ఆత్మ విమర్శ ఎక్కడా? పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న గోరంట్ల
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ కష్టకాలంలోకూడా వెన్నంటి నడిచిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు గొప్పేమి కాదని [more]
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ కష్టకాలంలోకూడా వెన్నంటి నడిచిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు గొప్పేమి కాదని [more]
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ కష్టకాలంలోకూడా వెన్నంటి నడిచిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు గొప్పేమి కాదని ఆయనతో రామారావు బతికున్నంతకాలం పోరాడి మంత్రి పదవిని సైతం త్యాగం చేసి విలువలకు కట్టుబడిన పసుపు నాయకుడు. ఎన్టీఆర్ మరణానంతరం చేసేది లేక చంద్రబాబు సైకిల్ ఎక్కేసినా పార్టీ గాడి తప్పుతున్నప్పుడల్లా తన మాటల తూటాలతో హెచ్చరికలు చేసే చిన్నన్న. ఆయనే రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తాజాగా సోషల్ మీడియా లో ఆయన పెట్టిన పోస్ట్ కలకలం సృష్టిస్తుంది.
ఈ ఓటమికి ఎవరు బాధ్యులు ….?
ఎన్నికలకు ముందే పార్టీలో జరుగుతున్న అరాచకాలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాహాటంగాను, పార్టీ వేదికలపైనా అంతర్గత సమీక్షల్లో చంద్రబాబును పదేపదే హెచ్చరించారు. పక్క పార్టీల వారిని చేర్చుకోవడం అక్కడితో ఆగకుండా పార్టీ జండా భుజాన మోస్తున్న వారిని వదిలి ఫిరాయింపు దారులను అందలం ఎక్కించడం వంటి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ ఇవన్నీ అరణ్య రోదనే అయ్యాయి. మంత్రి పదవికోసమే గోరంట్ల ఇవన్నీ చేస్తున్నారంటూ ఆయన ప్రత్యర్ధులు కారాలు మిరియాలు నూరేవారు. చివరికి పోలింగ్ తరువాత జరిగిన సమీక్షలో సైతం గోరంట్ల తాను గెలుస్తున్నా అంటూ నివేదిక ఇచ్చినప్పుడు వెటకారపు వ్యాఖ్యలతో కోటరీ మాటలు విని చిన్నబుచ్చారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న గోరంట్ల కడుపులో వున్నది కక్కేశారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యులు ఎవరు ? ఎవరు పార్టీలో బాధ్యత తీసుకోవాలి ? పాలిట్ బ్యూరో సభ్యులా ?మన నాయకుడా ? పార్టీ జండా మోసే మన కార్యకర్త ? ఈవీఎం లా ? జన్మభూమి కమిటీలా ? ఎమ్యెల్యేలా ? మంత్రులా ? అసలు ఆత్మ విమర్శ ఎక్కడా అంటూ నిప్పులే చెరిగారు.
మొదలైన అంతర్మధనం ….
గోరంట్ల పెట్టిన పోస్టింగ్ తో ఇప్పుడు పసుపు దళం లో ఒక్కో గళం తమకోణంలో పరాజయాన్ని విశ్లేషిస్తున్నారు. సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు బాబు టెలికాన్ఫరెన్స్ లు కొంప ముంచాయని తేల్చారు. ఇక టిడిపి లో హ్యూమన్ టచ్ ఎక్కడ అంటూ ఎమ్యెల్సీ జూపూడి ప్రభాకర రావు విరుచుకుపడ్డారు. రియల్ టైం గవర్నెన్స్ పై నమ్మకంతో అన్నిటిని గాలికి వదిలేశారని మరో ఎమ్యెల్సీ గౌరవాని శ్రీనివాసులు వాపోయారు. ఎన్నికల ముందే స్పీకర్ కోడెల పై జనాగ్రహాన్ని గుర్తించలేకపోయామని దివ్యవాణి తన సందేశం వినిపించారు. తాజా ప్రభుత్వం పెట్టబోయే కేసులు టిడిపి వారికి రావాలిసిన బిల్లులపై లీగల్ సెల్ అండగా నిలవకపోతే కష్టమేనని బీద రవిచంద్ర తన ఆవేదన తానూ చెప్పుకున్నారు. ఇలా కర్ణుడి చావుకి కారణాల్లా టిడిపి ఓటమికి దారితీసిన పరిస్థితులపై గోరంట్ల సొంత పార్టీకే ఆత్మవిమర్శ పేరుతో కర్రు కాల్చి వాత పెట్టేశారని ఆ పార్టీ వర్గాల్లోనే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది.