జరగని పెళ్లికి.. జీలకర్ర బెల్లం..!
ఎంపీల రాజీనామాలు కూడా అయిపోయాయి. అందరూ అదే మాట. చంద్రబాబు స్టేజీ ఎక్కితే చాలు వల్లె వేసే మంత్రమదే. జగన్ బృందానికి జయగీతమూ అదే. పవన్ ఎప్పుడో చెప్పేశాడు తన పంథా అదేనని. కాంగ్రెసు అయితే అధికారంలోకి వస్తే తొలి సంతకమని ప్రకటించేసింది. ఈ ప్రత్యేక హోదా అనే బ్రహ్మ పదార్థం చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం. వైసీపీ లోక్ సభ సభ్యుల రాజీనామాల పున: ధ్రువీకరణ తర్వాత మరోసారి స్క్రీన్ మీదకు వచ్చిందీ చిత్రం. మీడియా డిబేట్లు, టీడీపీ, వైసీపీల తిట్లు, దండకాలు యథాతథంగా హోరెత్తించాయి. మేమే తెస్తామంటూ రెండు పార్టీలూ ప్రకటించేసుకున్నాయి. ఎదుటి పక్షం నాటకాలాడుతోందని పరస్పరం ఆక్షేపించేసుకున్నాయి. అసలు జరగని పెళ్లికి మేళతాళాలన్నట్టుగా మారింది తంతు. దేశ రాజకీయం తెలిసిన వారు, భవిష్యత్తు సమీకరణలపై అంచనా వేసేవారు ఆంధ్రప్రదేశ్ కు హోదా అనేది ఒక నినాదంగానే మిగిలిపోతుందని తేల్చిచెప్పేస్తున్నారు. అందరు చేస్తున్నది డ్రామానేనని డంకా బజాయిస్తున్నారు. 2019లో కేంద్రంలో కనిపించే మూడు ఆప్షన్లలో ఏ ఒక్కటి ఏపీ ప్రత్యేక హోదాకు సానుకూలంగా ఉండబోదంటున్నారు.
కమలం వికసిస్తే...
ప్రస్తుతమున్న సమీకరణల ప్రకారం 2019లో బీజేపీ అధికారానికి డోకా లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సొంతంగా ఆధిక్యత సాధించిన ప్రస్తుత పరిస్థితి నుంచి ఇతరుల మీద ఆధారపడాల్సిన సంకీర్ణయుగంలోకి వెళ్లవచ్చంటున్నారు. ప్రస్తుతమున్న బలంలో 80 నుంచి 85 స్థానాలు బీజేపీ కోల్పోవచ్చనేది ఒక పరిశీలన. అదే జరిగితే బీజేపీ బలం 200 లోక్ సభ స్థానాలకు కుదించుకుపోతుంది. మిగిలిన 70 సీట్ల కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండా బీజేపీని టీడీపీ, వైసీపీల్లో ఏదో ఒక పార్టీ సపోర్టు చేయకతప్పని అనివార్యత నెలకొంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకే ఈ వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ఈ విపక్ష స్థానం టీడీపీదా, వైసీపీ దా అన్నది ఓటరు తేలుస్తాడు. తాను అదికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రాజకీయ ఒత్తిడి కారణంగా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకహోదా ఇవ్వదు. అలా ఇవ్వాలనే ఆలోచనే ఉంటే తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోకుండా స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉండేది. వైసీపీని చేరువ చేసుకోకున్నా ఎన్నికల అనంతరం జట్టు కట్టక తప్పని అనివార్యత ఏర్పడవచ్చు. మరోసారి ప్రజలను మభ్యపుచ్చే కబుర్లతో టీడీపీ లేదా వైసీపీ సంతృప్తి పడక తప్పదు. రాజస్థాన్, బీహార్, ఒడిసా వంటి బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ రాష్ట్రాల్లోనూ ఈ డిమాండు ఉంది. వాటికి న్యాయం చేయకుండా ఏపీని చంకనెక్కించుకోవడం కమలం పార్టీకి సాధ్యం కాదు. అందువల్ల కమలం వికసిస్తే హోదా అనేది కలలోని మాటే.
