ఇద్దరూ ఆ ఎన్నికల కోసమే ఎదురుచూపులు…?
కేంద్రం వైఖరితో మింగ లేక కక్కలేక తంటాలు పడుతున్న ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు తమిళనాట ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ తమకొక బలమైన మిత్రుడు దొరుకుతాడనే ఆశిస్తున్నారు. [more]
కేంద్రం వైఖరితో మింగ లేక కక్కలేక తంటాలు పడుతున్న ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు తమిళనాట ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ తమకొక బలమైన మిత్రుడు దొరుకుతాడనే ఆశిస్తున్నారు. [more]
కేంద్రం వైఖరితో మింగ లేక కక్కలేక తంటాలు పడుతున్న ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు తమిళనాట ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ తమకొక బలమైన మిత్రుడు దొరుకుతాడనే ఆశిస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్ తో ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నికల తర్వాత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే కొంతమేరకు బీజేపీ దూకుడుకు కళ్లెం వేయవచ్చనే భావన తెలుగు ముఖ్యమంత్రుల్లో నెలకొందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బడ్జెట్ సహా వివిధ విషయాల్లోనూ తెలుగు రాష్ట్రాలకు పూచికపుల్లపాటి విలువ లేకుండా పోయింది. రకరకాల రాజకీయ కారణాలతో అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది. నిజానికి దక్షిణభారతంలోనే అత్యంత ప్రభావశీలమైన , ప్రజాదరణ కలిగిన నాయకులు జగన్ , కేసీఆర్ లు. అయినప్పటికీ కేంద్రం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వ్యక్తిగతంగా, రాజకీయంగా ఉన్న బలహీనతలను టార్గెట్ చేసి బీజేపీ ఇబ్బంది పెడుతుందనే అనుమానమే జగన్, కేసీఆర్ లను నియంత్రిస్తోంది.
స్టాలిన్ .. ద్రవిడ ఐకాన్…
పెరియార్ రామస్వామి, అన్నాదురై, ఎంజీఆర్ , కరుణానిధి వంటి నాయకుల తర్వాత ద్రవిడ వాదం బలహీన పడుతుందనే చెప్పవచ్చు. అయితే దానికి కొంతమేరకు న్యాయం చేసే నేతగా స్టాలిన్ నిలదొక్కుకుంటున్నాడు. రజనీ కాంత్ రాజకీయ రంగప్రవేశంతో తమిళనాట చక్రం తిప్పవచ్చని బీజేపీ భావించింది. అనూహ్యంగా తెరవెనకనే ఉంటానంటూ తలైవా తలతిప్పేశాడు. స్టాలిన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలను తట్టుకోవడం కష్టమని రజనీకాంత్ గ్రహించారు. బీజేపీని గట్టిగా నిలదీయగల నాయకుడు స్టాలిన్ మాత్రమేనని తమిళనాడులో విశ్వసిస్తున్నారు. ఎన్డీఏ హయాంలో రాష్ట్రాల హక్కులు దెబ్బతింటున్నాయి . దక్షిణాదిలో పెద్ద రాష్ట్రమైన తమిళనాడు నుంచే హక్కుల పోరాటం మొదలు కావాలని రాజకీయ నేతలు ఆశిస్తున్నారు. కేసీఆర్ ద్రవిడ నాయకుడిగా పూర్తిగా రూపుదాల్చడం కష్టం. ప్రాంతీయ అస్తిత్వంతో కూడిన తెలంగాణ నాయకుడిగానే ఆయనకు పేరు. జగన్ సొంత రాష్ట్రంలోనే అనేక సమస్యల్లో కూరుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాట ఎన్నికల్లో డీఎంకే గెలుపు సాధిస్తే ప్రాంతీయ కూటమికి ఆస్కారం ఏర్పడుతుందంటున్నారు.
డీఎంకే డక్కామొక్కీలు..
స్టాలిన్ బలమైన నాయకుడే అయినప్పటికీ డీఎంకే అంతర్గత పోరును ఎదుర్కొంటోంది. రానున్న ఎన్నికలు అతని రాజకీయ జీవితానికి పరీక్ష. దక్షిణ తమిళనాట అన్న అళగిరి పార్టీని దెబ్బతీస్తారు. భుజాన ఎత్తుకున్న ఏఐఏడీఎంకే విజయానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. డీఎంకే కు ఎదురెళ్లడానికి సాహసించక వెనక్కి తగ్గిన రజనీ కాంత్ పరోక్షంగా ఏఐఏడీఎంకే, బీజేపీలకే జై కొట్టవచ్చు. ఇంకోవైపు కమలహాసన్ డీఎంకే ఓటు బ్యాంకునే దెబ్బతీస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా పరిపాలన విషయంలో గతంలో కంటే ఏఐఏ డీఎంకే ఈసారి మంచి ట్రాక్ రికార్డు సాధించిందనేది పరిశీలకుల అధ్యయనం. నియంతృత్వం, ప్రత్యర్థులపై కక్ష సాధింపు వంటి దుందుడుకు చర్యలు లేకుండా సాఫీగా పాలన సాగింది. ఇవన్నీ డీఎంకేకు ప్రతికూల అంశాలే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొంతమేరకు తెలుగు ప్రజల్లో ప్రభావం చూపగలుగుతారు. అయితే ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్లకపోవచ్చు. తన సామాజిక వర్గాల ద్వారా డీఎంకే ను ఆదుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇది డీఎంకేకు ప్లస్ పాయింట్. అదే సమయంలో గతంలో మిత్రునిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు డీఎంకే అవకాశాలను గండి కొట్టేందుకు ఏఐఏడీఎంకే తో సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నాల్లో పడ్డారు.
దక్షిణాది స్వరం పెరిగేనా…?
కాంగ్రెసు, వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో దక్షిణభారతదేశానికి అధిక ప్రాధాన్యం దక్కుతుండేది. కానీ ప్రస్తుతం మోడీ హయాంలో పూర్తిగా ప్రాబల్యం కోల్పోయింది. ఒక్క కర్ణాటకను మినహాయించి మిగిలిన నాలుగు చోట్ల ప్రతిపక్షాలే అధికారంలో ఉండటం ఇందుకు ఒక కారణం. తమిళనాట మిత్రపక్షమే అయినా సొంత బలం లేదు. ఈ స్థితిలో రానున్న రోజుల్లో దక్షిణభారతానికి జాతీయ స్థాయిలో అనేక రకాలుగా అన్యాయం జరిగే అవకాశం ఉంది. జనాభా ను అనుసరించి పార్టమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన, జనాభాను అనుసరించి ఫైనాన్ష్ కమిషన్ నిధుల కేటాయింపు వంటివి చోటు చేసుకుంటే అత్యంత ప్రమాదకరం. దక్షిణభారతం తన రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోతుంది. ఆర్థికంగా నష్టపోతుంది. అందువల్ల ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న జగన్, కేసీఆర్, స్టాలిన్, దేవెగౌడ్ వంటివారు చేతులు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తమిళనాడు ఎన్నికలు మార్గం చూపుతాయనే ఆశించవచ్చు. అయితే రాజకీయాల్లో వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాలకే తమిళ నాయకులు కూడా పెద్ద పీట వేస్తుంటారు. నెగ్గిన తర్వాత స్టాలిన్ కూడా కమలం కోటలోకి, మోడీ కోటరీలోకి చేరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
-ఎడిటోరియల్ డెస్క్