బాబు వార్నింగ్ కు వారు భయపడలేదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను కట్టడి చేయలేకపోతున్నారు. అసలే 2019 ఎన్నికల్లో షాక్ తో ఉన్న నేతలు వరస ఓటములతో బాగా డీలాపడిపోయారు. వరసగా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను కట్టడి చేయలేకపోతున్నారు. అసలే 2019 ఎన్నికల్లో షాక్ తో ఉన్న నేతలు వరస ఓటములతో బాగా డీలాపడిపోయారు. వరసగా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను కట్టడి చేయలేకపోతున్నారు. అసలే 2019 ఎన్నికల్లో షాక్ తో ఉన్న నేతలు వరస ఓటములతో బాగా డీలాపడిపోయారు. వరసగా వచ్చిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ చాలా మంది దూరంగా ఉన్నారు. ఆర్థికంగా బలమైన ఉన్న నేతలనే బరిలోకి కొందరు దింపారు. మరికొందరు కరోనా పేరుతో ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. ఈ విషయాన్ని కొందరు కేంద్ర పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామంటూ…?
అయితే చంద్రబాబు ఈ మధ్య నేతలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే నేతలు అందుకు ధీటుగానే సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. తాము గత ఎన్నికలకు చేసిన అప్పుల నుంచే ఇంకా కోలుకోలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ వ్యాపారాలన్నీ బంద్ అయ్యాయని కూడా కొందరు చెప్పారు. తాము హైదరాబాద్ లో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నామని గుంటూరు జిల్లాకు చెందిన ఒక నేత చెప్పినట్లు తెలిసింది.
మూడేళ్ల ముందంటే కష్టం….
మూడేళ్ల ముందు నుంచే నియోజకవర్గంలో పార్టీని నడపాలంటే తమ శక్తి సరపోదని కొందరు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఒకటిన్నర సంవత్సరం ముందు మాత్రమే తాము నియోజకవర్గంలో యాక్టివ్ గా కార్యక్రమాలు చేపడతామని, అప్పటి వరకూ అడపాదడపా నియోజకవర్గాన్ని పర్యటిస్తామని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు అలా అయితే ఎలా కుదురుతుంది? ప్రజల్లో ఉంటేనే కదా? వచ్చే ఎన్నికల్లో గెలిచేది అని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
భయం పోయిందని….
దీంతో చంద్రబాబు నేతల్లో భయం పోయిందని గ్రహించారు. దీంతో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సి వస్తుందని, టీడీపీలో నేతలకు కొరత లేదని చంద్రబాబు ఒకింత గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. కరోనా తగ్గిన వెంటనే నియోజకవర్గాల్లో యాక్టివ్ గా లేని నేతలను తాను ఉపేక్షించబోనని, ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. కాని నేతలు మాత్రం బాబు వార్నింగ్ ను లైట్ గానే తీసుకున్నారట. మొత్తం మీద చంద్రబాబు అంటే నేతలకు భయంలేకుండా పోయిందన్న టాక్ పార్టీలో గట్టిగా వినిపిస్తుంది.