నాడు అండగా ఉన్న వర్గంలో నేడు ఆగ్రహం?
తెలుగుదేశం పార్టీ అంటే తమదని ఏనాడో ఒక బలమైన సామాజిక వర్గం సొంతం చేసుకున్నారు. వారి అండదండలు, పెట్టుబడులు కూడా ఈ పార్టీని ఇంతదాకా తీసుకువచ్చాయి. నిజానికి [more]
తెలుగుదేశం పార్టీ అంటే తమదని ఏనాడో ఒక బలమైన సామాజిక వర్గం సొంతం చేసుకున్నారు. వారి అండదండలు, పెట్టుబడులు కూడా ఈ పార్టీని ఇంతదాకా తీసుకువచ్చాయి. నిజానికి [more]
తెలుగుదేశం పార్టీ అంటే తమదని ఏనాడో ఒక బలమైన సామాజిక వర్గం సొంతం చేసుకున్నారు. వారి అండదండలు, పెట్టుబడులు కూడా ఈ పార్టీని ఇంతదాకా తీసుకువచ్చాయి. నిజానికి బలమైన కులానికి ఒక రాజకీయ పార్టీ ఉండాలి అన్న సత్యాన్ని తెలుగుదేశం ఆవిర్భావంతోనే అందరికీ తెలియచేశారనుకోవాలి. వైసీపీ మరో బలమైన వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది అంటే దానికి టీడీపీ చూపించిన దారే అని చెప్పాలి. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో బలమైన సామాజిక వర్గం ఓటమి తరువాత బాగా మదనపడుతోంది అంటున్నారు.
బాబు విధానాలే….?
తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ అన్ని వర్గాల పార్టీగా తీర్చిదిద్దారు. ఆనాడు బీసీలను ఆయన చేరదీసి పార్టీకి వెన్నెముకగా మార్చారు. ఆ తరువాత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ల పాటు అలాగే చేసినా కూడా రెండు సార్లు పార్టీ ఓడిపోవడంతో 2014 నాటికి తన విధానాలను ఒక్కసారిగా మార్చుకున్నారు. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా కమ్మల ముద్ర పార్టీ మీద బలంగా పడింది. అమరావతి రాజధాని ఆ సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటు కావడం కూడా ఇందులో భాగంగా చెప్పుకోవాలి. అయితే విపక్షంలోకి వచ్చాక చంద్రబాబు పూర్తిగా యూ టర్న్ తీసుకున్నారు.
వారికే పెద్ద పీట….
టీడీపీకి ఆది నుంచి గట్టి మద్దతుగా ఉన్న బీసీ సామాజికవర్గాన్ని చంద్రబాబు మళ్లీ ముందుకు తెస్తున్నారు. పార్టీలో కీలకమైన పదవులను బీసీలతోనే భర్తీ చేస్తున్నారు. అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ పదవి కట్టబెట్టిన బాబు మరో కీలకమైన తెలుగు యువత అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన గంగుపల్లి శ్రీరాం అనే చేనేత సామాజిక వర్గానికి చెందిన యువకుడికి అప్పగించారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరాం కి తెలుగు యువత పదవిని కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు బీసీలను దువ్వే ప్రయత్నం చేస్తున్నారు.
బూమరాంగేనా …?
పోయిన చోట వెతుక్కోవాలని సామెత. చంద్రబాబు అదే చేస్తున్నారు. కానీ తెలుగుదేశంలో ఉన్న కమ్మలు మాత్రం తమను పక్కన పెడుతున్నారు అని చంద్రబాబు మీద మండుతున్నారు. తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం ఆశించిన వారిలో పరిటాల శ్రీరాం కూడా ఉన్నారని చెబుతారు. కానీ ఆయన్ని చంద్రబాబు సైడ్ చేసి బీసీలకే ఆ పదవిని కేటాయించారు. ఈ క్రమంలో కమ్మలు రగులుతున్నారని అంటున్నారు. ఏపీలో బీసీల కోసం వైసీపీ పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. అలాగే నామినేటెడ్ పదవులు కూడా వారికి కట్టబెట్టింది. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ పదవులు బీసీలకు పంచడం వల్ల ఉపయోగం ఉంటుందా అన్నది ఒక చర్చ అయితే ఇపుడు అక్కరకు వచ్చి ఆదుకోవాల్సిన కమ్మలు అలిగితే రెండు విధాలుగా పార్టీకి నష్టం చేకూరుతుంది అన్నది మరో చర్చ. చూడాలి మరి చంద్రబాబు ఎలా వీటిని బ్యాలెన్స్ చేస్తారో.