ఇక గేమ్ ఛేంజ్ కాబోతుందా?
అధికార టీఆర్ఎస్ ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా? అన్నది కాదు ప్రశ్న. తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెసును తోసిపుచ్చి టీఆర్ఎస్ కు తానే ప్రత్యామ్నాయమంటూ ద్వితీయ స్థానం దక్కించుకుంది కమలం [more]
అధికార టీఆర్ఎస్ ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా? అన్నది కాదు ప్రశ్న. తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెసును తోసిపుచ్చి టీఆర్ఎస్ కు తానే ప్రత్యామ్నాయమంటూ ద్వితీయ స్థానం దక్కించుకుంది కమలం [more]
అధికార టీఆర్ఎస్ ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా? అన్నది కాదు ప్రశ్న. తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెసును తోసిపుచ్చి టీఆర్ఎస్ కు తానే ప్రత్యామ్నాయమంటూ ద్వితీయ స్థానం దక్కించుకుంది కమలం పార్టీ. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా హైదరాబాద్ లో తన ప్లేస్ కు ఢోకా లేదనుకున్న ఎంఐఎం ను మూడో స్థానానికి నెట్టేసింది. సీట్లు తగ్గకపోయినా ప్రాధాన్యతక్రమంలో పాతబస్తీ పార్టీని పరోక్షంగా పల్టీ కొట్టించింది. మొత్తమ్మీద ఆయా పార్టీల గెలుపోటములు అందించే సంకేతాలు, సందేశాలు భవిష్యత్ తెలంగాణ రాజకీయాలను శాసించబోతున్నాయి. తెలంగాణకు ఆర్థికంగా, హార్దికంగా జీవనాడి హైదరాబాద్. మూడో వంతు ప్రజలకు ఆవాసం. ఇక్కడి తీర్పు కచ్చితంగా మార్పులకు సూచికగా నిలుస్తుంది. దీని ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా పడేందుకు ఆస్కారం ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో వచ్చిన పోరాట పంథా, ఓటరు ధిక్కారం రెండూ కలగలిసి అంగ, అర్థ రాజకీయ బలాన్ని కలిగిన టీఆర్ఎస్ ను నిలువరించాయి.
ఆట మారుతోంది…
గడచిన ఆరు సంవత్సరాలుగా తెలంగాణలో రాజకీయ క్రీడ ఏకపక్షంగా సాగుతోంది. 2014 వరకూ రాష్ట్ర రాజకీయాల్లో ఉప ప్రాంతీయ పార్టీగా నాలుగైదు జిల్లాలకు పరిమితమైన టీఆర్ఎస్ రాష్ట్ర విభజనతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. భావోద్వేగాలతో లభించిన ఈ విజయం శాశ్వతం కావాలంటే మిగిలిన పార్టీలన్నీ కుచించుకుపోవాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. ముందుగా టీడీపీ, వైసీపీ , వామపక్షాలు చాపచుట్టేశాయి. తర్వాత కాంగ్రెసును లక్ష్యంగా చేసుకుంది. దానిని కూడా బలహీనపరిచింది. రెండు మూడు బలమైన ప్రత్యర్థి పార్టీలు ఉన్పప్పుడు అధికార పార్టీని వ్యతిరేకించే ఓటరుకు కొంత సందిగ్ధత ఉంటుంది. ఓట్ల చీలిక పవర్ లో ఉన్న పార్టీకి లాభిస్తుంది. అదే బలమైన సంఘటిత ప్రతిపక్షం కనిపిస్తే తటస్థ ఓటర్లు, స్వింగ్ ఓటర్లు దానివైపు మొగ్గు చూపుతారు. బలహీనమైన పార్టీలు క్రమేపీ కనుమరుగై ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భవిస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిందదే. బీజేపీ తన ప్రాబల్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించుకోవడానికి ప్రాతిపదికను చేజిక్కించుకుంది. హైదరాబాద్ ఎన్నిక కేవలం స్థానిక సంస్థ కే పరిమితమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఓట్ షేర్ రాష్ట్రంలో నలభై శాతం లోపుగానే ఉంటే ప్రతిపక్షాల ఉమ్మడి ఓట్ షేర్ 60 శాతం వరకూ ఉంది. ఇందులో మెజార్టీ భాగం పోలరైజ్ అయితే ఆట మారిపోతుంది.
