బెజవాడ నడిబొడ్డులో… ఇది నిజమేనా?
విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఉలిక్కి పడ్డాను. ఊరవతల కాలనీలకు పరిమితమైన అంబేద్కర్ విగ్రహం ఊరి [more]
విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఉలిక్కి పడ్డాను. ఊరవతల కాలనీలకు పరిమితమైన అంబేద్కర్ విగ్రహం ఊరి [more]
విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఉలిక్కి పడ్డాను. ఊరవతల కాలనీలకు పరిమితమైన అంబేద్కర్ విగ్రహం ఊరి మధ్యలోకా? అదికూడా విజయవాడ నగర నడిబొడ్డులోకా? అని ఆశ్చర్యం వేసింది. గరగపర్రు గ్రామంలో చెరువు గట్టుమీదే పెట్టలేని అంబేద్కర్ విగ్రహం ఏకంగా విజయవాడ నగరంలో నెలకొల్పుతామంటే కించిత్ ఆశ్చర్యం కలగదా?
అంబేద్కర్ విగ్రహాలు …..
విజయవాడలోని సి కె రెడ్డి రోడ్ (పూర్ణానందం పేట ఏలూరు లాకుల సెంటర్ నుండి బుడమేరు వంతెన వరకు) లో 1990 దశకంలో అంబేద్కర్ విగ్రహం వచ్చింది. నూజివీడు వైపునుండి బస్సులు అన్నీ రాకపోకలు ఈ రోడ్డునుండే ఉండేవి. నగరంలో సింగ్ నగర్ వైపు వెళ్ళే బస్సులు, ఆటోలు కూడా ఈ రోడ్డునే వెళ్ళేవి. రోడ్డు నిత్యం రద్దీగా ఉండేది. రైల్వే స్టేషన్ కు వెళ్ళే రోడ్డు కూడా ఇదే కావడంతో రద్దీ ఎక్కువగా ఉండేది.
విగ్రహం ఏర్పాటు చేశాక…..
చిత్రంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన రెండు మూడేళ్ళకే ఈ రోడ్డు వాడకం తగ్గిపోయింది. ఏ కారణం లేకుండానే ఏలూరు కాల్వకు రెండో వైపున సమాంతరంగా ఉండే జి ఎస్ రాజు రోడ్డును అభివృద్ధి చేసి సిటీ బస్సులు, నూజివీడు, సత్తుపల్లి వైపునుండి బస్సుల రాకపోకలు అన్నీ అటు మళ్ళించేశారు. క్రమేణా ఆటోలు కూడా ఈ రోడ్డు వైపు రావడం నిలిచిపోయింది. కేదారేశ్వర పేటలో ఉన్న మ్యాంగో (పళ్ళ) మార్కెట్ కారణంగా ఈ రోడ్డు మరింత రద్దీగా ఉండేది. ఇప్పుడు మార్కెట్ నున్నవైపు తరలించడంతో ఆ రద్దీ కూడా తగ్గింది.
రోడ్డును వాడటం మానేసి…..
అయోధ్య నగర్, సింగ్ నగర్, పాయకాపురం వైపు వెళ్ళే నగర ప్రజలు కూడా ఈ రోడ్డును వాడడం మానివేశారు. ఇప్పుడు ఈ రోడ్డు కేవలం పెజ్జోనిపేట, బాప్టిస్టు పాలెం ప్రాంత వాసులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అక్కడ (ఆంధ్ర ప్రభ & ఇండియన్ ఎక్స్ ప్రెస్) పత్రికల కార్యాలయం ఉండే ప్రదేశంలోని చెక్క బల్లలు చేసుకునే వారు ఈ రోడ్డును పూర్తిగా వాడుకుంటున్నారు. 1990 దశకం వరకూ ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు అంబేద్కర్ విగ్రహం కారణంగా ఇప్పుడు “కండెమ్” చేయబడింది. అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు బాప్టిస్టు పాలెం, పెజ్జోనిపేట ప్రజలకు మాత్రమే కనిపిస్తుంది.
అలా మరుగున పడిపోయి…..
