జగన్ పాత్ర వేస్తానంటున్న బండారు ?
ఆయన టీడీపీలో సీనియర్ నేత. మాజీ మంత్రి. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిలిచిన విశాఖ జిల్లా నాయకుడు. ఆయన ఎన్టీయార్ హయాం నుంచి రాజకీయాలు చేస్తూ చంద్రబాబుకు [more]
ఆయన టీడీపీలో సీనియర్ నేత. మాజీ మంత్రి. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిలిచిన విశాఖ జిల్లా నాయకుడు. ఆయన ఎన్టీయార్ హయాం నుంచి రాజకీయాలు చేస్తూ చంద్రబాబుకు [more]
ఆయన టీడీపీలో సీనియర్ నేత. మాజీ మంత్రి. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిలిచిన విశాఖ జిల్లా నాయకుడు. ఆయన ఎన్టీయార్ హయాం నుంచి రాజకీయాలు చేస్తూ చంద్రబాబుకు వీర విధేయుడిగా ఉన్నాడు. ఆయనే బండారు సత్యనారాయణ మూర్తి. ఆయన ఉంటున్న పార్టీని సినిమా నటుడు అన్న గారు పెట్టారు. చంద్రబాబు నేతృత్వంలో పార్టీ నడుస్తోంది. ఉంటే గింటే ఈ ఇద్దరి మీద బండారు కి గట్టి అభిమానం ఉండాలి. అది లేదనేలేం కానీ ఆయన ఎందుకో జగన్ మీద ప్రేమను పెంచుకున్నట్లుగా ఉంది. తనకు సినిమాల్లో చాన్స్ వస్తే జగన్ పాత్ర తప్పక చేస్తాను అంటున్నారు, బండారు సత్యనారాయణ మూర్తి బాగానే ముచ్చట పడుతున్నారు.
జగన్ మీద సినిమా ….
రియల్ స్టోరీలను రీల్స్ మీద నడిపించే టాలీవుడ్ దర్శకుడు రాం గోపాల్ వర్మ జగన్ మీద సినిమా తీయాలని బండారు సత్యనారాయణ మూర్తి కోరుతున్నారు. ఆయన కనుక జగన్ మీద తీసే మూవీని డైరెక్ట్ చేస్తే అందులో జగన్ పాత్ర తానే వేస్తాను అంటున్నాడీ మాజీ మంత్రి. వినడానికి చిత్రంగా ఉన్నా ఆయన ఇదే చెబుతున్నారు. జగన్ ఏడాదిన్నర పాలనలో అవినీతి ఏరులై పారుతోందిట. అందువల్ల దాన్ని కధాంశంగా పెట్టి రియాలిస్టిక్ గా ఆర్జీవీ సినిమా తీస్తే తాను నటిస్తాను అంటున్నాడు. తనకు నాటకానుభవం ఉందని, మంచి నటుడిని అని కూడా సొంత సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు బండారు.
బాబు ఒప్పుకుంటాడా..?
జగన్ అంటే కలలో కూడా శత్రువుగా చూస్తే చంద్రబాబు బండారు సత్యనారాయణ మూర్తి ప్రతిపాదనకు ఏమంటారో ముందు చూసుకోవాలేమో. ఎందుకంటే జగన్ పాత్ర వేస్తాను అంటున్నారు మరి. జగన్ ని విలన్ గా చూపినా మరేమి చేసినా అది కరడు కట్టిన టీడీపీ తమ్ముడు బండారు వంటి వారు చేయడాన్ని బాబు అసలు అంగీకరిస్తారా అన్నదే ఇక్కడ పాయింట్. వేస్తే గీస్తే చంద్రబాబు విజయాల మీద ఆయన హైటెక్ పాలన మీద కధను ఎంచుకుని బాబు పాత్రలో బండారు సత్యనారాయణ మూర్తి కనిపిస్తే ఏమైనా అంగీకరిస్తారేమో కానీ ఇలా జగన్ ని తనలో పలికిస్తూ వెండితెరను వెలిగిస్తాను అని బండారు అంటే అది తిరిగి ఆయనకే బూమరాంగ్ అవుతుందని తమ్ముళ్ళు అంటున్నారుట.
హైలెట్ అవుదామనే…?
ఇప్పటికే విశాఖ రాజకీయాల్లో బాగా వెనకబడిన బండారు సత్యనారాయణ మూర్తి ఇపుడు ఒక్కసారిగా మీడియా బేబీగా మారిపోయారు. తరచూ మీడియా ముందుకు వచ్చి జగన్ పాలన మీద విమర్శలు చేస్తున్నారు. వాటిలో పస ఎంత ఉందో ఏమో తెలియదు కానీ తమ అధినేత చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయడానికే బండారు సత్యనారాయణ మూర్తి ఇలా చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక బండారు జగన్ పాలనలో అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అని సవాల్ చేస్తున్నారు. ఇదంతా బాగుంది కానీ ఇప్పటికే జనాలు రాజకీయాల నుంచి ఇంటికి పంపించేసారుగా ఎందుకీ రాజకీయ సన్యాసం సవాళ్ళు అని అని వైసీపీ నేతలు గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు.