మరోసారి మొండి చేయి… అయినా ఏం చేయలేం?
ఆంధ్రప్రదేశ్ కు మరోసారి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు ఏ దిశగానూ బడ్జెట్ లో ప్రయత్నం చేయలేదు. దీంతో అధికార [more]
ఆంధ్రప్రదేశ్ కు మరోసారి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు ఏ దిశగానూ బడ్జెట్ లో ప్రయత్నం చేయలేదు. దీంతో అధికార [more]
ఆంధ్రప్రదేశ్ కు మరోసారి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు ఏ దిశగానూ బడ్జెట్ లో ప్రయత్నం చేయలేదు. దీంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏపీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రెండో బడ్జెట్ లోనూ ఏపీకి మొండి చేయి చూపింది. పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
పోలవరం ప్రాజెక్టు…..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు విడుదల కావాల్సి ఉంది. భూ సేకరణ నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉన్నా దానిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వంపై దాదాపు నలభై వేల కోట్లకు పైబడి భారం పడే అవకాశముంది. దీనిపై కూడా ఎక్కడా బడ్జెట్ లో ఊసే లేదు. చిత్తూరు విజయవాడ హైవే విస్తరణ తప్పించి ఏపీ గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేకపోవడం విశేషం.
హోదా గురించి….
రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిథులను కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావన లేదు. ఏపీకి ఉన్న ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. ఇక ప్రత్యేక హాదా గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. విశాఖ రైల్వ జోన్ గురించి కూడా నిర్మలా సీతారామన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై వైసీపీ, టీడీపీ ఎంపీలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు.
ఎన్నికలు జరిగే చోటనే….
ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో ఎక్కువ నిధులను కేటాయించారు. అసలే ఆర్థికంగా నష్టాలు, కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను మాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక్కడ రాజకీయాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి కలసి వచ్చింది. అధికార, విపక్ష పార్టీలు బీజేపీ చెంత చేరడానికి తహతహలాడుతుండటమే ఇందుకు కారణంగా చెప్పాలి. తెలుగింటి కోడలు నిర్మలమ్మ కనీసం ఏపీ పరిస్థితిని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.