పంజరంలో చిలుక పాట్లు…?
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ , తన పరువు తానే తీసుకుంటోంది. చాలా సంవత్సరాల క్రితమే పంజరంలో చిలుక అంటూ సుప్రీం కోర్టు చేత చీవాట్టు పెట్టించుకుంది. [more]
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ , తన పరువు తానే తీసుకుంటోంది. చాలా సంవత్సరాల క్రితమే పంజరంలో చిలుక అంటూ సుప్రీం కోర్టు చేత చీవాట్టు పెట్టించుకుంది. [more]
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ , తన పరువు తానే తీసుకుంటోంది. చాలా సంవత్సరాల క్రితమే పంజరంలో చిలుక అంటూ సుప్రీం కోర్టు చేత చీవాట్టు పెట్టించుకుంది. దేశవ్యాప్తంగా రకరకాల ఆరోపణలు, అవమానాలతో కుంగిపోతున్న సంస్థకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి . చట్ట ప్రకారం సొంతంగా ఆలోచించాల్సిన వ్యవహారాల్లోనూ తడబడుతోంది. రెండు నాలుకలతో మాట్లాడుతోంది. ఫలితంగా బోర్లాపడుతోంది. ప్రజల్లో పలచనవుతోంది. ఇప్పుడున్న చెడ్డపేరుకు తోడు మరింతగా బురదను జల్లుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో విచారణలో ఉన్న కేసుల విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కేసుల విషయంలోనూ దర్యాప్తు సంస్థకు స్పష్టత లోపించింది. ఒకవైపు కోర్టుకు ఏంచెప్పాలో తెలియడం లేదు. మరోవైపు రాజకీయ బాసుల మనసు అంతుచిక్కడం లేదు. దాంతో ద్వైధీ భావంతో సీబీఐ సతమతమవుతోంది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి తెలివిగా వ్యవహరించాలని ప్రయత్నిస్తూ , సాగదీతను ఆశ్రయిస్తోంది. ప్రత్యర్థులైన రాజకీయ పార్టీలకు దొరికిపోతోంది.
సొంత విధానం లోపించిన సీబీఐ…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణ రాజు న్యాయపోరాటం చేస్తున్నారు. వ్యక్తిగతమైన ఆసక్తితోనే ఆయన ముఖ్యమంత్రిపై పంతం పట్టారు. తనపట్ల వివక్షతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిని రాజకీయంగా దెబ్బతీయాలనేది ఆయన లక్ష్యం. ఏదో రకంగా ఆయన ప్రతిష్టకు మచ్చ కలిగించాలనే ప్రయత్నంలో భాగంగానే సీబీఐ కోర్టును ఆశ్రయించారు. కేసు జాప్యం కావడానికి పరోక్ష కారణమైన కేంద్ర దర్యాప్తు సంస్థను కూడా ఆయన తప్పుపట్టారు. బెయిల్ రద్దు చేయడం అంత సులభం కాదని రఘురామకు తెలుసు. అయితే సీబీఐ వ్యవహారంలో న్యాయస్థానాన్ని అప్రమత్తం చేయడం , దర్యాప్తు సంస్తను వేలెత్తి చూపడం ఆయన టార్గెట్లుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బెయిల్ రద్దు అయితే తాను రాజకీయంగా లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్సులూ ఉన్నాయి. అందుకే కోట్ల రూపాయల వ్యయంతో న్యాయవాదులను నియమించుకుని ఈ కేసుపై పట్టుబిగించి కూర్చున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఈ కేసులో తన వాదన ఏమిటో వినిపించలేని నిస్సహాయ స్థితిలో సీబీఐ కూరుకుపోయింది. బెయిల్ విషయంలో న్యాయస్థానానికి తన అభిప్రాయాన్ని వెల్లడించలేక చేతులెత్తేసింది.
కేంద్రం వైపు చూస్తోంది….
