ఎక్స్ పీరియన్స్ లెస్సన్స్ నేర్పిందా..?
తన రాజకీయ జీవితంలో ఏ ఎన్నికలోనూ కష్టపడనంతగా ఈసారి కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈసారి కచ్చితంగా గెలిచి అధికారాన్ని కొనసాగించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. జగన్ [more]
తన రాజకీయ జీవితంలో ఏ ఎన్నికలోనూ కష్టపడనంతగా ఈసారి కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈసారి కచ్చితంగా గెలిచి అధికారాన్ని కొనసాగించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. జగన్ [more]
తన రాజకీయ జీవితంలో ఏ ఎన్నికలోనూ కష్టపడనంతగా ఈసారి కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈసారి కచ్చితంగా గెలిచి అధికారాన్ని కొనసాగించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని దక్కనీయొద్దని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన మూడు నెలలుగా తీవ్రంగా శ్రమించారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల వేళ ఓటర్ల ఆకర్షించేలా పసుపు – కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేయడంతో పాటు పింఛన్లను రెట్టింపు చేశారు. గెలుపోటములు నిర్ణయించే రైతులు, డ్వాక్రా మహిళలు, వృద్ధులను ఎన్నికలకు మూడు నెలల ముందు ఈ పథకాల ద్వారా తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. అయితే, చంద్రబాబుపై గత ఎన్నికల సమయంలో ఉన్న కొన్ని నమ్మకాలు ఈసారి ప్రజల్లో కనిపించడం లేదు. పలు విషయాల్లో ఆయన వైఖరి వల్ల ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కుంటున్నారు.
రాజధాని పూర్తి కాలేదు..
గత ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ జగన్ అధికారంలోకి వస్తారని అంతా భావించినా అనుభవం ఉందనే ఏకైక కారణంతో చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు ఆంధ్రా ఓటర్లు. అయితే, ఆయన అనుభవం రాష్ట్రానికి పెద్దగా పనిచేయలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నేనే నిర్మించానని చెప్పే చంద్రబాబు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మాత్రం వెనుకబడ్డారు. ఏ దేశానికి వెళితే ఆ దేశం తరహా రాజధాని కడతానని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లలో ఈ విషయంలో విఫలమయ్యారు. అనేక డిజైన్ల పేరుతో రాజధాని విషయంలో టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరగడంతో ప్రజలకు రాజధాని విషయంలో అంచనాలు తారస్థాయిలో ఉండేవి. అయితే, ఐదేళ్ల తర్వాత చూస్తే రాజధానిలో తాత్కాలిక భవనాలే కనిపిస్తున్నాయి. శాశ్వత భవనాలు ఇంకా పునాధి దశలోనే ఉన్నాయి. టీడీపీ చేసిన అతిప్రచారం వల్ల ఈ తాత్కాలిక భవనాలు ప్రజలను సంతృప్తి పరచడం లేదు.
ప్రత్యేక హోదాపై ఎన్ని మాటలో..?
ఇక, ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు అవలంభించిన వైఖరి ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులూ బీజేపీ చెప్పిన దానికి చంద్రబాబు సరేనన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటన చేస్తే అర్థరాత్రి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు స్వాగతించారు. హోదా కంటే ప్యాకేజీనే మిన్న అన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు. ఇప్పుడు తీరా ఎన్నికలకు ఏడాది ముందు ఒక్కసారిగా బీజేపీ నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేక హోదానే కావాలంటున్నారు. గతంలో టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా బలంగా ఉన్న సమయంలో ఇటువంటివి జనాల్లోకి పెద్దగా వెళ్లేవి కావు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో చేసిన విభిన్న ప్రకటనలు ప్రజల్లోకి వెళ్లాయి. ఆయన మాటలు మార్చిన తీరు ప్రజలు గమనించారు. సరే, టీడీపీ అంటున్నట్లుగా బీజేపీ మోసం చేసిందే అనుకున్నా… 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈ విషయాన్ని నాలుగేళ్ల వరకు ఎందుకు పసిగట్టలేకపోయారు.? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అనుభవం ఉన్న వారని, ఆయన చేతిలో రాష్ట్రం బాగుంటుందనే ఆయనను గెలిపిస్తే అమాయకంగా ఎలా మోసపోయారు అంటున్నారు.
పోలవరం పూర్తి కాలేదే..!
ఇక, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ చంద్రబాబు మాట ఐదేళ్లలో నిలబడలేదు. నిండు అసెంబ్లీలో 2018లో పోలవరం పూర్తి చేస్తాం.. రాసి పెట్టుకో అని మంత్రి దేవినేని ఉమ ప్రకటించారు. తీరా 2019 వచ్చినా ఇంకా పోలవరం పూర్తి కాలేదు. దీంతో ఈ హామీని కూడా నిలబెట్టుకోకుండానే బాబు ఎన్నికలకు వెళుతున్నారు. ఇక, ఈ ఎన్నికల వేళ చంద్రబాబు వైఖరి కూడా ఆయనకు మైనస్ గా మారుతోంది. అంత అనుభవం ఉన్న నేత ఎన్నికలకు మూడు నెలల ముందు పథకాలు ప్రవేశపెట్టడం, జగన్ ప్రకటించిన పథకాలను తన మేనిఫెస్టోలో పెట్టడం వంటివి దెబ్బతీసే అవకాశం ఉంది. అంత అనుభవం ఉన్న నేత ప్రజల అవసరాలను గుర్తించాలి. వారి జీవితాల్లో మార్పులు తెచ్చేలా పథకాలు రూపొందించాలి. ఎప్పటికీ గుర్తుండేలా పథకాలు తేవాలి. కానీ, అది జరగలేదు. మొత్తానికి, గత ఎన్నికల్లో పనిచేసిన ‘అనుభవం’ అనే అస్త్రాన్ని ఈసారి చంద్రబాబు బలహీనం చేసుకున్నట్లే కనిపిస్తోంది. అయితే, అలాగని చంద్రబాబు అనుభవాన్ని ఇంకా నమ్మే వారు కూడా చాలా మందే ఉంటారు. పైగా చంద్రబాబుకు అధికారం ఇవ్వకపోతే అభివృద్ధి మధ్యలో ఆగిపోతుందనే ఆలోచన కూడా కొంతమందిలో ఉంది. మరి, చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు మరోసారి అధికారం కట్టబెడతారో లేదో రేపు తేల్చేయనున్నారు ఓటర్లు.