కాగల కార్యం క్యాంప్ ఆఫీస్…?
మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని , తొందరలోనే ఆ కల సాకారం కాబోతోందని వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గడచిన ఆరేడు నెలలుగా [more]
మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని , తొందరలోనే ఆ కల సాకారం కాబోతోందని వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గడచిన ఆరేడు నెలలుగా [more]
మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని , తొందరలోనే ఆ కల సాకారం కాబోతోందని వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గడచిన ఆరేడు నెలలుగా ఈ వ్యవహారం దాదాపు అటకెక్కేసినట్లే కనిపించింది. అమరావతి డెవలప్ మెంట్ అథారిటీపైన ముఖ్యమంత్రి సమీక్షలు సైతంనిర్వహించారు. పెండింగు పనులు పూర్తిచేయమని అధికారులకు ఆదేశించారు.దీంతో తరలింపును తాత్కాలికంగా పక్కనపెట్టారేమోననే ఆశలు రాజధాని ప్రాంత రైతుల్లో చిగురించాయి. వారు ఆందోళనలు చేపట్టి అయిదు వందల రోజులు దాటాయి. న్యాయస్థానాల్లో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు పై కేసులు నడుస్తున్నాయి.వాటన్నిటినీ పక్కనపెట్టి మరోసారి రాజధానుల తరలింపుపై వ్యాఖ్యలు చేయడం ఆసక్తిదాయకమే. కేవలం విజయసాయిరెడ్డిమాత్రమే ప్రకటన చేసి ఊరుకోలేదు. ఆయనకు మద్దతుగా ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం విశాఖ కార్యనిర్వాహక రాజధాని విషయంలో చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల అంశం హైకోర్టు పరిధిలో ఉండగా నాయకులు ఏవిధంగా ప్రకటన చేస్తారనేది ఒక ప్రశ్న. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చు కాబట్టి ఆయన విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి పాలన సాగించవచ్చనేది వైసీపీ వాదన.
మొదటికే మోసం..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల్లోనే మూడు రాజధానుల తేనెతుట్టను కదిలించారు. ఈ విషయంలో వైసీపీ చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లుగానే చెప్పాలి. అమరావతి నుంచి సచివాలయం తరలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనని తొలుత సందేహించారు. అయితే కేవలం 29 గ్రామాల ప్రజలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని సెంటిమెంటు లేదని ప్రభుత్వం ముందుగా ఒక అంచనాకు వచ్చింది. అందుకే మూడు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిచే విధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలోని అమరావతికి రాజధానిని విభజిస్తున్నట్లుగా ప్రకటించింది. హైకోర్టులో కేసుల సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రజల్లో తటస్థ భావమే వ్యక్తమైంది. వ్యతిరేకత రాలేదు. అలాగని వైసీపీ ఆశించిన స్తాయిలో మద్దతు కూడా రాలేదు. ఈ వ్యవహారం తమకు సంబంధించినది కాదన్నట్లుగా ప్రజలు మౌనంగా ఉండిపోయారు. ఇటువంటి స్థితిలో మూడు రాజధానులపై వెనక్కి వెళితే ఎంతోకొంత రాజకీయంగా నష్టం జరుగుతుందనేది వైసీపీ నాయకత్వం ఆలోచన. అందుకే అప్పుడప్పుడు తమ వైఖరిని పునరుద్ఘాటిస్తుంటారు. కరోనా సమయంలోనూ ఇదే విషయాన్ని మరోమారు చెప్పడంలోని ఆంతర్యమదే. న్యాయస్థానం నిరోధిస్తే తప్ప ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి వెళ్లే అవకాశం లేదు. తగ్గినట్లు కనిపిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కర్నూలు కు న్యాయ రాజధాని తరలింపు మాత్రం హైకోర్టు నిర్ణయంతో ముడి పడి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో తొలి అడుగులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఏర్పాట్లు పక్కా..
విశాఖ పట్నంలో కార్యినిర్వాహక రాజధానికి అవసరమైన ఏర్పాట్లు పక్కాగానే సాగుతున్నాయి. అయితే మొత్తం సచివాలయాన్ని , శాఖాధిపతుల కార్యాలయాలను ఏకమొత్తంగా తరలించకుండా క్రమ క్రమంగా వాటిని తీసుకెళ్లవచ్చనేది అధికారుల అంచనా. ప్రత్యేక కారణాలు చూపిస్తూ శాఖాధిపతులను అక్కడికి తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిషరీస్, టూరిజం, ఇండస్ట్రీస్, మైనింగ్ వంటి కార్యాలయాలను తొలిదశలో ఏర్పాటు చేయవచ్చని చెబుతున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో ప్రభుత్వం దాదాపు అక్కడి నుంచే పని చేస్తుంది. నామమాత్రంగానే అమరావతి మిగిలిపోతుంది. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పనిచేయాలనేది న్యాయస్థానాలు నిర్దేశించలేవు. అందువల్ల దానిని అవకాశంగా తీసుకుంటూ క్యాంపు కార్యాలయమే ముఖ్యమంత్రి ప్రధాన కార్యాలయంగా రూపుదాల్చే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే అన్ని పనులు చక్కబెడుతున్నారు. సమీక్సలు నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్ కు సీఎం వెళ్లడమనే విధానానికి ఆయన ఎప్పుడో స్వస్తి పలికేశారు. అదే మోడల్ ను జగన్ సైతం విశాఖలో అనుసరించవచ్చు. అందుకు అవసరమైన ఏర్పాట్లు సాగుతున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కోర్టు దిక్కారమైతే…?
కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై వ్యాఖ్యానాలు చేసినా, న్యాయస్థానం తీర్పును ప్రభావితం చేసే విధంగా మాట్టాడినా కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. ప్రజల దృష్టిలో న్యాయస్థానాల ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా కూడా మాట్టాడకూడదు. కానీ విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజదానుల అంశం న్యాయస్తానాలకు సంబంధం లేదన్నట్లుగా ఉన్నాయి.
దీనిపై ఎవరైనా విజయసాయిరెడ్డి, బొత్సలపై కేసులు వేసే అవకాశమూ ఉంది. సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లు న్యాయబద్దతను రాజ్యాంగ పరంగా హైకోర్టు పరిశీలిస్తోంది. తీర్పు వచ్చే వరకూ సాంకేతికంగా, చట్టపరంగా తరలింపు సాధ్యం కాదు. కానీ ముఖ్యమంత్రి కార్యక్షేత్రాన్ని మార్చుకోవడం ద్వారా పరోక్షంగా పాలన రాజధానిగా విశాఖకు గుర్తింపు తీసుకు రావచ్చు. దీనిని కోర్టు అడ్డుకోజాలదు. అదే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు స్పష్టమైన సంకేతాలు పంపాలని వైసీపీ భావిస్తోంది. కరోనా ఉద్ధ్రుతి సద్దుమణిగిన తర్వాత మొదటి ప్రాధాన్యంగా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
– ఎడిటోరియల్ డెస్క్