అయ్యన్న చెప్పినట్లే జరుగుతుందా?
పాత మిత్రులతో కొత్త సంబంధాల దిశగా టీడీపీ చేరువ అవుతోందనే వ్యాఖ్యలకు మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకుడు, నర్సీ పట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న [more]
పాత మిత్రులతో కొత్త సంబంధాల దిశగా టీడీపీ చేరువ అవుతోందనే వ్యాఖ్యలకు మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకుడు, నర్సీ పట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న [more]
పాత మిత్రులతో కొత్త సంబంధాల దిశగా టీడీపీ చేరువ అవుతోందనే వ్యాఖ్యలకు మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకుడు, నర్సీ పట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు బలం చేకూర్చారు. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయిందని తన యాసలో చెప్పుకొచ్చిన అయ్యన్న.. తాజాగా వచ్చే 2024 నాటి ఎన్నికల విషయంపై జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు మనసులో మాట ఇదే అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం జగన్ పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇదే కొనసాగితే.. 2024 నాటికి జగన్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన చెప్పారు.
జగన్ ను ఒంటరిచేసి…..
అంతేకాదు… టీడీపీ ఎప్పటికీ ఒంటరిగా పోరు చేయలేదని, ఈ విషయాన్ని తాను ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబుకు చెప్పానని అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికలకు వెళ్తే మంచిదని తాను సూచించానని అన్నారు. నిజానికి ఈ తరహా ఆలోచన చంద్రబాబు ఇప్పటికే చేశారని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో టీడీపీ స్క్రిప్టును బీజేపీ, బీజేపీ పంథాను పవన్ అనుసరిస్తున్న పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ను ఒంటరిని చేయడం, ఈ మూడు పార్టీలూ కలిసి పోవడం అనే సూత్రాన్ని ఇప్పటికే చంద్రబాబు అనుసరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
రాజధాని విషయంలో….
అంతెందుకు టీడీపీ నుంచి ఎన్నికల తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ వలసలను కూడా చంద్రబాబే తెరవెనక ఉండి ప్రోత్సహిస్తున్నారన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక వైసీపీని బీజేపీ, జనసేన టార్గెట్ చేస్తోన్న తీరుపై కూడా వైసీపీ వాళ్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాజధానిలో పర్యటించిన బీజేపీ నేతలు కానీ, పవన్ మిత్ర బృందం కానీ.. జగన్ను టార్గెట్ చేసిన తీరును వారు ప్రస్తావిస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నదేనని, కేవలం ఓ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను పట్టుకుని వీరంతా పొలోమని అమరావతిలో పర్యటించడం వెనుక..ఏమీలేని విషయాన్ని ఏదో ఉందని చెప్పడం కోసమేనని అనేక మంది విశ్లేషణలు చేశారు.
ఒకే తాను ముక్కలా…?
కేవలం రెండు మాసాల కిందటే ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుని ఇప్పుడు.. కలిసి పోతే… అనుమానం వస్తుందనే ధోరణితోనే ఎవరికి వారుగా జగన్ను టార్గెట్ చేస్తున్నా.. మరికొద్ది రోజుల్లోనే వీరంతా ఒకే తానులోని ముక్కలనే విషయం స్పష్టతకు వస్తుందని అంటున్నారు. తాజాగా అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు దీనిని బలపరుస్తుండడం గమనార్హం. ఎన్నికలకు ముందు వరకు టీడీపీపై తీవ్రంగా విరుచుకుపడిన బీజేపీ వాళ్లు ఇప్పుడు ఆ పార్టీని పన్నెత్తు మాట అనడం లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరనే విషయం తెలిసిందేనని సరిపెట్టుకోవడం మినహా చేయగలిగింది ఏమీలేదనే ప్రస్తుత ఏపీ రాజకీయాన్ని చూసి అనుకోవాల్సిందే.