మరో మాజీ కేంద్రమంత్రి సైతం ఫ్యాను కిందకే..!
రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ బలోపేతం కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామనే నినాదంతో భరోసా [more]
రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ బలోపేతం కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామనే నినాదంతో భరోసా [more]
రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ బలోపేతం కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామనే నినాదంతో భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లనుంది. అయితే, ఇంతవరకు తెలుగుదేశం పార్టీతో ఉంటుందని, ఆ పొత్తులో భాగంగా పోటీ చేసి గట్టేక్కి పునర్వైభవం దక్కించుకోవాలని పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు భావించారు. కానీ, పొత్తు ఉండదని తేలడం ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కొందరు టీడీపీలో మరికొందరు వైసీపీలో చేరి పోతున్నారు. అయితే, పార్లమెంటు బరిలో బలమైన అభ్యర్థుల కోసం చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేతలపై దృష్టి సారించింది. ఇప్పటికే మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి జగన్ ను కలిశారు. ఆమె శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, తాజాగా మరో మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కూడా వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇమేజ్ ఉన్న నాయకురాలు కావడంతో…
కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసి పనబాక లక్ష్మి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి మూడుసార్లు బాపట్ల నుంచి ఒకసారి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. గత ఎన్నికల్లోనూ ఆమె బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఆమె భర్త పనబాక కృష్ణయ్య నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడారు. 2009లో రెండో స్థానంలో నిలిచిన ఆయన గత ఎన్నికల్లో 10 వేల ఓట్లు సాధించారు. రైల్వేలో ఉన్నతోద్యోగం చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఈసారి చట్టసభల్లో అడుగుపెట్టి పూర్వవైభవం దక్కించుకావాలని అనుకుంటున్న పనబాక లక్ష్మి, కృష్ణయ్య.. వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతలు పనబాక దంపతులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. లండన్ పర్యటన నుంచి వైసీపీ అధినేత జగన్ తిరిగి రాగానే వీరు వైసీపీలో చేరనున్నారని సమాచారం.
అసెంబ్లీకా..? పార్లమెంటుకా..?
గత ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన బాపట్ల పార్లమెంటులో వైసీపీ తరపున అమృతపాణి పోటీ చేసి 30 వేల ఓట్లు తేడాతో ఓడిపోయారు. పనబాక లక్ష్మి పార్టీలో చేరితే ఈసారి ఆమెను పోటీ చేయించే అవకాశం ఉంది. ఆమె స్థానికురాలు కాకపోయినా గతంలో ఎంపీగా, కేంద్రమంత్రి పనిచేసిన అనుభవం ఉండటం, ఇమేజ్ ఉన్న నాయకురాలు కావడంతో ఆమెను నిలబెడితే గెలుపు సులువవుతుందని వైసీపీ భావిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ బాపట్ల పార్లమెంటు స్థానం కాకపోతే నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీ నియోజకవర్గమైన గూడూరులో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ విజయం సాధించినా ఆయన పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ కూడా బలమైన అభ్యర్థి కోసం వైసీపీ చూస్తోంది. పనబాక దంపతులు పార్టీలో చేరితే ఈ సీటు ఒకరికి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. పనబాక లక్ష్మికి బాపట్ల పార్లమెంటు, కృష్ణయ్యకు గూడూరు అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం కూడా ఉంది.