వారి ‘సత్తా’అంతంతే…
తెలంగాణ రాష్ట్రసమితి పేరు చెబితే ధిక్కారం నలుదిశలా ప్రతిధ్వనిస్తుంది. ఒకవైపు రాజకీయ ఎత్తుగడలు వేస్తూనే అప్పటికి హవా చెలాయిస్తున్న పార్టీలపై ధిక్కార ధోరణిని కనబరిచారు కేసీఆర్. ఉద్యమ కాలంలో అది ప్రజలకు బాగా నచ్చింది. పట్టం గట్టారు. అదే వైఖరిని సొంత రాష్ట్రంలోనూ కనబరచడం మొదలు పెట్టారు టీఆర్ఎస్ నాయకులు. తమకు ప్రత్యామ్నాయమే లేదన్నదశకు చేరిపోయారు. అగ్ర నాయకత్వంలోనూ అదే పంథా ప్రబలిపోయింది. తమకు తిరుగులేదన్న పూల్స్ ప్యారడైజ్ లో నివసించడం మొదలు పెట్టేశారు. అదే ఇప్పుడు టీఆర్ఎస్ కొంపముంచుతోంది. ధిక్కార స్వరాన్ని ఇష్టపడే తెలంగాణ ఓటర్లు అధికార పార్టీ ఏకపక్ష పెత్తనంపై ధిక్కారం వినిపిస్తున్నారు. పార్టీకి కేసీఆర్ తర్వాత స్థానాల్లో ప్రాధాన్యం వహించే కేటీఆర్, హరీశ్, కవిత లు ముగ్గురికీ ఓటర్లు చేదు అనుభవం మిగిల్చారు. కవితను ఓడించినప్పుడే జాగ్రత్త పడి ఉంటే దుబ్బాకలో అన్నీ తానైన హరీశ్ కు అంత పెద్ద దెబ్బ తగిలేది కాదు. వీరిరువురి అనుభవాలను అధ్యయనం చేసి అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే కేటీఆర్ కు హైదరాబాద్ లో రాజకీయ విషాదం వచ్చి ఉండేది కాదు. వారసులు ముగ్గురి సత్తా పార్టీ వేవ్ కు అనుగుణంగానే ఉంటుంది తప్ప వారు ట్రెండ్ ను సెట్ చేయలేరన్న వాస్తవం కేసీఆర్ కు ఇప్పటికైనా అర్థం కావాలి.
కాంగ్రెసుకు చెల్లు చీటీ…
హస్తం పార్టీకి ఓటరు తగినన్ని అవకాశాలు ఇచ్చి చూశాడనే చెప్పాలి. అసెంబ్లీ , పార్లమెంటుకు సాగిన మూడు ప్రధాన సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు, ఓట్ల పరంగా ప్రతిపక్ష స్థానం కట్టబెట్టారు. అధికారం ఉంటే తప్ప తోచుబాటు కాని హస్తం నేతలు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఎటువంటి పోరాట పటిమను కనబరచలేకపోయారు. ఆ పార్టీ అధిష్ఠానం మొదలు రాష్ట్ర నాయకత్వం వరకూ ప్రతిపక్ష స్థానంలో బలంగా పనిచేయలేకపోయారు. దాంతో కాంగ్రెసు ప్రత్యామ్నాయశక్తిగా పనికిరాదని ఓటర్లు తేల్చేస్తున్నారు. రాష్ట్రం ఇచ్చినప్పటికీ పార్టీని గెలిపించలేకపోయారని అధిష్ఠానానికి రాష్ట్ర నాయకులపై ఆగ్రహం. తమలో సమర్థులను గుర్తించడం లేదని అధిష్ఠానంపై స్థానిక నేతలకు అసంతృప్తి. సోనియా, రాహుల్ వంటి అగ్రనాయకులతో తెలంగాణ ఓటరు కనెక్టు కావడం లేదు. అదే సమయంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి తరహాలో స్ఫూర్తిని నింపే నాయకుడూ తెలంగాణలో కరవు అయ్యాడు. ఫలితంగా పార్టీలో నాయకుల కుంపట్లు తప్ప ఓట్లు రాబట్టే స్థితి కనిపించడం లేదు. కొత్తగా సామాజిక కుంపటి పెట్టాలని కాంగ్రెసు నాయకుల్లో కొందరి డిమాండ్. అధికార పార్టీపై పోరాట పటిమ, పటిష్ఠమైన అజెండా, ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆవిష్కరించకపోతే ఎన్ని కుంపట్లు పెట్టినా అన్నం ఉడకదు. అగ్రనాయకత్వం దిశానిర్దేశం కొరవడటం, లోపభూయిష్టమైన లోకల్ లీడర్ షిప్ వెరసి ప్రస్తుతం చరిత్రాత్మక కాంగ్రెసు దిక్కులు చూడాల్సిన పరిస్థితిని కల్పించాయి. కొంతకాలానికి నవ్యాంధ్రలో కాంగ్రెసు పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితే తెలంగాణలోనూ పునరావృతం కావచ్చు.
-ఎడిటోరియల్ డెస్క్