కొత్త జిల్లాలపై అయ్యన్న మడత పేచీ ?
ఏపీలో కొత్త జిల్లాలపైన వైసీపీ సర్కార్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలు ఏర్పాటు చేస్తామని మాత్రమే మంత్రులు ఇప్పటిదాకా చెబుతున్నారు. సూత్రప్రాయంగా పాతిక ఎంపీ సీట్లనే [more]
ఏపీలో కొత్త జిల్లాలపైన వైసీపీ సర్కార్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలు ఏర్పాటు చేస్తామని మాత్రమే మంత్రులు ఇప్పటిదాకా చెబుతున్నారు. సూత్రప్రాయంగా పాతిక ఎంపీ సీట్లనే [more]
ఏపీలో కొత్త జిల్లాలపైన వైసీపీ సర్కార్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలు ఏర్పాటు చేస్తామని మాత్రమే మంత్రులు ఇప్పటిదాకా చెబుతున్నారు. సూత్రప్రాయంగా పాతిక ఎంపీ సీట్లనే కొత్త జిల్లాలు అని అంటున్నారు. నిజానికి సరైన విభజన చేయాల్సివస్తే అవి ఏ మాత్రం ప్రాతిపదిక కానే కాదు. ఎందుకంటే విశాఖ జిల్లా అరకు ఎంపీ సీటుని తీసుకుంటే అది అయిదారు జిల్లాల పరిధిలో ఉంది. అందువల్ల జిల్లాల పునర్విభజన కత్తి మీద సాము లాంటి వ్యవహారమే అవుతుంది. దానికి తోడు రాజకీయ పరమైన వ్యవహారాలు కూడా చాలా ఉంటాయి. సామాజిక సమీకరణలు కూడా బేరీజు వేసుకోవాలి. ఇక ప్రభుత్వ భవనాలు, స్థలాలు, లాభ నష్టాలు, ఆర్ధిక వనరులు ఇలా ఎన్నో అంశాలు కూలంకషంగా పరిగణించిన మీదటనే కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని అంటున్నారు. దీని మీద ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రస్తుతానికి కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఏవీ లేవని అన్నారు.
కన్నబాబు ప్రకటనతోనే :
విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు ఈ మధ్య జిల్లాలలో పర్యటిస్తూ అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నిజానికి అనకాపల్లిని రూరల్ జిల్లా అని అనధికారికంగా పిలుస్తారు. జిల్లా పార్టీ ఆఫీసులన్నీ అక్కడే ఏర్పాటు చేసుకుంటారు. ఓ విధంగా రాజకీయ కేంద్రంగా కూడా అనకాపల్లిని అంతా భావిస్తారు. ఇక్కడ నుంచి యోధానుయోధులు ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రముఖ నాయకుల మీటింగులు అన్నీ కూడా అనకాపల్లి కేంద్రంగానే ఏర్పాటు చేస్తారు. అందువల్ల జిల్లా అంటూ ఏర్పడితే అనకాపల్లి అని అంతా అనుకుంటారు. ఆ మాటనే కన్నబాబు కూడా అనేశారు. అయితే ఇక్కడే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గట్టిగా విభేదిస్తున్నారు. అనకాపల్లిని జిల్లా కేంద్రంగా చేయడమేంటని ఆయన గట్టిగా వాదిస్తున్నారు.
నర్శీపట్నం కావాలట :
నర్శీపట్నాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ అయ్యన్నపాత్రుడు మడతపేచీ పెడుతున్నారు. దానికి కారణాలు కూడా ఆయన వివరిస్తున్నారు. అనకాపల్లి ఇప్పటికే జీవీఎంసీలో భాగంగా ఉందని, పైగా అక్కడ ప్రభుత్వ ఆఫీసులు ఏవీ లేవని, ప్రభుత్వ స్థలాలు కూడా లేవని ఆయన అంటున్నారు. అదే నర్శీపట్నంలో పెడితే అర్డీవో ఆఫీస్ ఇప్పటికే ఉందని, అనేక ఖాళీ స్థలాలతో పాటు ప్రభుత్వ కార్యలాయాలు ఉన్నాయి చెబుతున్నారు. పైగా జిల్లా కేంద్రంగా నర్శీపట్నం అన్నింటికీ కేంద్ర బిందువుగా ఉంటుందని, ఇటు రూరల్ జిల్లాకు, అటు ఏజెన్సీకి కూడా అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా జిల్లాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా టీడీపీ నేతలు దాన్ని రచ్చ చేసేలా కనిపిస్తున్నారు.
చిక్కులు తప్పవా :
తెలంగాణా అనుభవం చూసుకుని ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని మేధావులు జగన్ సర్కార్ కి సూచిస్తున్నారు. తెలంగాణాలో విభజనకు ముందు 10 జిల్లాలు ఉంటే వాటిని 32 జిల్లాలు చేశారు. అయితే చాలా వాటిలో విభజన శాస్త్రీయంగా లేదని అంటున్నారు. దాని వల్ల కొన్ని జిల్లా కేంద్రాలు చూస్తే మండల కేంద్రాలుగా కనిపిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ జిల్లా రూపూ లేని కొత్త జిల్లాలు అక్కడ చాలా ఉన్నాయి. కేవలం రాజకీయ కారణాలతో విడగొట్టారన్న ప్రచారం ఉంది. అలాంటివి అధ్యయనం చేయడం ద్వారా జగన్ సర్కార్ ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అన్నింటిలో సమానాభివ్రుధ్ధి ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు.