అలా కలిసొస్తుందంతే….ఎవరేమీ చేయలేరు
తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల బలహీనత భారతీయ జనతాపార్టీకి పక్కాగా వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్రంలో బలహీనపడిన విషయం రాజకీయ వర్గాలకే కాదు, ప్రజలకూ తెలిసిపోయింది. ఇంతవరకూ [more]
తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల బలహీనత భారతీయ జనతాపార్టీకి పక్కాగా వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్రంలో బలహీనపడిన విషయం రాజకీయ వర్గాలకే కాదు, ప్రజలకూ తెలిసిపోయింది. ఇంతవరకూ [more]
తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల బలహీనత భారతీయ జనతాపార్టీకి పక్కాగా వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్రంలో బలహీనపడిన విషయం రాజకీయ వర్గాలకే కాదు, ప్రజలకూ తెలిసిపోయింది. ఇంతవరకూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెసు పోరాట తత్వాన్ని కోల్పోయిన అంశమూ తేటతెల్లమైపోయింది. పీసీసీ పీఠానికి కొత్త అధ్యక్షుని ఎంపిక కాంగ్రెసు పార్టీకి విషమ పరీక్షగా మారింది. దీనికోసం కాంగ్రెసు పార్టీ నేతలు మాత్రమే కాదు , బీజేపీ నాయకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీసీసీకి ఎవరిని ఎంపిక చేసినా బీజేపీలోకి వలసలు ఖాయమని కమలనాథులు విశ్వసిస్తున్నారు. అందుకు అనేక రకాల సమీకరణలను ప్రాతిపదికగా చూపిస్తున్నారు. కాంగ్రెసులో ఎందరో కాకలు తీరిన నాయకులున్నారు. కొత్త వ్యక్తి అయిన రేవంత్ రెడ్డికి పీఠం అప్పగిస్తే ఇప్పటికే రగులుతున్న బీసీ నాయకులకు ఒక సాకు దొరుకుతుంది. బీజేపీలోకి క్యూ కట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవేళ పాతకాపులకే పట్టం గడితే రేవంత్ రెడ్డిని సమర్థించే బలమైన యువ నాయకత్వం బీజేపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతోంది. ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది పరిస్థితి.
మతానికి తోడు..
హస్తం పార్టీకి పోరాట తత్వం అలవడాలంటే రేవంత్ ను ఎంపిక చేయాలనే భావన బలంగా వ్యక్తమవుతోంది. రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెసుకు వెన్నుదన్నుగా ఉంటోంది. అందువల్ల ఒకవైపు ఆ సామాజిక వర్గానికి మరోవైపు నూతన నాయకత్వానికి న్యాయం చేసినట్లవుతుందనేది అధిష్ఠానం భావన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి బలంగా పనిచేసిన వర్గం కాంగ్రెసులో బీసీ నాయకత్వం. ఇప్పటికే అధిష్ఠానం వీరిపై కినుక వహించింది. రాష్ట్రంలో అధికారానికి తేవడంలో కాంగ్రెసు నేతలు ఫెయిల్ అయ్యారనే ఆగ్రహం అగ్రనాయకత్వంలో నెలకొని ఉంది. అదే సమయంలో పార్టీ దాదాపు అధికారానికి రావడం అసాధ్యమనే అంచనాకు స్థానిక నాయకులు కూడా వచ్చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెదుకుతున్నారు. ఈ స్థితిలోనే బీసీ నాయకత్వానికి తెలంగాణలోబీజేపీ ప్రాధాన్యం పెంచింది. సహజంగానే బీసీలు సంఖ్యాపరంగా తెలంగాణలో ప్రాధాన్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిన తర్వాత ఆయా వర్గాలు తమ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాయి. బీజేపీ ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అది కొంతమేరకు ఫలిస్తోంది. ఈ స్థితిలో కాంగ్రెసులో ఉన్న బీసీ నాయకులు కూడా కమలం పార్టీని ఆశ్రయిస్తే బలమైన పునాదులు ఏర్పడుతాయి. పీసీసీ పీఠం పై కాంగ్రెసు తీసుకునే నిర్ణయం ఇందుకు ఒక ప్రాతిపదికగా నిలుస్తుంది.
