తిరుపతిపై బీజేపీ స్కెచ్ ఇదేనట…తెర వెనక సాయం?
ఏపీలో త్వరలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరగనుంది. మార్చిలో జరిగే ఈ ఎన్నికకు వచ్చే నెలలో నోటిఫికేషన్ రావచ్చు. కానీ రెండు నెలల ముందు [more]
ఏపీలో త్వరలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరగనుంది. మార్చిలో జరిగే ఈ ఎన్నికకు వచ్చే నెలలో నోటిఫికేషన్ రావచ్చు. కానీ రెండు నెలల ముందు [more]
ఏపీలో త్వరలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరగనుంది. మార్చిలో జరిగే ఈ ఎన్నికకు వచ్చే నెలలో నోటిఫికేషన్ రావచ్చు. కానీ రెండు నెలల ముందు నుంచి బీజేపీ పడుతున్న హైరానా మాత్రం అంతా ఇంతా కాదు. కేవలం 16 వేల ఓట్లు మాత్రమే 2019 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ వచ్చాయి. ఇక నోటాకు పాతిక వేల పై చిలుకు దక్కాయి. డిపాజిట్ కూడా గల్లంతు అయింది. అటువంటి బీజేపీ ఇపుడు బస్తీ మే సవాల్ అంటూండమే విశేషం. కానీ బీజేపీని తక్కువ అంచనా వేయడం కూడా తగదు అని మరో వైపు చర్చ నడుస్తోంది.
బండి లాగిస్తారా…?
బీజేపీకి ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలో జోరుగా బండి తోలే సంజయుడు దొరికాడు. ఆయన దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీయారెస్ ని దెబ్బ తినిపించాక ఢిల్లీ పెద్దలకు బాగా నమ్మకం కుదిరిందిట. అందువల్ల సంజయ్ కి తిరుపతి ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించారట. ఇక సంజయ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చిందే తడవుగా వైసీపీ మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. బైబిల్ పార్టీ కావాలా. భగవద్గీత పార్టీ కావాలా అంటూ సంజయ్ ఇచ్చిన ప్రకటన ఇపుడు వైసీపీ నేతలను మండించేలాగానే ఉంది. అంటే బీజేపీ తిరుపతి ఎన్నికల స్ట్రాటజీ ఏంటో సంజయ్ గుట్టు విప్పేశారే అనుకోవాలి.
పవన్ సాయంతో …?
మరో వైపు తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో కాపుల ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించడం ద్వారా ఆ వర్గం ఓట్లను గుత్తమొత్తంగా కొల్లగొట్టాలని బీజేపీ పక్కా ప్లాన్ తో ఉంది. అంతే కాదు వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలకు కూడా గేలం వేస్తోంది. అదే సమయంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి లాంటి వారి సాయం కూడా లోపాయికారిగా తీసుకోవాలని భావిస్తోందిట. ఇక గూడూరు, సత్యవేడు వంటి చోట్ల స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతను కూడా సొమ్ము చేసుకోవడానికి బీజేపీ పక్కా ప్లన్ రెడీ చేసి పెట్టుకుంది. అంతే కాదు టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలను బీజేపీలోకి తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉందిట.
మసాలా దట్టించారా…?
ఇక తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ ఎన్నికలు అంటే సహజంగానే మతాలను ముందుకు తీసుకువస్తారు. ఇపుడు ఏపీలో విగ్రహాల విద్వంసం మీద ఒక రేంజిలో బీజేపీ మండిపడుతోంది. వైసీపీ సర్కార్ మీద పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. ఆ విధంగా రాజకీయ మసాలాను బాగానే కలుపుతోంది. రేపటి రోజున జగన్ సర్కార్ హిందూ వ్యతిరేకి అని గట్టిగా చాటడం ద్వారా తిరుపతిలో గణనీయమైన లబ్ది పొందాలని చూస్తోంది. మొత్తానికి ఏతా వాతా తేలేది ఏంటి అంటే తిరుపతిలో బీజేపీయే వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా ముందుకు రాబోతోందిట. దానికి తెర వెనక సాయం ఎవరు చేసినా ఆశ్చర్యం లేదు. ఆ విధంగా స్కెచ్ గీసుకుని మరీ బీజేపీ రంగం లోకి దిగుతోంది. కమలం పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన 2019 ఎన్నికలతో పోల్చి లైట్ తీసుకుంటే మాత్రం వైసీపీ కొంప మునిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. సో జగన్ వైసీపీ మేలుకోవాల్సిందే మరి.