ఇక సరిగ్గా ఇదే దశకంలో కళాక్షేత్రం ఎదురుగా మరో అంబేద్కర్ విగ్రహం వచ్చింది. ఎందుకో, ఏమో ఇప్పుడు ఆ విగ్రహం కనిపించదు. ఒక వైపు కమ్యూనిస్టులు చండ్ర రాజేశ్వరరావు విగ్రహం పెట్టారు. మరో వైపు విజయవాడ మునిసిపాలిటీ 100 సంవత్సరాల సందర్భంగా కెసిపి వారి సౌజన్యంతో 100 అడుగుల భారీ నిర్మాణం ఒకటి ఏర్పాటయింది. అంబేద్కర్ విగ్రహం అలా మరుగున పడింది. ఇలాంటి బెజవాడ నగరంలో, నగరానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన బందరు రోడ్డు పక్కన, అందునా స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం అంటే ఉలిక్కి పడాల్సిందే. ఇన్నేళ్ళ చరిత్ర కలిగిన ఈ నగరం ఇప్పటివరకూ అంబేద్కర్ విగ్రహాన్ని స్వాగతించలేదు.
స్వరాజ్ మైదానం అన్నది……
విజయవాడ నగరానికి స్వరాజ్ మైదానం అత్యంత ప్రాముఖ్యమైనది. నగరానికి ఉన్న ఏకైక ఖాళీ మైదానం ఇది. వినోదం కోసం ఎగ్జిబిషన్లు, సర్కస్ ప్రదర్శనలు, విజ్ఞానం కోసం పుస్తక ప్రదర్శనలు, అప్పుడప్పుడూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆప్కో ప్రదర్శనలు జరిగే ప్రదేశం. ఇక్కడ అంబేద్కర్ స్మారక వనం ఏర్పాటు చేస్తే నగరానికి ఉన్న ఏకైక మైదానం పోతుందని ఆందోళన కలిగింది. గతంలో ప్రభుత్వం ఈ మైదానాన్ని చైనా కంపెనీ సహాయంతో సిటీ సెంట్రల్ పార్క్ పేరుతో అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా మైదానం లేకపోతే ఎలా అనే ఆందోళనే కలిగింది. ఉన్న 20 ఎకరాల మైదానంలో దాదాపు 10 ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. అందులోనే రైతు బజార్ పెట్టారు. అక్కడే అగ్నిమాపక కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఇలా కొద్దికొద్దిగా, నెమ్మదినెమ్మదిగా మైదానం ఆక్రమణకు గురై ఇప్పుడు కేవలం 10 ఎకరాలే మిగిలింది. ఇంతకు ముందు ఒకసారి ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్న సమయంలో ఈ 10 ఎకరాల్లో ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించి విశాలమైన మైదానం పునరుద్దరించాలని జరిగిన ప్రయత్నాలేవీ ఫలించ లేదు. అందుకే “సిటీ సెంట్రల్ పార్క్” అన్నప్పుడు ఆందోళన కలిగింది. ఇప్పుడు అంబేద్కర్ పార్క్ అంటే కూడా అదే ఆందోళన.
ప్రభుత్వ హామీతో…..
అయితే ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. (GO. Rt. No. 244, Dt. 07-07-2020) మైదానంలోని 10 ఎకరాల్లో ఉన్న భవనాలు తొలగిస్తామని ప్రభుత్వం చెప్పింది. అంబేద్కర్ విగ్రహంతో పాటు పార్కు అభివృద్ధి చేస్తామని చెప్పింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మైదానంలో ఇప్పుడు నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలు ఆ తర్వాత కూడా నిర్వహించుకునేందుకు అనుమతులు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు తర్వాత కూడా ఈ మైదానం నగర ప్రజలకు ఇప్పటిలాగానే ఉపయోగపడుతుందనే హామీ ఇచ్చింది. ఇది కొంత ఉపశమనం కలిగించే విషయమే. మైదానాన్ని ఇప్పటిలాగే ప్రజోపయోగ అవసరాలకు వినియోగించుకునే వీలు కల్పించడం మంచి నిర్ణయమే. మైదానం నగర ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. ఇక అంబేద్కర్ విగ్రహాన్ని ఈ బెజవాడ నగరం ఎలా తీసుకుంటుందో చూడాలి. సి కె రెడ్డి రోడ్డులాగా బందరు రోడ్డు కూడా వదిలేస్తారా లేక కళాక్షేత్రం వద్ద పెట్టినట్టు ఏదో పెద్ద టవర్ పెట్టి అంబేద్కర్ విగ్రహం కనపడకుండా చేస్తారా? చూద్దాం.
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్