తాను దర్యాప్తు చేస్తున్న కేసులో మెరిట్స్, డీమెరిట్స్ కచ్చితంగా దర్యాప్తు సంస్థకు తెలియాలి. ఉన్నత న్యాయస్థానం ద్వారా బెయిల్ పొంది ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. ఏడేళ్లుగా ఆయన కేసును కొలిక్కి తీసుకురావడంలో సీబీఐ వైఫల్యం చెందింది. ఇంతటి సుదీర్ఘకాలం విచారణ నత్తనడకన సాగడంలో రాజకీయ నేతల ప్రమేయం ఉందనే వాదనలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి కేసును నాన్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాలు రెంటినీ అదుపు చేయవచ్చనేది కేంద్రం ఆలోచన. అందుకే సీబీఐ సైతం ఈ కేసు విషయంలో చాలా సమయం తీసుకుంటోంది. ప్రతిసందర్బంలోనూ న్యాయస్థానం ఒత్తిడితో మాత్రమే సీబీఐ స్పందిస్తోంది. తాజాగా బెయిల్ రద్దు పిటిషన్ విషయంలోనూ అదే చేసింది. అబిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే కోర్టు విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని రెండు నెలల క్రితమే తేల్చి చెప్పింది . మళ్లీ మధ్యలో మాట మార్చుకుని అఫడవిట్ ద్వారా లిఖిత పూర్వకంగా వాదనలు వినిపిస్తానంది. దీంతో సీబీఐ స్టాండ్ మార్చుకుందేమోననే అనుమానాలు తలెత్తాయి. తన వాదనలు వినిపించాల్సిన సమయం వచ్చే సరికి మళ్లీ కోర్టు విచక్షణ ప్రకారమే చేయాలంటూ చల్లగా తప్పుకుంది. ఇంత పెద్ద దర్యాప్తు సంస్థ తన స్పష్టమైన నిర్ణయాన్ని ఎందుకు చెప్పలేకపోతోందనే ప్రశ్న ఎదురైతే రాజకీయాలే అడ్డుగా కనిపిస్తాయి.
మౌనం మంచిదేనా..?
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కోర్టుకు రెగ్యులర్ గా హాజరయ్యేవారు. అప్పట్లో దర్యాప్తును వేగవంతం చేసి ఉంటే వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేది. ఆయన దోషిగానో, నిర్దోషిగానో తేలిపోయేవారు. అటు ఇటు కాని స్థితిలో ఏళ్ల తరబడి కేసు సాగుతూ ఉంది. రెండేళ్లుగా సీఎం హోదాలో ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేని పరిస్థితి ముఖ్యమంత్రిది. ఇదిలా ఉంటే మధ్యలో రఘురామ లేవనెత్తిన అంశాలు సీబీఐని ఇరకాటంలోకి నెట్టేశాయి. జగన్ కేసులో సాక్షులుగా ఉన్నవారంతా ప్రభుత్వంలో అధికారులు. వారి పనితీరును మదింపు చేసే అధికారం ఆయన చేతిలోనే ఉంది. అందువల్ల సాక్షులను ప్రబావితం చేసే అవకాశం ఉందని రఘురామ కోర్టులో బలంగా వాదిస్తున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సీబీఐ సేకరించింది. అందువల్ల ప్రభావితం చేయడం సాధ్యం కాదని చెప్పవచ్చు. లేదంటే తాజా పరిస్థితులను అన్నిటినీ మదింపు చేసుకుని బెయిల్ రద్దుకు అనుకూలంగా తన వాదన వినిపించవచ్చు. గతంలోనే జగన్ బెయిల్ రద్దు చేయమని సీబీఐ ఒకసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానికి కట్టుబడి ఉండటమో, లేదంటే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పడమో స్పష్టంగా తేల్చుకోవాలి. లేదంటే రఘురామ చేసే ఆరోపణలకు బలిపశువుగా మారిపోవాల్సి ఉంటుంది. మౌనం రాజకీయ నేతలకు మంచిది కావచ్చు. కానీ దర్యాప్తు సంస్థలకు ఒక స్పష్టమైన వైఖరి లేకపోతే వాటి ప్రతిష్ఠ దెబ్బతింటుంది.
-ఎడిటోరియల్ డెస్క్