తెలుగు రెబెల్ మహిళ… ?
అదేంటో చంద్రబాబుకు చాలా యాంటీ సెంటిమెంట్లు ఉన్నాయి. ఆయన పార్టీలో ఎవరికైతే కాస్తా విలువ ఇచ్చి చేరదీస్తారో వారే ఆయనకు దెబ్బ కొడతారు. అలా కేసీఆర్ నుంచి [more]
అదేంటో చంద్రబాబుకు చాలా యాంటీ సెంటిమెంట్లు ఉన్నాయి. ఆయన పార్టీలో ఎవరికైతే కాస్తా విలువ ఇచ్చి చేరదీస్తారో వారే ఆయనకు దెబ్బ కొడతారు. అలా కేసీఆర్ నుంచి [more]
అదేంటో చంద్రబాబుకు చాలా యాంటీ సెంటిమెంట్లు ఉన్నాయి. ఆయన పార్టీలో ఎవరికైతే కాస్తా విలువ ఇచ్చి చేరదీస్తారో వారే ఆయనకు దెబ్బ కొడతారు. అలా కేసీఆర్ నుంచి మొదలుపెడితే నిన్నటి తెలంగాణా టీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ దాకా ఉంటారు. ఇక చంద్రబాబుకు మరో విషయంలో కూడా అచ్చిరాని వ్యవహారం ఉంది. అదే తెలుగు మహిళ అధ్యక్ష పదవి. ఇది ఎవరికి ఇచ్చినా కూడా వారు చంద్రబాబుని విమర్శించి మరీ పార్టీ గేటు దాటేస్తారు. దీనికి టీడీపీ చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
జయప్రద నుంచి…?
తెలుగుదేశం పార్టీలో జయప్రద కీలకమైన పాత్ర పోషించారు. ఆమె ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికారం బదలాయింపు సాఫీగా జరిగే విషయంలో తనదైన కీలక పాత్ర పోషించారు అంటారు. దానికి గానూ చంద్రబాబు ఆమెను ఒకసారి రాజ్యసభకు పంపించారు. ఆమె కూడా అప్పట్లో టీడీపీ అభ్యర్ధుల విజయానికి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. అయితే ఆమెను రెండవమారు రాజ్యసభకు చంద్రబాబు నామినేట్ చేయకపోవడంతో అలిగారు. అంతే కాదు, చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ తెలుగు మహిళ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆమె బాబు టీడీపీ వైపు కన్నెత్తి చూడలేదు.
ముళ్ళు గుచ్చేశాయి…
ఇక జయప్రద తరువాత టీడీపీకి కావాల్సిన సినీ గ్లామర్ ని రోజా బాగానే అద్దారు. ఆమె టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా నిరూపించుకున్నారు. చంద్రబాబుని ఒక్క మాట అంటే చాలు తాను సహించలేను అన్నట్లుగా దూకుడు చేసేవారు. ఏకంగా ఆమె నాటి కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ ని కూడా ఎదిరించారు. అటువంటి రోజాకు చంద్రబాబు రెండుసార్లు టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. తనకు నచ్చిన చోట సీటు ఇవ్వలేదని, టీడీపీ నేతలే కావాలని ఓడించారని రోజా అభియోగం. అందుకే ఆమె వైఎస్సార్ ఉండగానే టీడీపీకి దూరం జరిగారు. ఇక జగన్ పార్టీ పెట్టడంలో అందులో కీలకమైన పాత్ర పోషిస్తూ చంద్రబాబు మీద గట్టి విమర్శలే చేస్తూ వస్తున్నారు. ఇక లోకేష్ ని సైతం రోజా అసలు వదలరు అన్న సంగతి తెలిసిందే.
ఈమె సైతం…?
ఇపుడు మరో మాజీ తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి కూడా టీడీపీకి తాజాగా గుడ్ బై కొట్టేశారు. విజయనగరం జిల్లా ఎస్ కోటకు చెందిన ఆమె గిరిజన నాయకురాలు. ఏయూలో ఆమె ఉద్యోగిగా ఉండేవారు. 1999 ఎన్నికల వేళ చంద్రబాబు తటస్థులకు టికెట్లు అంటూ ఆమెను రాజకీయాల్లోకి తెచ్చారు. అలా ఎస్ కోటకు నాడు ఎమ్మెల్యేగా ఆమె పనిచేశారు. ఆ తరువాత ఆమె సేవలను తెలుగు మహిళా విభాగానికి కూడా చంద్రబాబు వాడుకున్నారు. ఆమె కుమార్తె స్వాతిని కూడా విజయనగరం జెడ్పీ చైర్ పర్సన్ చేశారు. కానీ టీడీపీలో తనకు తగిన గౌరవం లేదంటూ ఆమె తాజాగా రాజీనామా చేశారు. ఆమె చంద్రబాబు మీద గట్టిగానే విరుచుకుపడుతున్నారు. మొత్తానికి చూస్తే తెలుగుదేశానికి మహిళా నేతలు అచ్చిరావడం లేదా అన్న చర్చ అయితే ఉందిపుడు.