కాంగ్రెస్ లో కొత్త చిచ్చు
వరుసగా రెండుసార్లు ఓటమి పాలైనా తెలంగాణ కాంగ్రెస్ లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఓటమికి కారణాలను కూడా పూర్తిగా విశ్లేషించుకోని పార్టీలో ఇప్పుడు మరోసారి [more]
వరుసగా రెండుసార్లు ఓటమి పాలైనా తెలంగాణ కాంగ్రెస్ లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఓటమికి కారణాలను కూడా పూర్తిగా విశ్లేషించుకోని పార్టీలో ఇప్పుడు మరోసారి [more]
వరుసగా రెండుసార్లు ఓటమి పాలైనా తెలంగాణ కాంగ్రెస్ లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఓటమికి కారణాలను కూడా పూర్తిగా విశ్లేషించుకోని పార్టీలో ఇప్పుడు మరోసారి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితిని మార్చేశారు. తాజాగా సమీక్ష సమావేశంలో గొడవపడి సస్పెన్షన్ కి గురైన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనపై సస్పెన్షన్ చెల్లదని, తాను పార్టీలోనే ఉన్నానంటూ కాంగ్రెస్ కండువాను వదలనడం లేదు. ఇక, ఇదిలా ఉంచితే ఓటమి కారణాలను ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే ఓడిపోయామని మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ వంటి వారు అంటుంటే… అదమీ లేదని, ఓటమికి వేరే కారణాలున్నాయని ఇతర నేతలు అంటున్నారు. ఇక, తాజాగా సీఎల్పీ పదవి విషయంలోనూ గతంలో లాగానే మీడియా ముందుకు వచ్చేస్తున్నారు.
తమకే ఇవ్వాలంటున్న ఎమ్మెల్యేలు
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాల్లో నాయకుల మధ్య సమన్వయ లేమి, విభేదాలు, సీట్ల సర్ధుబాటు త్వరగా చేయలేకపోవడం వంటి అంశాలు కూడా ప్రధాన కారణం. టీఆర్ఎస్ ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. అయినా, కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. ఇప్పుడు సీఎల్పీ పదవి కేంద్రంగా పలువురు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. సీఎల్పీ నేతనే ప్రతిపక్ష నేతగా ఉంటారు కాబట్టి ఈ పదవిపై ఐదారుగురు ఎమ్మెల్యేలు కన్నేశారు. ఎవరికి వారే ఈ పదవి తమకు ఇవ్వాలని బాహాటంగానే కోరుతున్నారు. తనకు పదవి ఇవ్వాలని మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేయగా, తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అధిష్ఠానాన్ని ఈ మేరకు కోరినట్లు ప్రకటించారు.
సీఎల్పీ రేసులో ఆరుగురు…
సీఎల్పీ నేతను ఎంపక చేయడంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. గత అసెంబ్లీలో సీఎల్పీ నేతగా పనిచేసిన జానారెడ్డి ఓటమి పాలవ్వడంతో ఈసారి కొత్త వారికి అవకాశం దక్కనుంది. అయితే, ఈ పదవి కోసం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క రేసులో ముందున్నారు. అయితే, వీరికి పార్టీపరంగా కీలక పదవులు ఉన్నందున ఇతరులకు అవకాశం ఇవ్వాలనే వాదన మిగతా నేతలు వినిపిస్తున్నారు. మంత్రులుగా పనిచేసిన సబిత ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ మేరకు అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి కూడా ఈ పదవి ఇవ్వాలని అధిష్ఠానానికి వినవించారు. అయితే, అధిష్ఠానం ఇంకా ఎటూ తేల్చకముందు నేతలు మీడియా ముందుకువచ్చి తనకే పదవి, తనకే పదవి అంటూ చెప్పడం సరికాదని కాంగ్రెస్ క్యాడర్ అంటోంది. అధిష్ఠానం త్వరగా ఎవరినో ఒకరిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తే ఈ గందరగోళానికి, పోటీకి తెరపడనుంది.