టీడీపీ పతనానికి ముహూర్తం… ?
తెలుగుదేశం పార్టీకి గడచిన రెండేళ్ళుగా అంతా బ్యాడ్ గానే ఉంది. ఏది ముట్టుకుంటే అది షాక్ కొడుతోంది. వ్యూహాలు కూడా రివర్స్ అవుతున్నాయి. అపర చాణక్యుడు అని [more]
తెలుగుదేశం పార్టీకి గడచిన రెండేళ్ళుగా అంతా బ్యాడ్ గానే ఉంది. ఏది ముట్టుకుంటే అది షాక్ కొడుతోంది. వ్యూహాలు కూడా రివర్స్ అవుతున్నాయి. అపర చాణక్యుడు అని [more]
తెలుగుదేశం పార్టీకి గడచిన రెండేళ్ళుగా అంతా బ్యాడ్ గానే ఉంది. ఏది ముట్టుకుంటే అది షాక్ కొడుతోంది. వ్యూహాలు కూడా రివర్స్ అవుతున్నాయి. అపర చాణక్యుడు అని పేరున్న చంద్రబాబు సైతం చేష్టలుడిగి చూడాల్సివస్తోంది. ఈ నేపధ్యంలో పసుపు పార్టీ శిబిరం కూడా నిండా నిరాశతో కృంగి పోతోంది. దానికి తోడు అన్నట్లుగా వైసీపీ సర్కార్ కూడా దూకుడు చేస్తోంది. ఎవరి ఎక్కడ తోక జాడించినా అరెస్ట్ అస్త్రంతో ముందుకు వస్తోంది. ఈ దెబ్బకు తమ్ముళ్ళు అంతా సైలెంట్ అవుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో టీడీపీని చూస్తే ఎవరికైనా రేపటి ఎన్నికల్లో గెలుస్తుంది, మళ్ళీ గత వైభవం దక్కుతుంది అన్న ఆశలైతే పెద్దగా లేవు.
బాంబు పేల్చారా…?
ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ప్రతీ రోజూ చంద్రబాబు మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ విమర్శలకు మరింత పొలిటికల్ మసాలా జోడించారు. అదెలా అంటే 2019 మే 23 టీడీపీ కి ఘోర పరాజయం అందించిన రోజు. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటిదే మరో రోజు కూడా త్వరలో రానుంది అంటూ జోస్యమే చెప్పేశారు. జూలై 23 డేట్ టీడీపీకి చీకటి రోజుగా మిగిలిపోతుందని కూడా ఆయన అంటున్నారు. ఆ రోజున టీడీపీ పతనం ఖాయమని కూడా విజయసాయిరెడ్డి గుట్టు విప్పేశారు. మరి ఆ రోజు ఏం జరుగుతుంది అన్న టెన్షన్ అయితే అపుడే తమ్ముళ్లలో మొదలైంది.
షాకులున్నాయా…?
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీకి గట్టి షాకులే తగులుతున్నాయి. తాము బడా నాయకులమని, తమ జోలికి ఎవరూ రారు అని మురిసిపోయే వారంతా ఖంగు తినేలా వరసపెట్టి అరెస్ట్ అవుతున్నారు. మరి ఇదిలా ఉంటే జూలై 23న వైసీపీ పెద్దలు ఏం చేస్తారు అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ తప్ప మిగిలిన వారిని అందరినీ జగన్ సర్కార్ టచ్ చేసేసింది. ఇపుడున్న పరిస్థితుల్లో ఎవరూ అరెస్టులకు అతీతులు కారు అన్న భావన అయితే టీడీపీలో ఉంది. మరి జూలై 23న చంద్రబాబు కానీ లోకేష్ కానీ అరెస్ట్ అవుతారా అన్న మాట కూడా వినిపిస్తోంది. దానికి తగినట్లుగా తెర వెనక కసరత్తు జరుగుతోందా అన్నది కూడా చర్చగా ఉందిట.
కుప్ప కూల్చేస్తారా …?
మరో వైపు చూస్తే టీడీపీలో అఫీషియల్ గా నలుగురు ఎమ్మెల్యేలు గోడ దాటేశారు. ఆ విషయం చంద్రబాబే ఒప్పుకున్నారు. ఇదే బాటలో మరి కొందరు కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. జగన్ సై అనాలే కానీ వారంతా కూడా ఫ్యాన్ నీడన సేద తీరేందుకు వస్తామని అంటున్నారు. మరి ఆ ముచ్చట కూడా మరో రెండు నెలల్లో జరుగుతుందా అన్నదే టీడీపీలో సాగుతున్న చర్చట. అంటే ఒక వైపు టీడీపీని దెబ్బ తీస్తూనే మరో వైపు అధినాయకుడు చంద్రబాబు మీద కూడా భారీ యాక్షన్ కి వైసీపీ పెద్దలు స్కెచ్ గీస్తున్నారా అన్నదే చూడాల్సిన విషయంగా ఉంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి లాంటి వారు చెప్పారు అంటే ఎంతో కొంత నమ్మాల్సిందే. తెర వెనక జరిగేది తెర ముందుకు రావడానికి గట్టిగా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. మరి ఈలోగా ఎవరు ఏవైపుగా సర్దుకుంటారో ఎవరు అడ్డంగా బుక్ అవుతారో రాజకీయ తెర మీద చూడాల్సిందే.