విజన్ 2020 రివర్స్ అవుతుందా…?
తెలుగుదేశం పార్టీ జాతకం బహు గొప్పది, కేవలం అతి సన్నిహితులు, మిత్రుల సమక్షంలో చిన్నగా ప్రారంభమైన టీడీపీకి నలభయ్యేళ్ళ ఆయుష్షు ఉంటుందని నాడు అన్న నందమూరి తారక [more]
తెలుగుదేశం పార్టీ జాతకం బహు గొప్పది, కేవలం అతి సన్నిహితులు, మిత్రుల సమక్షంలో చిన్నగా ప్రారంభమైన టీడీపీకి నలభయ్యేళ్ళ ఆయుష్షు ఉంటుందని నాడు అన్న నందమూరి తారక [more]
తెలుగుదేశం పార్టీ జాతకం బహు గొప్పది, కేవలం అతి సన్నిహితులు, మిత్రుల సమక్షంలో చిన్నగా ప్రారంభమైన టీడీపీకి నలభయ్యేళ్ళ ఆయుష్షు ఉంటుందని నాడు అన్న నందమూరి తారక రామారావు కూడా ఊహించలేదు. ఆయన అప్పట్లోనే ఓ మాట అనే వారు, టీడీపీ నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది అని. కానీ అల్లుడు చంద్రబాబు ఆయన పోకముందే పార్టీని, ప్రభుత్వాన్ని తీసేసుకుని అన్న గారికి ఇంటిదారి చూపించారు. ఆ కలతతో ఆయన మరణించారు. అప్పటి నుంచి టీడీపీకి సుదీర్ఘకాలం సారధ్యం వహించిన ఘనత చంద్రబాబుదే. పార్టీ పెట్టిన అన్న గారు 14 ఏళ్ళు ప్రెసిడెంట్ గా ఉంటే, పాతికేళ్ళు చంద్రబాబు ఎదురులేకుండా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్టీయాఆర్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఏడున్నర ఏళ్ళకు పైగా పనిచేస్తే చంద్రబాబు కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పదమూడున్నరేళ్ళు పనిచేశారు. ఇలా మామా అల్లుళ్ళను అందలం ఎక్కించిన టీడీపీ అదృష్ట జాతకం క్రమంగా మసకబారుతోందనిపిస్తోంది.
ఆ ఆశతోనే ఇంకా…
టీడీపీకి ఎన్నడూ లేని విధంగా తాజా ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. దాంతో పార్టీకి భవిష్యత్తు లేదని నాయకులంతా దాదాపుగా తీర్మానించేసుకున్నారు. అయితే మరో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. అందులో ఏమైనా మార్పు కనిపిస్తుందా అన్న ఆశతో కొందరు ఉంటే, ఇతర పార్టీల నుంచి సరైన రాయబేరాలు చూసుకుని గోడ దాటేందుకు మరికొందరు వేచి చూస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది చివర్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. నాటికి టీడీపీ భవిష్యత్తు ముఖచిత్రం పూర్తిగా తేలనుంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి లోకల్ బాడీ ఎన్నికలు కలసివస్తాయి. పైగా ఏపీలో మొత్తానికి మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. ప్రజలు సైతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే స్థానిక ఎన్నికల్లో ఓటు చేయడం పరిపాటి. ఇక జగన్ తన పట్టుని గట్టిపరచుకునే చర్యలు చాలానే చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూసినపుడు టీడీపీకి స్థానిక ఆశలు పెద్దగా లేవని చెపాలి. అయితే చంద్రబాబు తాను ఆశాజీవినని చెబుతున్నారు కాబట్టి కొంత ఆసక్తి మాత్రం ఉంది.
బాబుతోనే కధ ముగుస్తుందా…?
ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లకు వైసీపీ గెలుచుకుంటే మరుక్షణం టీడీపీ మొత్తానికి మొత్తం ఖాళీ అవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు వయసు దృష్ట్యాని, చినబాబు నాయకత్వ దక్షతని పరిగణలోకి తీసుకున్నా కూడా తమ్ముళ్ళు పసుపు శిబిరంలో ఎక్కువ కాలం ఉండలేరని అంటున్నారు. దాంతో కొత్త ఏడాది అంటే 2020 నాటికి ఏపీలో టీడీపీ దాదాపుగా కనుమరుగు అవుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా అప్పట్లో చంద్రబాబు ప్రతి రోజు విజన్ 2020 అని అంటూండేవారు. అది ఈ రూపం తీసుకుంటుందని బహుశా బాబు కూడా అనుకోరేమో మరి. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ రాజకీయానికైనా కాలపరిమితి ఉంటుందన్నది నిజమని వందేళ్ళకు పైబడిన కాంగ్రెస్ పార్టీ తాజాగా నిరూపిస్తోంది. ఏపీలో ఎన్నో చారిత్రాత్మక ఘటనలకు సాక్షిగా నిలిచిన టీడీపీకి ఇపుడున్న గడ్డుకాలం చూస్తూంటే ఆ పార్టీ మరిన్ని చికాకులు పడుతుందని అర్ధమైపోతోంది. ఇప్పటికే తమ్ముళ్ళు ఇతర పార్టీలకు క్యూ కడుతున్న వైనం చూస్తే ఆ విషయం అది పూర్తిగా స్పష్టమైపోతోంది.