ఆయన కూడా అంతేగా
కాంగ్రెసు హయాంలో కష్టాల్లో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించేందుకే ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నామంటుంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. కానీ ఆచరణకు, అది చెప్పే మాటలకు ఎక్కడా పొంతన [more]
కాంగ్రెసు హయాంలో కష్టాల్లో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించేందుకే ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నామంటుంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. కానీ ఆచరణకు, అది చెప్పే మాటలకు ఎక్కడా పొంతన [more]
కాంగ్రెసు హయాంలో కష్టాల్లో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించేందుకే ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నామంటుంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. కానీ ఆచరణకు, అది చెప్పే మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. నిరుద్యోగం, పేదరికం ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అందులో మా తప్పు లేదు. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా వంటి విపత్తులు కారణమని తప్పించుకోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని జాతీయ ప్రభుత్వం పదే పదే చెబుతుంది. కానీ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే సామాన్యుడి గుండె గుభేల్ మనక తప్పదు. కేంద్ర ప్రభుత్వం అప్పు 116 లక్షల కోట్ల రూపాయల కు చేరుకుంది. అంటే జాతీయోత్పత్తిలో సగానికి పైగానే కేంద్రం రుణాలు చెల్లించాల్సి ఉందన్నమాట. 134 కోట్ల జనాభాకు 116 లక్షల కోట్ల అప్పు అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలను తీసేస్తే ప్రతి మనిషి సగటున లక్ష రూపాయలు అప్పులో ఉన్నట్లే లెక్క. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు వీటికి అదనం. ఆంధ్రప్రదేశ్ రుణం దాదాపు నాలుగు లక్షల కోట్ల కు చేరుకుంది. అంటే మరో లక్ష రూపాయలు ప్రతి మనిషి పైన పడుతుంది. ప్రజా ప్రభుత్వాల రుణాలంటే ప్రజా రుణాలకిందే లెక్క. అంటే మనకు తెలియకుండానే ఒక్కో వ్యక్తి సగటున రానున్న 25 సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలు వడ్డీ తో కలిపి చెల్లించాలన్నమాట. ఆమేరకు పన్నులు , ఇతర రూపాల్లో భారం తప్పదు. అందులోనూ ఇకపై ప్రభుత్వాలు అప్పులు కొత్తగా చేయకుండా ఉంటేనే సుమా.
రాష్ట్రాలకు సుద్దులు…
రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తోంది. అధికారమే పరమావధిగా వ్యవహరించే పార్టీలు అనుచితమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఫలితంగా రాష్ట్రాలు రుణ సంక్షోభంలో కూరుకుపోతున్న మాట వాస్తవం. కానీ తాను ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా రాష్ట్రాలకు సుద్దులు చెప్పే నైతిక అర్హత కేంద్రానికి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గడచిన ఆరు నెలల్లోనే 6.5 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కొత్తగా అప్పులు తెచ్చింది. అలాగని ఖజానా వట్టి పోవడం లేదు. పన్నుల వసూళ్లు బాగానే ఉన్నాయి. అయినా కేంద్రం ఖర్చులకు పొంతన ఉండటం లేదు. కనీసం రాష్ట్రాలను నియంత్రించడానికి ఎఫ్ ఆర్ బీఎం వంటి చట్టాలు ఉన్నాయి. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతం మేరకే ఏటా కొత్త రుణాలు చేసేందుకు వీలుంటుంది. కానీ కేంద్రానికి ఈ విషయంలో ఎటువంటి నియంత్రణలు లేవు. ఆ వెసులుబాటును వినియోగించుకుంటూ కేంద్రం తన వ్యయాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇందులో మౌలిక వసతుల కల్పనకు వినియోగించే పెట్టుబడి వ్యయం నామమాత్రంగానే ఉంటోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే మెరుగ్గా కనిపిస్తున్నాయి.
