిక యుద్ధానికి దిగి చైనా ఒప్పందానికి తూట్లు పొడిచింది. నమ్మక ద్రోహానికి పాల్పడింది. భారత్ ను నిట్టనిలువునా ముంచింది. నాటి ఓటమి కారణంగానే ప్రధాని నెహ్రూ అవమానభారంతో పరమపదించారన్న అభిప్రాయం దౌత్యవర్గాల్లో ఉంది.
మళ్లీ శాంతి ఒప్పందంతో…..
తాజాగా మళ్లీ శాంతి ఒప్పందం పేరుతో చైనా ముందుకు వచ్చింది. తాజాగా ఈనెల రెండో వారంలో రష్యా రాజధాని మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశానికి హాజరైన ఇరుదేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ మధ్య మరో ఒప్పందం కుదిరింది. పంచశీల ఒప్పందానికి ప్రతిరూపమే ఇది. సరిహద్దుల్లో బలగాలను కనీస స్థాయికి తగ్గించడం, విభేదాలు విద్వేషాలుగా మారకుండా చూడటం, పాత ఒప్పందాలను గౌరవించడం, చర్చల ప్రక్రియను కొనసాగించడం, విశ్వాస పాదుకల్పన చర్యలు చేపట్టడం …ఇవీ స్థూలంగా ఒప్పందంలోని అంశాలు. ఒప్పందం కుదిరినంత మాత్రాన ఇక ఇబ్బందేమీ లేదని భావిస్తే అంతకన్నా పొరపాటు ఉండదు. ఓ వంక ఒప్పందాన్ని గౌరవిస్తూనే, మరోవంక బీజింగ్ చర్యలపై, తీరుపై, వ్యవహారశైలిపై ఓ కన్నేసి ఉంచడం భారత్ భాధ్యత. గత చేదు అనుభవాల నేపథ్యంలో అప్రమత్తత అనివార్యం.
-ఎడిటోరియల్ డెస్క్