అసద్ కోసం క్యూ కడుతున్న బెంగాలీలు
అసదుద్దీన్ ఒవైసీ… ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా అసదుద్దీన్ ఒవైసీ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం [more]
అసదుద్దీన్ ఒవైసీ… ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా అసదుద్దీన్ ఒవైసీ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం [more]
అసదుద్దీన్ ఒవైసీ… ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా అసదుద్దీన్ ఒవైసీ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి ఐదు స్థానాలను గెలుచుకోవడంతో ఒవైసీ ఇప్పుడు అందరినోట నానుతున్నారు. అంతేకాదు విపక్ష పార్టీల్లో అసదుద్దీన్ ఒవైసీ దడ లేపుతున్నారు. బీజేపీకి ఒవైసీ ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని విపక్ష పార్టీలన్నీ ధ్వజమెత్తుతున్నాయి.
కీలకంగా మారి…..
ఇప్పడు పశ్చిమ బెంగాల్ లోనూ అసుదుద్దీన్ ఒవైసీ కీలకంగా మారారు. బీహార్ ఎన్నికలలో ఐదు స్థానాలను సాధించిన ఎంఐఎం పశ్చిమ బెంగాల్ లోనూ పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు. దీంతో ఒవైసీ దెబ్బ ఈసారి ఎవరికి పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ హోరాహోరీ పోరాడుతున్నాయి.
వారు టీఎంసీ వైపు…..
పశ్చిమ బెంగాల్ లో ముస్లిం సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారు సుదీర్ఘకాలం సీపీఎం, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. తర్వాత ముస్లిం ఓటు బ్యాంకులో అధిక భాగం తృణమూల్ కాంగ్రెస్ వైపునకు మళ్లింది. మమత బెనర్జీ కూడా ఇప్పటి వరకూ ఆ సామాజికవర్గం తమ వెంటనే ఉంటుందన్న హోప్స్ తో ఉన్నారు. కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ పోటీకి దిగుతామని ప్రకటించడం మమతను ఆందోళనకు గురిచేస్తుంది.
ఒవైసీని కలసి మరీ….
అలాగే పశ్చిమ బెంగాల్ లో ముస్లిం సామాజికవర్గానికి సరైన నేత లేరు. అక్కడి వారు కూడా అసదుద్దీన్ ఒవైసీని కోరుకుంటున్నారు. కొందరు ఇటీవల హైదరాబాద్ వచ్చి మరీ అసదుద్దీన్ ఒవైసీని కలసి పశ్చిమ బెంగాల్ లో ఎంఐఎంను విస్తరించాలని కోరారట. తమకు నాయకత్వం వహించాలని కోరారట. దీంతో అసదుద్దీన్ ఒవైసీ త్వరలోనే పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల తర్వాత అసదుద్దీన్ పశ్చిమ బెంగాల్ పర్యటన ఉంటుందంటున్నారు. మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఒవైసీ కొన్ని పార్టీలకు ఇబ్బంది కరంగా మారారు. మరి పశ్చిమ బెంగాల్ లో ఏం జరగనుందో చూడాలి.