హస్తం అధికారంలోకి వస్తే...
రాష్ట్ర విభజనకు ప్రాణం పోసిన కాంగ్రెసు పార్టీ కేంద్రంలో తాను అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ప్రకటించింది. రాహుల్ గాంధీయే స్వయంగా ఈ ప్రకటన చేయడం విశేషం. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్ల అన్న అర్థమూ ఈ ప్రకటనలోనే తేటతెల్లమవుతోంది. కేంద్రంలో అధికారం గురించే రాహుల్ ప్రకటించడంలోని ఆంతర్యమదే. బీజేపీ ప్రభుత్వం అటు ఇటు అయితే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం వస్తుందని కాంగ్రెసు ఆశిస్తోంది. అలాగే బీహార్ లోనూ ఆర్జేడీతో కలిసి అధికారం వచ్చేస్తుందని భావిస్తోంది. ఒడిసా పైన కూడా కాంగ్రెసుకు కొంత ఆశలున్నాయి. ఇవన్నీ ప్రత్యేక హోదాను డిమాండు చేస్తున్నాయి. వెనకబాటు తనం, నిరక్షరాస్యత, సరిహద్దు ప్రాంతాల వంటి పారామీటర్లు రీత్యా వాటికి ఆ అర్హత ఉంది. ఇలా తమ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలను పట్టించుకోకుండా అధికారానికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. అందువల్ల ఈ ప్రకటనను పొలిటికల్ స్టేట్మెంట్ గానే చూడాలి. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందనే సానుభూతి ఉన్నప్పటికీ రాహుల్ ఏమీ చేయలేని అసహాయస్థితికి గురవ్యవడం ఖాయమనే చెప్పాలి.
త్రిశంకు ఫ్రంట్ లో...
మూడో ఫ్రంట్ అధికారం అంటేనే త్రిశంకు స్వర్గమని చెప్పుకోవాలి. ప్రాంతీయ పార్టీల సమూహం. తక్కెడ మేళం . ఎప్పుడు ఎవరు దిగుతారో, ఏ పెద్ద పార్టీ(బీజేపీ, కాంగ్రెసు) వైపు జంప్ చేస్తారో తెలియని అనిశ్చితి. కలగూరగంప వ్యవహారంలో రోజువారీ పాలన వంటకమే కష్టం. ఇక విధానపరంగా ప్రత్యేక హోదా వంటి అంశాలను పట్టించుకోవడం పగటి కలే. అందులోనూ ఒడిసాలోని బిజూ జనతాదళ్, బీహార్ లోని ఆర్జెడీ వంటివి తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అడుతున్నాయి. అవి లేకుండా మూడో ఫ్రంట్ ముచ్చట తీరేది కాదు. మొత్తమ్మీద బీజేపీ, కాంగ్రెసు, మూడో ఫ్రంట్ ఏ పక్షము, కూటమి అధికారంలోకి వచ్చినా 2019 తర్వాత ఏపీ ఆశ అడియాస కాకతప్పదు. కాకపోతే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు కాసింత వినోదం పంచుతున్నాయంతే. 25 స్థానాలిస్తే హోదా వచ్చేస్తుందని, కేంద్రాన్ని శాసిస్తామనే మాటలు నీటిమూటలే. అన్ని పార్టీలు అసలు విషయం మరుగు పరిచి ప్రజల సెంటిమెంటుతో అధికారానికి బాటలు వేసుకోవాలని చూడటమే ఆంధ్రప్రదేశ్ దురదృష్టం.
- ఎడిటోరియల్ డెస్క్
- Tags
- amith shah
- bharathiya janatha party
- indian national congress
- nara chandrababu naidu
- narendra modi
- rahul gandhi
- special status
- telugudesam party
- third front
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అమిత్ షా
- తృతీయ ఫ్రంట్
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- ప్రత్యేక హోదా
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