ఫైర్ ఏ మాత్రం తగ్గలేదుగా
నలభై ఏళ్ల రాజకీయ జీవితం. ఏడు పదుల వయస్సు. అయినా తన అనుభవం అంత లేని యువ ముఖ్యమంత్రితో పోరాటం చేయాలిసి వస్తుంది. ఇదంతా ఇలా జరుగుతుందని [more]
నలభై ఏళ్ల రాజకీయ జీవితం. ఏడు పదుల వయస్సు. అయినా తన అనుభవం అంత లేని యువ ముఖ్యమంత్రితో పోరాటం చేయాలిసి వస్తుంది. ఇదంతా ఇలా జరుగుతుందని [more]
నలభై ఏళ్ల రాజకీయ జీవితం. ఏడు పదుల వయస్సు. అయినా తన అనుభవం అంత లేని యువ ముఖ్యమంత్రితో పోరాటం చేయాలిసి వస్తుంది. ఇదంతా ఇలా జరుగుతుందని ఆయన ఎప్పుడూ ఊహించి ఉండరు. కానీ విధి విచిత్రం కుమారుడి వయసు వున్న జగన్ పై నేరుగా రాజకీయ యుద్ధం తప్పడం లేదు. తరచూ తన సీనియారిటీని గుర్తు చేస్తూ అంతా తనకు గౌరవం ఇవ్వాలని ప్రత్యక్షంగా, పరోక్షంగా కోరుకుంటారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఆయనకు ఈ విషయంలో నిరాశే మిగులుతుంది. అధికారపక్షం నేరుగా పదేపదే చంద్రబాబు చెప్పే మాటలనే వల్లెవేస్తూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఆయనపై విమర్శల దాడికి దిగడం రివాజుగా మారిపోయింది.
ఆ వయసులో బాబు …
నిజానికి చంద్రబాబు రాజకీయ అనుభవానికి వెనుకుండి పార్టీ ని ముందుకు నడిపించాలిసిన పరిస్థితి. కానీ కుమారుడు నారా లోకేష్ చెత్త నాయకత్వం వల్లే గుడ్ బై అంటూ పలువురు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఈ దశలో లోకేష్ నేతృత్వంలో కీలకమైన అమరావతి ఉద్యమం సాగి విఫలం అయితే భవిష్యత్తులో టిడిపికి తీరని నష్టం వాటిల్లుతుందని గుర్తించే చంద్రబాబు నేరుగా సీన్ లోకి రావాలిసి వస్తుంది. అడపాదడపా చినబాబు కి రైతుల పరామర్శ పర్యటనలు వంటివి మాత్రమే అయన అప్పగించి కీలకమైన కార్యక్రమాలన్నీ స్వయంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి కే పరిమితం అయిన రాజధాని ఉద్యమాన్ని మెరుపు కార్యక్రమాలతో హీట్ ఎక్కించేందుకు సిద్ధం అయ్యారు చంద్రబాబు.
ఏ మాత్రం తగ్గడం లేదుగా …
మనవడితో హాయిగా గడపాలిసిన స్థితిలో చంద్రబాబు కి పార్టీని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం గా మారింది. అమరావతి లో రాజధాని ఉండేలా పోరాటంలో ఏ మాత్రం సఫలం కాకపోయినా రాజకీయంగా, ఆర్ధికంగా, సొంత సామాజికవర్గంలో బాబు బలహీన పడిపోతారు. అందుకే తనలో పోరాట పటిమ లోపల అలానే ఉందని గుర్తు చేసేందుకు రోజుకో ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టేస్తున్నారు. నిన్నమొన్నటివరకు తనకు సెల్యూట్ కొట్టిన పోలీసులే వారి వాహనాల్లో కుక్కి తరలిస్తున్నా వెనక్కి తగ్గకూడదని డిసైడ్ అయిపోయారు. ఏసీ గదులు వదిలి నిత్యం ప్రజలతోనే మమేకం అయ్యే కార్యక్రమాల్లో ఉండటమే భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆ దిశగానే ముందుకు పోతున్నారు.
చుక్కలు కనిపిస్తున్నా …
ఈ నేపథ్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి జేఏసీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం ఆయన్ను పోలీస్ బస్సు ఎక్కించి ఇంటికి తరలించడం హైడ్రామా నే సృష్ట్టించింది. ఈ సందర్భంగా చంద్రబాబు చమటలు కక్కడం టిడిపి శ్రేణులను వేదనకు గురిచేసింది. వృద్ధాప్య దశలో చంద్రబాబు యువకుడిలా పోరాటాలకు దిగడం ఆయనలో పొలిటికల్ ఫైర్ ఏ మాత్రం తగ్గలేదన్నది సూచిస్తున్నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు కు జగన్ సర్కార్ చుక్కలు చూపిస్తున్న వైనం చర్చనీయాంశం అవుతుంది.
బాబు అండ్ కో డ్రామా కంపెనీ …
చంద్రబాబు సాగిస్తున్న ఉద్యమాన్ని వైసిపి మరీ తేలిగ్గా తీసిపారేయడం గమనార్హం. బాబు అండ్ కో డ్రామా పార్టీ అంటూ మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, సుచరిత వంటివారు ఆయన్ను ఆడేసుకుంటున్నారు. రోజుకో డ్రామా రచిస్తున్న చంద్రబాబు బస్సు యాత్రల పేరిట కొత్త స్క్రిప్ట్ తో వచ్చారని విమర్శల దాడి మొదలు పెట్టారు. అమరావతి ఉద్యమాన్ని తెగ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మూడు ప్రాంతాల అభివృద్ధి ఆయనకు అఖ్ఖరలేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
గాలి తీసేస్తున్న సోషల్ మీడియా …
చంద్రబాబు గతంలో ప్రత్యేక హోదా కావాలంటూ యువత చేస్తున్న ఉద్యమాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన గాలి తీసేస్తున్నాయి. హోదా అంటే చాలు జైలుకు పోతారంటూ నాటి ఉద్యమంలో పాల్గొనే వారిని చంద్రబాబు భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే నేడు తాజాగా విద్యార్థులు అమరావతి ఉద్యమానికి రోడ్లపైకి రావాలంటూ పిలుపు నివ్వడం సామాజిక వేదికలపై నాడు నేడు అంటూ వీడియోలతో కుమ్మేస్తున్నారు. ఇది టిడిపి అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణి ని బయటపెడుతుందంటూ నెటిజెన్స్ విమర్శలకు దారితీసింది. విభజన సమయంలో రెండు కళ్ళ సిద్ద్ధాంతం, హోదా సమయంలో ఒకలా, ఇప్పుడు మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా పార్టీ నేతలతో స్టేట్ మెంట్స్ కొట్టిస్తూ మూడు కళ్ళ సిద్ధాంతం అంటూ విమర్శల వర్షం కురుస్తుంది. వీటన్నిటిని ఇప్పుడు టిడిపి ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.