జగన్ ఫోబియా వదిలించుకుంటేనే …?
చాణక్య నీతి ఏంటి అంటే శత్రువు సామర్ధ్యాన్ని గుర్తించడం. దాన్ని గౌరవించడం. ఆ మీదట దాన్ని ఎలా ఎదుర్కోవాలో తగిన వ్యూహాలను రూపొందించుకోవడం. అపుడే ఎటువంటి అసాధ్యమైన [more]
చాణక్య నీతి ఏంటి అంటే శత్రువు సామర్ధ్యాన్ని గుర్తించడం. దాన్ని గౌరవించడం. ఆ మీదట దాన్ని ఎలా ఎదుర్కోవాలో తగిన వ్యూహాలను రూపొందించుకోవడం. అపుడే ఎటువంటి అసాధ్యమైన [more]
చాణక్య నీతి ఏంటి అంటే శత్రువు సామర్ధ్యాన్ని గుర్తించడం. దాన్ని గౌరవించడం. ఆ మీదట దాన్ని ఎలా ఎదుర్కోవాలో తగిన వ్యూహాలను రూపొందించుకోవడం. అపుడే ఎటువంటి అసాధ్యమైన సందర్భాల్లో అయినా విజయం సిద్ధిస్తుంది. అయితే చాలా మంది శత్రువు సత్తాను సులువుగానే గుర్తిస్తారు. కానీ దాన్ని ఎదుర్కొనే విషయంలోనే తప్పటడుగులు వేస్తారు. శత్రువు మీద పీకల మీద కోపంతో చివరికి అతన్నే సదా ధ్యానిస్తూ ప్రియమైన శత్రువుగా మారిపోతారు. జగన్ విషయంలో చంద్రబాబు చేస్తున్నది అదే.
ద్వేషంతోనే…?
చంద్రబాబు జగన్ని రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నారు. ఆ సంగతి ఆయన ఎంత దాచుకున్నా బయటపడిపోతోంది. అది చివరికి జనాల్లోకి కూడా వెళ్ళిపోయింది. జగన్ని చంద్రబాబు తిట్టకపోతే వింత. తిడితే ఆశ్చర్యం ఏముంది అన్నంతగా జనాల మైండ్ సెట్ ని మార్చేసిన ఘనత టీడీపీ అధినేతదే. అయిన దానికీ కాని దానికీ, బోడి గుండుకూ మోకాలికి ముడిపెట్టి జగన్ని తిట్టడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారు. ఆ విషయంలో తాను నూరు శాతం సక్సెస్ అవుతున్నారు. మరి జగన్ని తిడితే ఓట్లు ఎందుకు పడడంలేదు. ఎందుకు వరస ఎన్నికల్లో బొక్క బోర్లా పడుతున్నారు. ఈ సంగతిని మాత్రం టీడీపీ అధినాయకత్వం ఎందుకో విస్మరిస్తోంది.
లాజిక్ ఉండాలిగా…?
కరోనా విషయంలో జగన్ని పట్టుకుని తిడితే జనాల మద్దతు దొరుకుతుందా. అది జాతీయ అంతర్జాతీయ సమస్య. వ్యాక్సినేషన్ గురించి, మరో దాని గురించి జగన్ మీద నిందలు వేస్తే జనాలు హర్షిస్తారా. ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు ఏంటి అన్నది జనాలకు బాగా తెలుసు. కేంద్రంలోని మోడీని ఒక్క మాట అనకుండా జగన్ మీద గన్ పెడితే చంద్రబాబుకు మద్దతు ఎప్పటికైనా దొరుకుతుందా అన్నదే ప్రశ్న. ఇక కేంద్రం ఈ మధ్యలో చేసిన అరాచకాల గురించి గొంతెత్తి ప్రశ్నిస్తూనే జగన్ మీద కూడా నాలుగు రాళ్ళు వేస్తే బాబు రాజకీయం బ్యాలన్స్ గా ఉండేదేమో. కానీ అలా కాకుండా కేవలం జగన్ వల్లనే ఇదంతా అంటూ అక్కడికి జగనే కరోనా సృష్టి కర్త అయినట్లుగా లాజిక్కులకు అందని మాటల గారడీలు చేస్తే జనం ఎలా నమ్ముతారు అన్నదే అర్ధం కావాల్సిన విషయం.
అలా అనిపించాలిగా …?
చంద్రబాబు అక్కసుతో మాట్లాడుతున్నారు, తన కుర్చీని జగన్ లాగేశాడని ఆడిపోసు కుంటున్నారు అన్న మైండ్ సెట్ నుంచి జనాలు బయటపడితేనే తప్ప టీడీపీ అపజయాల నుంచి విజయాల బాట పట్టదు అన్నది ఒక విశ్లేషణ. జగన్ ని మూడు పొద్దులూ తిడతాను, ఆయనకు మద్దతుగా ఓట్లేసిన జనాల మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తానూ అని టీడీపీ నేతలు అనుకుంటే నష్టం వారికేనని కూడా అంటున్నారు. ఇక చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన నిర్మాణాత్మకమైన సూచనలు ప్రభుత్వానికి చేయవచ్చు. అదే సమయంలో పాలకులకు ఇలా చేయాలని సూచించవచ్చు. ఇక కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే కిమ్మనకుండా ఉంటూ, పెట్రోల్ డీజిల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేసినా పట్టించుకోకుండా ఉంటూ కేవలం జగన్ మీదనే నా గురి పెడతాను అని మడి కట్టుకుని చేసే పసుపు పాలిటిక్స్ కి మాత్రం జనం మద్దతు దక్కదనే చెప్పాలి. ఏది ఏమైనా జగన్ ఫోబియాతో చంద్రబాబు ఉన్నారు అన్నది వాస్తవం. దాని నుంచి ఆయన తొందరగా బయటపడాలి. అంతే కాదు ప్రజా సమస్యలు టేకప్ చేస్తూ వాటి మీదనే పోరాడాలి. ఈ సందర్భంలో తప్పు ఎవరు చేసినా నిఖార్సుగా నిలదీస్తేనే ఆయన చిత్తశుద్ధి బయటపడుతుంది, టీడీపీ కూడా బతికి బట్టకడుతుంది అంటున్నారు.