అప్పు కూడా వరమే…
రాష్ట్రాల నిస్సహాయతను ఒక రకంగా కేంద్రం ఎగతాళి చేస్తోంది. దీర్ఘకాలిక ఆలోచన లోపించిన ప్రాంతీయ నాయకులు అప్పుల కోసం కేంద్రం వైపు దీనంగా చూస్తున్నారు. తాజా రుణాలు చేసుకోవడానికి ఎఫ్ఆర్బీఎం పరిమితులను సడలించాలంటూ నిరంతరం వేడుకుంటున్నారు. దీనిని సాకుగా చేసుకుంటూ సంస్కరణల చట్రంలోకి రాష్ట్ర ప్రభుత్వాలను లాగేస్తోంది. విద్యుత్ సంస్కరణలు, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో పన్నుల సంస్కరణలు వంటి వాటిని ముందుకు తెస్తోంది. వీటి అంతిమ లక్ష్యం హేతుబద్ధత పేరుతో పన్నులు పెంచడమే. అప్పు తీసుకునే అవకాశం కల్పించినందుకు గాను ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించేలా సంస్కరణలను అమలు చేస్తోంది. కేంద్రం సూచిస్తున్న ఒకే దేశం ఒకే రేషన్ కార్డు, వ్యాపార సరళీకరణ వంటి అంశాలలో పెద్దగా ప్రజలకు నష్టం లేదు. కానీ విద్యుత్, స్థానిక సంస్తల పన్నుల సంస్కరణ మాత్రం గుదిబండగా మారబోతున్నాయి. ఇప్పటికే నిండా మునిగిన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అన్నిటికీ తల ఊపుతున్నాయి. తాజాగా ప్రదాని నరేంద్రమోడీ రాష్ట్రాలు తమ సంస్కరణలు అంగీకరించడం ద్వారా లక్ష కోట్ల పైచిలుకు సమకూర్చుకున్నారంటూ చాలా ఘనంగా ప్రకటించారు. అదేమీ కేంద్రం ఇచ్చిన గ్రాంటు కాదు. ప్రభుత్వాలు తెచ్చుకున్న అప్పు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఘనత ఏముందో ఎవరికీ అర్తం కాదు.
ఉపాధి పెంచాలి…
రుణాల విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు పెద్దగా తేడా లేదు. జాతీయ స్థాయిలో పార్టీ అజెండా అమలు కోసం, శాశ్వత అధికారం కోసం కేంద్రం లోని పెద్దలు ఇబ్బడిముబ్బడిగా ఖర్చులు చేస్తున్నారు. రాష్ట్రాల్లోనూ అదే తంతు రిపీట్ అవుతోంది. పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన వైపు కేంద్రం, రాష్ట్రాలు దృష్టి పెట్టడం లేదు. స్టాక్ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులను చూసి అంతా బాగుందనుకునే పరిస్థితిని కల్పిస్తున్నారు. వాస్తవానికి దేశంలో స్టాక్ మార్కెట్లు, హెచ్చుతగ్గులు, లాభనష్టాలతో రెండు శాతం ప్రజలకు కూడా సంబంధం ఉండదు. అమెరికా వంటి దేశాల్లో వడ్డీ రేట్టు బాగుంటే ఆ నిధులు ఎప్పుడైనా ఎగిరిపోతాయి. అందువల్ల దేశాన్ని స్వయంసమృద్దం చేసే దిశలో ప్రభుత్వాలు వ్యయాన్ని మళ్లించాలి. కరోనా వంటి ప్రపంచ విపత్తులతో ఇతర దేశాలు చాలా గుణపాఠాలు నేర్చుకున్నాయి. దేశీయంగా పెట్టుబడులు పెంచుకుని స్థిరత్వం సాధించాలనే ప్రయత్నాల్లో పడ్డాయి. ప్రవాసులకు ఉద్యోగాలు కూడా క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చు. ఇంకా మనం విదేశాలపైనే ఆధారపడితే భవిష్యత్ తరాలు ఇబ్బందుల పాలు కాక తప్పదు. ఈ బాధ్యతను తీసుకోవాల్సిన కర్తవ్యం మాత్రం కేంద్రంపైనే ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్