కాంగ్రెసుకు కలిసి రాని..
తెలంగాణలో కాంగ్రెసుకు పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదు. జాతీయ స్థాయిలో పార్టీ అధికారంలో లేదు. ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలోనూ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. పరోక్షంగా గతంలో సహకరించిన ఎంఐఎం ప్రత్యర్థిగా మారిపోయింది. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా మారిపోయింది. దీంతో బీజేపీ కి ఒక అజెండా దొరికింది. ఎంఐఎం మైనారిటీ రాజకీయాలను , టీఆర్ఎస్ కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకించే వర్గాలకు బీజేపీ దిక్సూచిగా కనిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెసుల అగ్రవర్ణ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా బీసీ నాయకత్వమూ బీజేపీ వైపు ఆకర్షితమవుతోంది. మత పరంగా మెజారిటీ హిందూ భావనలను సంఘటితం చేసుకోవడం, గడీల పాలన, అగ్రవర్ణ పెత్తనానికి వ్యతిరేకంగా వెనకబడిన తరగతులను కులపరంగా చేరదీయడం బీజేపీ అప్రకటిత ప్రణాళికగా మారింది. దీనిని దీటుగా ఎదుర్కొనే వ్యూహం కాంగ్రెసులో కనిపించడం లేదు. అందువల్ల క్రమేపీ తన ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యతను తెలంగాణలో కోల్పోతోంది. గతంలో టీడీపీకి అండగా ఉన్న వర్గాలు మెజార్టీ భాగం బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితి కానవస్తోంది.
టీఆర్ఎస్ రాజీ..
అధికార తెలంగాణ రాష్ట్రసమితి బీజేపీతో దాదాపు రాజీ పడిపోయినట్లే. ఎన్నికల సమయంలో ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఆచరణలో బీజేపీని ప్రతిఘటించడం లేదు. ఆ పార్టీ ప్రాబల్యాన్ని నిరోధించలేని నిస్సహాయత టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపుతామంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం సవాల్ విసురుతోంది. అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు సవాల్ చేయలేకపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీ అగ్రనాయకులను కలవడం టీఆర్ఎస్ బలహీనతను చాటి చెప్పింది. కమల నాథుల ముందు సాగిలపడిపోతున్నారనే ప్రచారానికి ఊతమిచ్చింది. కేసీఆర్ అజెండా ఏమైనప్పటికీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. కాంగ్రెసు వెన్ను వంచి పూర్తిగా బలహీనపరిచిన టీఆర్ఎస్ సర్కారు బీజేపీ విషయంలో సాహసించలేకపోతోంది. ప్రచారం , దూకుడు విషయంలో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీదే పై చేయి. కాంగ్రెసు , బీజేపీల్లో ఎవరు ప్రత్యర్థి అయినా ఫర్వాలేదు. తన సీటు కిందకు పొగ రాకుండా ఉంటే చాలనే భావనతో టీఆర్ఎస్ రాజీ పడిపోతోంది. పార్టీ పరంగా టీఆర్ఎస్ కు ఉన్న ఇబ్బందులు ఏమిటనేది బహిరంగం కాకపోయినా, బీజేపీని ఆశ్రయిస్తే అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కోవచ్చుననే భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇది కమలం పార్టీకి బాగా కలిసివస్తోంది. జాతీయ నాయకులు సంయమనం పాటించినప్పటికీ రాష్ట్ర బీజేపీ నాయకులు చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ దూకుడునే తెలంగాణ ప్రజలు ఇష్టపడుతున్నారు. కాంగ్రెసు సహా ఇతర పార్టీల్లో ఈ చొరవ కరవైంది.
-ఎడిటోరియల్ డెస్క్